logo

డిస్మిస్‌ అయినా.. ఉన్నత హోదాలోకి!

డీసీఐలో గతంలో పని చేసిన సదరు ఉద్యోగి కొన్ని కారణాలతో డిస్మిస్‌ అయ్యారని, ఆ విషయాన్ని చెప్పకుండా .. ఇతర సంస్థల్లో పని చేసి మళ్లీ డీసీఐలో ఉన్నత హోదాలో నియమితులయ్యారని విజిలెన్స్‌ అధికారులు నిగ్గుతేల్చడం

Updated : 24 May 2022 05:47 IST
వాస్తవాలు చెప్పలేదని నిగ్గుతేల్చిన ‘విజిలెన్స్‌’
‘డీసీఐ’లో ఉన్నతాధికారిపై నివేదిక
ఈనాడు, విశాఖపట్నం

విశాఖలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌(డీసీఐ)లో కీలక హోదాలో ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్‌ నివేదిక పూర్తయింది. ఆయన వాస్తవాలు దాచిపెట్టినట్లు తేలింది.

డీసీఐలో గతంలో పని చేసిన సదరు ఉద్యోగి కొన్ని కారణాలతో డిస్మిస్‌ అయ్యారని, ఆ విషయాన్ని చెప్పకుండా .. ఇతర సంస్థల్లో పని చేసి మళ్లీ డీసీఐలో ఉన్నత హోదాలో నియమితులయ్యారని విజిలెన్స్‌ అధికారులు నిగ్గుతేల్చడం కలకలం రేపుతోంది. నౌకాశ్రయ ముఖ్య విజిలెన్స్‌ అధికారి (సి.వి.ఒ.) ఈ ఉదంతంపై విచారణ చేసి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలకు నౌకాశ్రయ ఛైర్మన్‌ దానిని మంత్రిత్వశాఖకు పంపినట్లు తెలుస్తోంది. 

మంత్రిత్వశాఖ ఎలా స్పందిస్తుందో..

నియామకాలకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయాన్ని దాచిపెట్టడం తప్పిదమే కాకుండా చట్టరీత్యా నేరమని కూడా విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు.అభ్యర్థి ఏమైనా వివరాలు ఇవ్వని పక్షంలో డీసీఐ నియామక ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఆయా విషయాలను ఆరా తీయాలి. మానవవనరుల విభాగం ఉన్నతాధికారులు, కంపెనీ సెక్రటరీ పేషీ ఉన్నతాధికారులు కూడా పూర్తిగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉన్నత హోదాలో విధులు నిర్వర్తించడానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి సాక్షాత్తూ డీసీఐలోనే గతంలో పని చేసిన నేపథ్యంలో ఆయన సర్వీసు రికార్డులకు సంబంధించిన సమాచారం మొత్తం సంబంధిత అధికారుల దగ్గర కచ్చితంగా ఉంటుంది. అయితే...22 ఏళ్ల కిందటి సమాచారం కావడంతో తమ దృష్టిలో లేదని, నాటి దస్త్రాలు కూడా పూర్తిగా అందుబాటులో లేవని ఆయా విభాగాల అధికారులు చెబుతున్నట్లు తెలిసింది.


* డీసీఐ ప్రస్తుతం నౌకాశ్రయాల కన్సార్టియం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని నౌకాశ్రయ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నియామక ప్రక్రియలో భాగంగా సమర్పించిన పత్రాల విశ్వసనీయత మీద, నియామక ప్రక్రియ జరిగిన తీరుమీద కూడా విజిలెన్స్‌ అధికారులు గతంలోనే నివేదిక పంపినట్లు సమాచారం.


30న బోర్డు సమావేశం: డీసీఐ బోర్డు సమావేశం 30న నిర్వహించబోతున్నారు. ఉన్నతాధికారిపై తీవ్రమైన ఆరోపణలు రావడం, విజిలెన్స్‌ అధికారులు కూడా వాటిని ధ్రువీకరించిన నేపథ్యంలో బోర్డులో చర్చించే అవకాశం ఉంది. సదరు అధికారిని కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం కూడా కీలకంగా మారింది. తన నియామకం మారీటైం, కంపెనీల చట్టాల ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలకు తావులేకుండా జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి చెబుతున్నారు. తన నియామకానికి వీలుగా నాటి అధికారులు కోరిన వివరాల్లో డిస్మిస్‌ వివరాలు చెప్పాలని ఎక్కడా లేదని, అందుకే తాను ప్రస్తావించలేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం. నియామక నిబంధనల ప్రకారం కీలక విషయాలను కచ్చితంగా వెల్లడించాల్సిందేనని విజిలెన్స్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని