logo

‘వ్యాపారవేత్తల సమస్యలు పరిష్కరించండి’

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్‌.ఎం.ఇ.లు) చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని... వ్యాపారవేత్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని... వారి సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎం.ఎస్‌.ఎం.ఇ. జాతీయ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

Published : 28 Jun 2022 06:32 IST


ఎ.ఎస్‌.ఎన్‌.మెగామాల్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌. చిత్రంలో సృజన, మాల్‌ అధినేతలు

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్‌.ఎం.ఇ.లు) చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని... వ్యాపారవేత్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని... వారి సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎం.ఎస్‌.ఎం.ఇ. జాతీయ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని బాలల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ‘అంతర్జాతీయ ఎం.ఎస్‌.ఎం.ఇ. దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ్‌ పత్రం కోసం ప్రస్తుతం రూ.50 వేలు చెల్లించాల్సి వస్తోందని, గతంలో రూ.వెయ్యి మాత్రమే ఖర్చయ్యేదని పేర్కొన్నారు. ఎం.ఎస్‌.ఎం.ఇ. ఎస్‌.సి./ఎస్‌.టి. హబ్‌ను విశాఖలో ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు. పరిశ్రమల నుంచి వసూలు చేసే విద్యుత్తు ఛార్జీలు, విధించే పన్నులు ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటుచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ఒడిశాలో ఒక పరిశ్రమ ఏర్పాటుచేయడానికి భూమిని కేటాయించాలని ఓ పారిశ్రామికవేత్త దరఖాస్తు చేసుకుంటే గంజాం జిల్లా కలెక్టర్‌ స్వయంగా ఫోన్‌ చేసి తాను కారు పంపిస్తానని... భూమిని చూసుకోవడానికి రమ్మని పిలిచారని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అలాంటి పరిస్థితి ఇక్కడా రావాలన్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ సంచాలకురాలు సృజన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎం.ఎస్‌.ఎం.ఇ.ల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా యూనిట్ల వారీగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలకు రూ.64కోట్ల ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్స్‌) ఇవ్వడానికి సిఫార్సులు పంపామన్నారు. నూతన పరిశ్రమల కోసం మొత్తం 1005 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నూతన కార్యక్రమంలో భాగంగా విజయవంతంగా కొనసాగుతున్న అంకురసంస్థల ప్రతినిధులు వారు చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.400కోట్ల వ్యయంతో ఎ.పి.ఐ.ఐ.సి. ఐలా ప్రాంగణంలో నిర్మించబోతున్న ఎ.ఎస్‌.ఎన్‌.మెగా మాల్‌ నిర్మాణాన్ని మంత్రి అమర్‌నాథ్‌ లాంఛనంగా ప్రారంభించారు. మాల్‌ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభంకాగా... ఆ సంస్థ 1500 మందికి ఉద్యోగాలు కల్పించనుందని నిర్వాహకులు వివరించారు.

పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ:

ప్రతి రాష్ట్రానికి ఒక ప్రముఖ నగరం ఉన్నట్లే... ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ నగరం కాకుండా మరే ఇతర ప్రముఖ నగరం ఉందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖలోని ఆటోనగర్‌ యథావిధిగా కొనసాగుతుందని... కొత్త యూనిట్లు పెట్టాలనుకున్న వారు అనకాపల్లిలో ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు. విశాఖ కలెక్టర్‌ సూచన మేరకు విశాఖలో రెండు పారిశ్రామికవాడలు ఏర్పాటుచేస్తామని, అందుకు అవసరమైన భూమిని సిద్ధం చేయాలని సూచించారు. ఎం.ఎస్‌.ఎం.ఇ.లపై ఈనెల 30వ తేదీన ప్రధానితో సమావేశం ఉందని, అందులోనూ కొన్ని సమస్యల ప్రస్తావిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎ.పి.ఎం.ఎస్‌.ఎం.ఇ. అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌, ఎం.ఎస్‌.ఎం.ఇ. అభివృద్ధి సంస్థ ఉప సంచాలకుడు జి.వి.ఆర్‌.నాయుడు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, ఎ.పి.ఎం.ఎస్‌.ఎం.ఇ. అభివృద్ధి కార్పొరేషన్‌ సంచాలకులు నదియా, శారద తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని