logo

ఇళ్లివ్వకుండానే వడ్డీలు.. వాయిదాలు

పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు, బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు మాత్రం అందుతున్నాయి.

Published : 03 Feb 2023 03:41 IST

టిడ్కో లబ్ధిదారులపై ఒత్తిళ్లు

నర్సీపట్నం పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే నర్సీపట్నం అర్బన్‌: పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు, బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు మాత్రం అందుతున్నాయి. చేతిలో ఇంటి పట్టాలు పెట్టినా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించకపోవడంతో సొంతింటి గుమ్మంలో అప్పుడే అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈలోపు ఇళ్ల కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల ఒత్తిళ్లు ఓవైపు.. అప్పుచేసి కట్టిన వాటా సొమ్ముపై పెరుగుతున్న వడ్డీల భారం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.


కాలయాపన.. వడ్డీల భారం..

అనకాపల్లితో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాల పరిధిలో 6,184 ఇళ్లను మూడు కేటగిరీలలో నిర్మించారు. అందులో 300 చ.అ విస్తీర్ణం ఇళ్లకు బ్యాంకుల నుంచి రుణాలు అవసరం లేదు.. లబ్ధిదారుడు రూపాయి చెల్లిస్తేచాలు. 365 చ.అ ఫ్లాట్‌కు లబ్ధిదారులు తమ వాటాగా రూ.25 వేలు చెల్లిస్తే బ్యాంకు నుంచి రూ.3.15 లక్షలు రుణం అందిస్తుంది. 430 చ.అ ఫ్లాట్‌కు రూ.50 వేలు చెల్లిస్తే బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇస్తుంది. టిడ్కో లబ్ధిదారులకు ఉమ్మడి జిల్లాలో 12 బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 80 శాతం మందికి రుణాలు అందజేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీరి పేరిట రిజిస్ట్రేషన్లు పూర్తయినా నివాస యోగానికి మరికొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కాలనీల్లో తాగునీరు, మరుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణం జరగలేదు. అంతర్గత రోడ్లు పూర్తికాలేదు. అవన్నీ జరిగిన వరకు ఇంటిలో దిగడానికి అవకాశం లేదు. అప్పటి వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీల భారం భరించాల్సిందే. పట్టణ పేదలపై ఇది మరింత ఆర్థిక భారంగా మారుతోంది. సకాలంలో ఇళ్లు చేతికి అందిఉంటే ఈ భారం తగ్గేదని లబ్ధిదారులంటున్నారు.


రుణ మంజూరు వివరాలిలా..

* అనకాపల్లి సత్యనారాయణపురం మెగా లేఅవుట్‌లో 365 చ.అ, 430 చ.అ ఇళ్లు కలిపి 448 నిర్మించారు. వాటిలో 110 ఇళ్లు లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మిగతా వారికి ఈనెలలో రిజిస్ట్రేషన్లు చేయబోతున్నారు.

* నర్సీపట్నంలో 1,440 మంది లబ్దిదారులకు గాను ఇప్పటి వరకు 600 మందికి రూ.16.16 కోట్ల మేర రుణాలు ఇప్పించారు. వీరిలో కొందరికి బ్యాంకులు వాయిదాలైనా చెల్లించండి.. వడ్డీలైనా కట్టండని నోటీసులు జారీచేశాయి.

* ఎలమంచిలిలో 432 ఇళ్లకు గాను 336 లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారు. వారిలో కొంతమందికి ఫోన్లు చేసి నెలవారీ వాయిదాలు చెల్లించాలి బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు.


ఇంటిలో దిగకుండానే..
-శీరంరెడ్డి కుమారి లక్ష్మి, కొత్తవీధి, నర్సీపట్నం

కొత్తవీధి ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డుపక్క రేకుల షెడ్డు వేసుకుని ఇద్దరు ఆడపిల్లలు పదిహేనేళ్లుగా జీవిస్తున్నాం. టిడ్కో ఇల్లు అందివస్తే అందులోకి వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇంతలోనే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టమంటున్నారు. ఇల్లు ఇంకా ఇవ్వకుండా ఎలా వాయిదాలు కట్టగలం?


రెండుసార్లు బ్యాంకు వడ్డీ కట్టా
-సామల రత్నం, లింగాపురం, నర్సీపట్నం

టిడ్కో ఇంటి కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టమంటే రెండుసార్లు చెల్లించాను. ఇల్లు ఇవ్వకపోవడంతో బ్యాంకుకు వడ్డీ కట్టడం మానేశా. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. అద్దె ఇంట్లో ఇబ్బంది పడాల్సివస్తోంది. ఇల్లు అందజేస్తే ఇబ్బందులు తీరతాయని ఆశపడుతున్నాం.


ఒకేసారి భారం కాకూడదని..
- సరోజిని, మెప్మా పీడీ

బ్యాంకులకు వాయిదాలు అప్పుడే చెల్లించనవసరం లేదు. రుణానికి నెలవారీ వడ్డీ పడుతుంది. ఆ మొత్తం ఏ నెలకు ఆ నెల కట్టేసుకుంటే మంచిది. ఒకేసారి ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే రెండు మూడు నెలలకైనా ఒకసారి వడ్డీ చెల్లించుకుంటే ఉంటే మంచిది. ఇలా అయితే వాయిదాలు చెల్లించే నాటికి వడ్డీ భారం తొలగిపోతుంది. ఆ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని