logo

‘పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం’

పోలవరం ప్రాజెక్టు డ్యాం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2023 05:16 IST

మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి, వేదికపై తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ, సీపీఐ నాయకులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు డ్యాం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి రోటరీ హాలులో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధనపై నిర్వహించిన ఉత్తరాంధ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో 41.15 ఎత్తుకు నిర్మిస్తామని, రెండో విడత 45.72 మీటర్లకు పెంచుతామని చెబుతోందని, కేంద్ర ప్రభుత్వం ఈ మాట చెప్పడం లేదన్నారు. జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. సుజల స్రవంతి సాకారమైతే ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రతి వారం పోలవరంపై సమీక్షించేవారని, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక తూతూమంత్రంగా ఏడాదికోసారి సమీక్షిస్తున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెదేపా హయాంలో అనకాపల్లిలో ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన స్థానాన్ని ఇక్కడి నుంచి తరలించిన విషయం గుర్తుచేశారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని అదానికి అప్పచెబుతున్నారని దుయ్యబట్టారు. సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్‌, వై.ఎన్‌.భద్రం, మాధవరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని