logo

కదిలేనా.. కలగా మిగిలేనా!

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితమైంది. స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ జరిగి రెండేళ్లు దాటిపోయినా పనుల్లో కదలిక కనిపించడం లేదు.

Published : 13 Mar 2023 06:16 IST

పూడిమడక ఫిషింగ్‌ హార్బర్‌ ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితం
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

ఫిషింగ్‌ హార్బర్‌ ప్రతిపాదిత స్థలం ఇదే

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితమైంది. స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ జరిగి రెండేళ్లు దాటిపోయినా పనుల్లో కదలిక కనిపించడం లేదు. దీని నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్‌ ప్రచారం చేసుకోవడం తప్ప పనుల్లో అంగుళమైనా ముందుకెళ్లలేదు. విశాఖహార్బర్‌ తరవాత ఎక్కువ చేపలవేట సాగించే పూడిమడకలో మినీ హార్బర్‌ నిర్మాణానికి మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

తీరం నుంచి ప్రమాదకరంగా వేటకు వెళ్తున్న మత్స్యకారులు

పూడిమడక.. ఈ పేరు చెబితే రాష్ట్రంలో తెలియని మత్స్యకారుడు ఉండడు. 20 వేల జనాభాతో రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామం. 600 బోట్లతో రోజూ ఇక్కడ చేపలవేట సాగిస్తారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గ్రామంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సర్వే నంబర్‌ 139లో ప్రాజెక్టుకు అవసరమైన 37 ఎకరాల భూమిని గుర్తించింది. 2020 డిసెంబరు 31న ప్రజాభిప్రాయ సేకరణ వేలాది మంది మత్స్యకారుల సమక్షంలో అర్భాటంగా పూర్తిచేయించింది. ప్రజాభిప్రాయ సేకరణతో మమ అనిపించకుండా టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించాలని అప్పట్లో మత్స్యకారులు కోరారు. హార్బర్‌ లేకపోవడంతో కాకినాడ, విశాఖపట్నం, తమిళనాడు, ఒడిశా, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సి వస్తుందని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు.

హార్బర్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న అప్పటి ఉమ్మడి విశాఖ జేసీ వేణుగోపాల్‌రెడ్డి

పరిపాలన అనుమతితో సరి

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి అవసరమైన అధ్యయనాలు పూర్తికావడంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గత తెదేపా ప్రభుత్వం పర్యటకంగా అభివృద్ధి చేయడానికి గుర్తించిన ప్రదేశాన్నే వైకాపా ప్రభుత్వం మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి గుర్తించడంతో పర్యాటక ప్రాజెక్ట్‌ పక్కకుపోయింది. పర్యాటక ప్రాజెక్ట్‌పోయినా మినీ ఫిషింగ్‌ హార్బర్‌ వస్తుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేసినా పనుల్లో మాత్రం రెండేళ్లగా కదలికలేదు. నిర్మాణానికి రూ.350కోట్లు మంజూరుచేస్తూ పరిపాలన అనుమతి అందించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి టెండర్లు పిలవకపోవడంతో పనులు ప్రారంభంకాలేదు.


సీఎం రాష్ట్రస్థాయిలో ప్రచారం చేసుకున్నారు

మేరుగు బాపునాయుడు, మత్స్యకార నాయకుడు, పూడిమడక

పూడిమడకలో హార్బర్‌ నిర్మాణ పనులు చేపట్టకపోగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని సీఎం జగన్‌ భావనపాడు పోర్టు శంకుస్థాపన రోజు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రంలో మత్స్యకారులను ఆయన తప్పుదోవపట్టించారు. తీరం కోతకు గురికావడం, ముంచుకొస్తున్న తుపాన్లు, వేట సాగకపోవడం ఇలా మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు వెంటనే ప్రారంభించి మత్స్యకారులను ఆదుకోవాలి.


ఏపీఎంఐడీసీఎల్‌కు స్థలాన్నిఅప్పగించాం

లక్ష్మణరావు, డీడీ, మత్స్యశాఖ, అనకాపల్లి జిల్లా

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి అవసరమైన అన్ని రకాలైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉన్నాయని నివేదికలు ప్రభుత్వానికి అందించాం. రాష్ట్రంలో మొదటి దశలో కొన్ని ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నారు. రెండవ దశలో బురగట్లపాలెం, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నంతోపాటు పూడిమడకలో నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టెండర్లు పూర్తిఅయ్యాయి. పూడిమడకలో గుర్తించిన స్థలాన్ని ఏపీ మారిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎండీసీఎల్‌)కు అప్పగించాం. వీరు ద్వారా టెండర్‌ సంస్థకు స్థలాన్ని అందిస్తారు. 5 ఫిషింగ్‌ హార్బర్లు డిజైన్‌ దశలో ఉన్నట్లు సమాచారం ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని