logo
Published : 10 Aug 2022 05:35 IST

ఉచిత బియ్యంలో కిరికిరి!

కూపన్లు అందక వేలాది మంది ఆందోళన

నర్సీపట్నం, న్యూస్‌టుడే

ఉచిత బియ్యం సరఫరా తీరు కార్డుదారులను అయోమయానికి గురిచేస్తోంది. కూపన్లు అందకపోవడమే దీనికి కారణం. ‘అందరికీ రేషన్‌ అందుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేద’ని అధికారులు చెబుతున్నారు. ‘కూపన్లు వస్తాయంటూ.. అవి రాని వారి పేర్లను వాలంటీర్లు నమోదు చేసుకువెళ్తున్నారు. బియ్యం పంపిణీ ప్రారంభించి వారం దాటినా.. నేటికీ కూపన్లు అందకపోవడంతో కార్డుదారులు గందరగోళానికి గురవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుంచి ఉచిత బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వేలి ముద్ర నమోదుతో బియ్యం ఇచ్చే వారు. ఇప్పుడు కూపన్ల విధానం అమలు చేస్తున్నారు. గతంలో రేషన్‌ తీసుకున్న అందరికీ ప్రస్తుతం కూపన్లు అందలేదు. తమకు బియ్యం అందవేమోనన్న అనుమానం కూపన్లు రాని వారంతా వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి కూపన్లు పంపిణీ చేశారు. తమ వద్ద ఉన్న జాబితా చూసి కొందరికి రాలేదని చెప్పి పేర్లు రాసుకుంటున్నారు. కూపన్ల కోసం కార్డుదారులు ఎదురుచూస్తున్నారు. వాలంటీర్లు కనిపించినప్పుడల్లా వాకబు చేస్తున్నారు.

రెండు నెలలు అందవేమో..

ఉచిత బియ్యం పంపిణీకి ఇప్పుడు కొత్తగా ఒకేసారి రెండు నెలల కూపన్లు అందజేస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి ఈ నెల 17 లోగా తీసుకోవాలని చెబుతున్నారు. సెప్టెంబర్‌ నెల కూపన్లను ఆ నెలలో చూపిస్తే రేషన్‌ ఇస్తారంటున్నారు. ఇవి లేకుంటే సరకు ఇవ్వరని చెబుతున్న మేరకు కూపన్లు అందని వారంతా రెండు నెలల రేషన్‌ తమకు అందదేమోనని దిగులు చెందుతున్నారు. కూపన్లు లేకుండా పాత పద్ధతిలోనే బియ్యం ఇచ్చి ఉంటే ఈ బాధలు ఉండేవి కావంటున్నారు. గ్రామాల్లో కొందరు వాలంటీర్లు మాత్రం కూపన్లు రాని కొందరికి చీటీ రాసి డీలర్ల వద్దకు వెళ్లి ఈ-పోస్‌లో చూసుకోవాల్సిందిగా కార్డుదారులకు సూచిస్తున్నారు. జిల్లాలోని ప్రతి వాలంటీరు పరిధిలోని కార్డుదారుల్లో కనీసం ముగ్గురు చొప్పున కూపన్లు అందలేదంటున్నారని చెబుతున్నారు.


జాబితాలో పేరుంటే రేషన్‌: ఉచిత రేషన్‌ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పంపిణీకీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) జాబితాలో పేర్లు ఉన్న కార్డుదారులందరికీ బియ్యం సరఫరా చేస్తారు. జిల్లాలో 5.4 లక్షల కార్డుల్లో 5.12 లక్షల మందికి ప్రభుత్వం 7,200 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. జిల్లాలో 28 వేల మంది చాలా కాలంగా రేషన్‌ తీసుకోకపోవడంతో వారిని మినహాయించి మిగతా వారందరికీ కూపన్లు సరఫరా చేశారు. ఇప్పటికే 60 శాతానికిపైగా తీసుకున్నారు. కూపన్‌ లేకపోయినా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ జాబితాలో పేరుంటే బియ్యం తీసుకోవచ్చు. చౌక దుకాణదారు వద్ద ఉన్న ఈ-పోస్‌లో పేరు వచ్చినా రేషన్‌ అందుతుంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ జాబితాలో పేర్లు లేనివారికి మాత్రం బియ్యం ఇవ్వడానికి అవకాశం ఉండదు. దీనిపై సచివాలయంలోని వీఆర్వో/వాలంటీర్లను సంప్రదిస్తే అన్ని విషయాలు స్పష్టంగా చెబుతారు.

- శివప్రసాద్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి, అనకాపల్లి

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని