logo

విశాఖ తీరంలో.. విధ్వంసం

విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో తీర ప్రాంత అందాలు చెదిరిపోతున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకదిబ్బలను తొలగించేస్తున్నారు. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా ఆపలేరా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 27 Jan 2023 03:11 IST

సుందరీకరణ పేరుతో జీవావరణంపై వేటు
పర్యావరణవేత్తల ఆందోళన
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఎంవీపీ కాలనీ

విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో తీర ప్రాంత అందాలు చెదిరిపోతున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకదిబ్బలను తొలగించేస్తున్నారు. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా ఆపలేరా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో విశాఖలో జీ-20 సన్నాహక,  పెట్టుబడుల సదస్సులు జరగనున్నాయి. దీంతో సుందరీకరణ పేరుతో జీవీఎంసీ యంత్రాంగం రంగంలోకి దిగింది. తీరంలోని కొన్ని ప్రాంతాలను సిద్ధం చేసే క్రమంలో ఈ పనులు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు అధికారికంగా ఎవరూ వెల్లడించటం లేదు. మరో వైపు... సహజవాతావరణం దెబ్బతినేలా సాగుతున్న పనులపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

అలా తవ్వేస్తూ..

నగరంలోని అప్పూఘర్‌ ప్రాంతంలోని తీరంలో గురువారం కొన్ని పనులు చేపట్టారు. అక్కడ తీరాన్ని చదును చేశారు. స్థానికులు వెళ్లి ప్రశ్నించినా కొనసాగించారు. అలలకు అతి సమీపంలోని ఇసుక తిన్నెలను యంత్రాలతో చదును చేశారు. బీచ్‌ అంతటినీ రెండు, మూడు అడుగుల లోతున తవ్వి కొత్తగా కనిపించేలా మార్చారు. ఇసుక తిన్నెలపై ఉండే తీగ జాతి మొక్కలను పూర్తిగా తొలగించారు. అక్కడున్న గడ్డి మొక్కలు, పొదలను వేళ్లతో సహా పెకలించారు. శ్మశానవాటికకు సమీపంలోనూ ఈ పనులు జరగడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా, సమాధులకు సమీపంలో ఇలా చేయడాన్ని తప్పుపడుతున్నారు.

బీచ్‌లో యంత్రంతో పనులు చేస్తూ..

నిబంధనలు విస్మరించి: తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనల ప్రకారం తీరంలో ఇసుక తిన్నెలు, ఆటుపోటుల మధ్య ఉన్న స్థలాన్ని యథాతథంగా ఉంచాలి. అక్కడ ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఇసుక ఎగరకుండా ఇసుక తిన్నెల మీద పెరుగుతున్న తీగజాతి మొక్కలు, పొదలను తొలగిస్తే సముద్ర తీర జీవాలకు ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ‘పొదల కింద చాలా జీవావరణం ఉంటుంది. ఇసుక కింద నుంచి ఉండే మొక్కల వేళ్ల వ్యవస్థ జీవావరణ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఆ వేళ్లపై పలు జీవులు ఆధారపడి ఉంటాయి. గాలులకు ఇసుక ఎగిరిపోకుండా, ఆటుపోట్ల సమయంలో ఇసుక సముద్రంలోకి  కొట్టుకుపోకుండా ఆ వేళ్లు రక్షణగా నిలుస్తాయి. తీరాన్ని ధ్వంసం చేస్తే... గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల ఉనికికే ముప్పు కలుగుతుంది. ఇసుక తిన్నెలు సహజంగా ఏర్పడాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటి వాటిని ఒక్క వేటు  ధ్వంసం చేస్తున్నారు’ అని పలువురు పర్యావరణ ప్రియులు వాపోతున్నారు.

సమాధులకు సమీపంలో పనులు చేశాక ఇలా..

అనుమతి లేకుండా: సుందరీకరణ పనుల నిమిత్తం మూడు రోజుల కిందట సాగర్‌నగర్‌ బీచ్‌లో అటవీశాఖకు చెందిన స్థలంలో పనులు చేపట్టారు. దీనిపై అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర ప్రాంత రక్షణ స్థలం కావడంతో తప్పనిసరిగా అనుమతులు ఉండాలని చెప్పడంతో అక్కడ పనుల ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని