logo

ఓ వారం... అధ్యయనానికో వరం

దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ పోషించిన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. అందుకు అనుసరించిన విధానాలేమిటన్న అంశంపై చాలా మందికి అవగాహన లేదు. దేశ వాసులు ఆయన వెంట నడవడానికి... ఆయన్ను అంతగా ఆదరించడానికి...

Published : 09 Aug 2022 05:46 IST

మహాత్ముని ప్రత్యేకత తెలిపే కోర్సులు

ఈనాడు, విశాఖపట్నం: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ పోషించిన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. అందుకు అనుసరించిన విధానాలేమిటన్న అంశంపై చాలా మందికి అవగాహన లేదు. దేశ వాసులు ఆయన వెంట నడవడానికి... ఆయన్ను అంతగా ఆదరించడానికి...మహానాయకుడిగా నేటికీ ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలవటానికి కారణమేమిటన్నది ప్రస్తుత తరానికి తెలిసింది చాలా స్వల్పం. ఈ నేపథ్యంలో ఏయూలో 2006లో ‘గాంధీ అధ్యయన కేంద్రం’ (గాంధియన్‌ స్టడీస్‌ సెంటర్‌) అని ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించారు. ఒక్కో కోర్సు రోజుకు రెండు గంటల చొప్పున వారం రోజులపాటు ఉంటుంది. తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంటాయి. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ నేపథ్యంలో గాంధీ చూపిన బాటను మరింత స్పష్టం చేసే ఈ కేంద్రం గురించి తెలుసుకుందామా.

1,800 పుస్తకాలతో..

కోర్సు పూర్తిచేసిన వారికి ఆంధ్రవిశ్వవిద్యాలయ చిహ్నంతో పత్రం లభిస్తుంది.

గాంధీజీ గురించి సమగ్ర అవగాహన కల్పించడానికి వీలుగా ఏకంగా 1800 పుస్తకాలను విభాగంలో అందుబాటు ఉంచారు.

గాంధీజీ నేతృత్వంలోని ఉద్యమాలకు సంబంధించిన అపురూప ఛాయాచిత్రాల విభాగం ఆకట్టుకుంటుంది. బీ విభాగంలో సుమారు 60 మంది కూర్చోవచ్చు.

‘గాంధియన్‌ కమ్యూనికేషన్‌’, ‘గాంధియన్‌ థాట్‌’ అంశాలపై ప్రస్తుతం కోర్సులు నిర్వహిస్తున్నారు.

వారం రోజులపాటు కొనసాగే కోర్సుల్లో భాగంగా చెప్పే అంశాలు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.

గాంధీజీ కొల్లాయి దుస్తుల్లోనే దేశవ్యాప్తంగా ఎందుకు తిరిగారు? ఉద్యమంలో భాగంగా పలు ప్రాంతాలకు నడుచుకుంటూనే ఎందుకు వెళ్లేవారు? అతి సాధారణ జీవితాన్ని మాత్రమే ఎందుకు గడిపేవారు? తదితర విషయాలన్నింటిపై అవగాహన కల్పిస్తారు.

అధ్యయన కేంద్రంలో ఉంచిన పుస్తకాలు


* ఏయూలో గాంధీ అధ్యయన విభాగం ప్రారంభమైన సంవత్సరం: 2006
* నిర్వహిస్తున్న కోర్సులు: రెండు
* ఫీజు : ఉచితం
* వ్యవధి: వారం రోజులు
* అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: బ్యాచ్‌కు 60


ఆలోచనా ధోరణి తప్పకుండా మారుతుంది

గాంధీజీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని అత్యంత నిరుపేదలు సైతం తనకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో సౌఖ్యాలన్నీ త్యజించి కేవలం కొల్లాయి వస్త్రాలే ఆయన ధరించేవారు. అప్పట్లో ఉన్న తీవ్రమైన పేదరిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది పురుషులు కూడా  వస్త్రాలను కూడా అరకొరగానే కట్టుకునేవారు. దీంతో గాంధీజీ కూడా ఆ తరహా జీవన విధానాన్నే ఆచరించారు. తన ప్రతి చర్యా ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలన్న లక్ష్యం ఆయనలో అడుగడుగునా కనిపించేది. అహింసా మార్గంలోనే పోరాడాలని బోధిస్తూ... ఆ మార్గంలోనే చివరకు  స్వాతంత్య్రం దక్కటానికి కారణమయ్యారు. ఇతరులకు చెప్పే ఏ అంశమైనా ముందుగా తాను ఆచరించి చూపించి ఆదర్శంగా నిలిచారు. ఈ కోర్సులు చేయడానికి యువత ముందుకు వస్తే వారి ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వంలో ఆశాజనక మార్పులు వస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

- ఆచార్య చల్లా రామకృష్ణ, డైరెక్టర్‌, గాంధియన్‌ స్టడీస్‌ విభాగం

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని