logo

అందరి సహకారంతో అభివృద్ధి పథంలో!!

జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున వెల్లడించారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్నట్లు  పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 03:11 IST

‘గణతంత్ర’ వేడుకల్లో కలెక్టర్‌ మల్లికార్జున
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున వెల్లడించారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్నట్లు  పేర్కొన్నారు.

ణతంత్ర వేడుకలను గురువారం ఉదయం పోలీసు కవాతు మైదానంలో నిర్వహించగా... కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసు దళాల ప్రదర్శనను సందర్శించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ శోభిత బెలూన్లను గాలిలోకి వదిలారు.

జిల్లాలో చేపట్టిన, చేయబోయే అభివృద్ధి అంశాలను వివరిస్తూ.. గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమంతో పాటు సంక్షేమశాఖల ద్వారా అల్పాదాయ వర్గాల కోసం చేస్తున్న కార్యక్రమాలను వెల్లడించారు. ‘విమ్స్‌లో రూ.20 కోట్లతో సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. కేజీహెచ్‌తో సహా పలు ఆసుపత్రుల్లో నాడు-నేడు కింద రూ.950 కోట్లతో పనులు చేపట్టనున్నాం.

స్త్రీశిశు సంక్షేమం, పాఠశాల విద్యాశాఖ, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖలతో పాటు ఉద్యాన, మత్స్యశాఖల పరిధిలో పురోగతి సాధిస్తున్నాం. భీమునిపట్నం మండల పరిధిలో రూ.25 కోట్ల ఖర్చుతో జెట్టీ నిర్మిస్తాం.

రూ.152 కోట్లతో చేపలరేవు నవీకరణ పనులు చేపట్టాం. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.10.30 కోట్లతో 11 పనులు చేపడుతున్నాం.

పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.17కోట్లతో గ్రామ సచివాలయ భవనాలు, రూ.12 కోట్లతో రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తున్నాం.

గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ.251 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా లక్ష గృహాల నిర్మాణాలను చేపట్టాం.

ఈపీడీసీఏల్‌ ఆధ్వర్యంలో 950 జగనన్న కాలనీల్లో రూ.108 కోట్లతో విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నాం. భూగర్భ విద్యుత్తు కేబులు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.482 కోట్ల మేర పనులు పూర్తి చేశాం. ఏక గవాక్ష విధానంలో  500 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశాం. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మార్చి 3,4 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్నాం. పర్యాటకశాఖలో లగ్జరీ రిసార్ట్స్‌, హోటళ్ల అభివృద్ధికి 32 స్థలాలను గుర్తించాం. 40 ఎకరాల్లో రిసార్ట్సు నిర్మాణానికి ఒబెరాయ్‌ గ్రూపు ముందుకు వచ్చింది. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.150కోట్లతో 73 జగనన్న కాలనీల్లో 1,47,130 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నాం. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత భారీగా నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

మధ్యతరగతి ప్రజల కోసం 3,300 ప్లాట్లను, రైతుల కోసం 50 లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు రూ.200కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి అవుతాయి. మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిమిత్తం రూ.97 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో రూ.91 కోట్లతో చేపట్టిన 585 పనులు వేగంగా సాగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ.101కోట్లతో 60 పనులకు అనుమతులు మంజూరు చేశాం. ‘ఆకర్షణీయ’ పథకంలో చేపట్టిన పనుల్లో సగం పూర్తయ్యాయి. స్వచ్ఛసర్వేక్షన్‌-22లో జీవీఎంసీకి 5స్టారు రేటింగ్‌ లభించింది. సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నాం’ అని వివరించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులు, శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.

నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌, జేసీ విశ్వనాథన్‌, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, డీసీపీ సుమిత్‌, ఎమ్మెల్సీలు పీవీఏన్‌ మాధవ్‌, వరుదు కల్యాణి, వి.ఎం.ఆర్‌.డి.ఎ.ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు డాక్టర్‌ ఎస్‌.వి.ఆదినారాయణ, డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారి దగ్గరకు వెళ్లి కలెక్టర్‌ పలు అంశాలపై మాట్లాడారు.

పోలీసుల కవాతు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని