logo

Vizag: భారత్‌- ఆసీస్‌ టీ20.. పెద్దల చేతికి టికెట్లు?!

ఈ నెల 23న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం పూర్తయినప్పటికీ అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది

Updated : 19 Nov 2023 07:53 IST

ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్లో లభించక నిరుత్సాహం
బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నఅభిమానులు

ఈనాడు, విశాఖపట్నం: ఈ నెల 23న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం పూర్తయినప్పటికీ అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. ఎక్కువ ధర టికెట్లు కొనాలనుకున్నా లభించలేదు. అధికార పార్టీ నేతల కోసం కావాలనే చాలా టికెట్లు బ్లాక్‌ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాన్ని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) పూర్తి చేసింది. విక్రయానికి మొత్తంగా 22 వేల టికెట్లు ఉంచగా అంత మందికి విక్రయించిందా అన్న అనుమానాలు క్రీడాభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

వైకాపా నేతల కోసం: ఈ నెల 15, 16 తేదీల్లో ఏసీఏ ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించింది. ఆ సమయంలో చాలా కొద్ది సమయానికే ‘సోల్డ్‌ అవుట్‌’ అని చూపించిందని అభిమానులు వాపోయారు. రూ.6 వేలు, రూ.3 వేల టికెట్లు కొనుగోలు చేద్దామన్నా కనిపించలేదు. చాలా టికెట్లు ముందుగానే బ్లాక్‌ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏసీఏ పాలకవర్గ సభ్యులకు అధికార పార్టీ కీలక నేతలతో అతి దగ్గర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోని నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు అందుకు తగినట్లు టికెట్లను ఉంచేశారంటున్నారు. బాక్సు టికెట్లు, ప్రైమ్‌, ఇతర ఖరీదైన టికెట్లు ప్రత్యేకంగా వైకాపా నేతల కోసం బ్లాక్‌ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
 ఆఫ్‌లైన్‌లో శుక్ర, శనివారాల్లో అమ్మినప్పటికీ రెండు, మూడు గంటల్లోనే అయిపోయాయి. వరసల్లో ఉన్న సగం మందికైనా లభించకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. మరో వైపు కొందరి చేతుల్లో  పదుల సంఖ్యలో టికెట్లు కనిపించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం:  ఏసీఏతో సంబంధం లేని వ్యక్తులకు నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన టి-20 మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించి ఓ కమిటీలో రాయలసీమకు చెందిన  వైకాపా నేత కుమారుడ్ని భాగస్వామ్యం చేశారు. ఈసారి అదే స్థాయిలో పలు కమిటీల్లో అధికార పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపార సంస్థలకు చెందిన వారిని తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. క్రీడాభిమానులను పక్కనపెట్టి ఇతర వ్యక్తులతో నిర్వహణ కొనసాగించడంపై  ముందునుంచీ విమర్శలు ఉన్నాయి.  ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థను భాగస్వామ్యం చేయడం, ప్రతి కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని  తప్పుపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని