logo

పరీక్షిస్తే పన్నీరు .. లేదంటే కన్నీరు !

సకల జీవకోటికి నీరే ప్రాణాధారం. అది శుద్ధంగా ఉండేలా నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం. పౌరులు తాగుతున్నది శుద్ధ జలమో.. కాదో తెలుసుకోవడానికి ప్రతి సచివాలయానికి జాతీయ జల్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా మల్టీ పారామీటర్‌ వాటర్‌ క్వాలిటీ ఫీల్డ్‌ టెస్ట్‌కిట్లు సరఫరా చేశారు.

Published : 28 Jun 2022 06:32 IST

సచివాలయాల్లో నిరుపయోగంగా టెస్టు కిట్లు

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

నర్సీపట్నం ల్యాబ్‌లో తాగునీటి పరీక్ష (పాత చిత్రం)

సకల జీవకోటికి నీరే ప్రాణాధారం. అది శుద్ధంగా ఉండేలా నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం. పౌరులు తాగుతున్నది శుద్ధ జలమో.. కాదో తెలుసుకోవడానికి ప్రతి సచివాలయానికి జాతీయ జల్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా మల్టీ పారామీటర్‌ వాటర్‌ క్వాలిటీ ఫీల్డ్‌ టెస్ట్‌కిట్లు సరఫరా చేశారు. ఏటా వర్షాకాలం ముందు, తర్వాత ఇంజినీరింగ్‌ సహాయకులు నీటి నమూనాలను పరీక్షించాలి. తాగేందుకు వినియోగిస్తున్న నీరు సురక్షితమైనదేనని భరోసా ఇవ్వాలి. పరీక్షల్లో సహకరించేందుకు వార్డు సభ్యుడు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, వాలంటీరు, పొదుపు సంఘం సభ్యురాలికి శిక్షణ ఇచ్చారు. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు పడుతున్నా పరీక్షల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయా, లేదా అన్నది ఉన్నతాధికారులు పర్యవేక్షించడం లేదు.

మూడు నెలల కిందట గొలుగొండ మండలం పీఎన్‌డీ పాలెంలో ఓ బోరు నీటిని పరీక్షించినప్పుడు ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గతంలో ఈ ఛాయలు లేవు. కొత్తగా సమస్య ఉత్పన్నమైంది. క్షేత్రస్థాయి పరీక్షలో గుర్తించి నర్సీపట్నంలోని ప్రయోగశాలకు విశ్లేషణకు పంపినప్పుడు రూఢీ జరిగింది. దీంతో అక్కడి ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాగునీటి పరీక్షల్లో అప్రమత్తంగా ఉండాలనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. వచ్చే ఏడాది జూన్‌ వరకు ఉపయోగపడేలా కిట్‌లు అన్ని సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. సమస్య ఉందని ఫిర్యాదు వచ్చినప్పుడే ఎక్కువగా స్పందిస్తున్నారు తప్ప మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేయడం లేదు. ఇంజినీరింగ్‌ సహాయకులు కొన్ని సచివాలయాలకు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇచ్చిన కిట్‌ 40 నుంచి 50 సార్లు మాత్రమే పరీక్ష చేయడానికి వీలుండటంతో చాలామంది పరీక్షించడం లేదు. గ్రామాల్లో నెలల తరబడి పరీక్షలే చేయడం లేదని పలువురు సర్పంచులు పేర్కొనడం గమనార్హం. ఎక్కడైనా తాగునీరు కలుషితమై వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ ఎంఎల్‌హెచ్‌వోలు పరీక్షలు చేయించేలా చూస్తున్నారు.

ఆర్వో ప్లాంట్లపై పర్యవేక్షణ ఏదీ?

ఇటీవల కాలంలో అన్ని చోట్లా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 35 వరకు ఈ ప్లాంట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో చాలామంది మున్సిపాల్టీ సరఫరా చేసే నీటిని ఇతర అవసరాలకు వాడుతూ, ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. అన్ని ప్లాంట్లు సరఫరా చేస్తున్న నీరు శుద్ధ జలమేనా, సురక్షితమేనా అన్నది అధికారులు పరీక్షించడం లేదు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్సు అనుమతి తప్పనిసరి. ఒకటి, రెండుచోట్ల తప్పించి ఎవరూ అనుమతి తీసుకోకుండానే వీటిని నిర్వహిస్తున్నారు. ఫుడ్‌ సేప్టీ అధికారులు కొద్దిరోజుల కిందట నర్సీపట్నంలో ఒక యూనిట్‌కి నోటీసు ఇచ్చారు. శుద్ధజలంలో నిర్ణీత మోతాదులో ఖనిజాలు లేకపోతే వ్యాధులొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నీటి నాణ్యత ప్రమాణాలు

పీహెచ్‌ 6.5 శాతం నుంచి 8.5 శాతం మించితే పొట్టలో మ్యూకస్‌ పొరకు హాని జరుగుతుంది.

డిసాల్యుడు సాలిడ్స్‌ 500 మి.గ్రా. నుంచి 2000 మి.గ్రా. దాటితే అన్నాశయంలో నొప్పితోపాటు కురుపులొచ్చే అవకాశం ఉంది.

భారత్వం (హార్డ్‌నెస్‌) 300 నుంచి 600 దాటినా, కాల్షియం 75 మి.గ్రా. నుంచి 200 మి.గ్రా. దాటినా ఆ నీరు ఇంటి అవసరాలకు పనికిరాదు.

ఫ్లోరైడ్‌ ఒక మిల్లీ గ్రాము నుంచి 1.5 మి.గ్రా. దాటితే పళ్లు పసుపు రంగులో మారి గార పడతాయి. ఎముకలు గుల్లబారుతాయి.

అల్యూమినియం 0.03 మి.గ్రా. నుంచి 0.2 మి.గ్రా. దాటితే మనో దౌర్భల్యంతో కూడిన ఒక విధమైన ఉన్మాదం, చిత్త వైకల్యం వంటివి ఎదురవుతాయి.

 

జాగ్రత్తలు మరవొద్దు

నీరు నురగతో వస్తుంటే వాడకూడదు. క్లోరిన్‌ వాసన వచ్చిన తర్వాత పరిశుభ్రంగా ఉన్నట్లు భావించినప్పుడే పట్టుకోవాలి.

కుళాయి నీటిని పట్టిన తర్వాత కొంతసేపు వినియోగించకుండా పక్కన పెడితే బురద వంటి వ్యర్థాలు ఉంటే అడుక్కు చేరుతాయి. తేరిన నీటిని వాడుకోచ్ఛు

కాచి చల్లార్చి, వడబోసిన నీటిని తాగడం సురక్షితం. నీళ్లు తాగిన తర్వాత వాంతులు, విరేచనాలు అయితే వైద్యులను సంప్రదించాలి. కలుషిత నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా ఉండొచ్ఛు

వినియోగదారులు ఆర్వో ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసే విధానాన్ని పరిశీలించాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే తీసుకోకపోవడమే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని