logo

ఆర్టీసీ ప్రయాణికులపై జేబు దొంగల కన్ను

బస్సుల కొరత జేబు దొంగలకు కలిసొచ్చింది. విజయవాడలో వైకాపా నిర్వహించిన జయహో బీసీ గర్జన కార్యక్రమానికి అనకాపల్లి డిపో నుంచి 47 బస్సులను పంపారు

Published : 08 Dec 2022 05:35 IST

రద్దీ సమయంలో పర్సుల అపహరణ

పోలీసులకు వివరాలు చెబుతున్న బాధితుడు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: బస్సుల కొరత జేబు దొంగలకు కలిసొచ్చింది. విజయవాడలో వైకాపా నిర్వహించిన జయహో బీసీ గర్జన కార్యక్రమానికి అనకాపల్లి డిపో నుంచి 47 బస్సులను పంపారు. డిపోలో మొత్తం 77 బస్సులు ఉంటే అందులో రెండొంతులు విజయవాడ వెళ్లిపోవడంతో సాధారణ ప్రయాణికులకు బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. బుధవారం సాయంత్రం విజయనగరం వెళ్లే బస్సు కోసం ప్రయాణికులు చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది. బస్సు వచ్చేసరికి ప్రయాణికులు పరుగులు తీశారు. రద్దీ ఏర్పడడంతో జేబు దొంగలు పనికానిచ్చేశారు. అడ్డతీగల మండలం గొడ్డివానిపాలెంకి చెందిన కె.సోమరాజు భార్య, పిల్లలతో కలసి మల్లినాయుడుపాలెం వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా జేబులోని పర్సును కాజేశారు. రూ. 20వేల నగదు పోయినట్లు బాధితుడు వాపోయాడు. అమలాపురానికి చెందిన సీహెచ్‌.నీలిమ సబ్బవరం మండలం అమృతపురం వెళ్లడానికి విజయనగరం బస్సు ఎక్కుతుండగా పర్సును కాజేశారు. అందులో రూ. 2 వేల నగదు, సెల్‌ఫోన్‌ ఉన్నాయని బాధితురాలు వాపోయారు. బాధితులు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. బస్సును చాలాసేపు ఆపి ప్రయాణికులను పరిశీలించినా ప్రయోజనం లేకుండాపోయింది. అనకాపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని