logo

కీలక ఘట్టం.. నామపత్రం స్వీకరణ

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నది. ఆ రోజు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నది.

Published : 17 Apr 2024 04:10 IST

అభ్యర్థులు నిబంధనలు తెలుసుకోవాలి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నది. ఆ రోజు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నది. నామపత్రాల స్వీకరణ అదే రోజు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో నామపత్రాలు దాఖలు చేసే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

  • నామపత్రం దాఖలు చేసే అభ్యర్థికి 25 ఏళ్లు నిండి ఉండాలి. ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తుంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఒక్కరు బలపరిస్తే సరిపోతుంది. ఆ ఒక్కరు కచ్చితంగా ఓటు నమోదు చేసుకుని ఉండాలి. స్వతంత్ర అభ్యర్థి అయితే కనీసం పది మంది ఓటర్లు బలపర్చాలి.
  • శాసనసభకు నామపత్రం దాఖలు చేసే జనరల్‌ అభ్యర్థి రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.5వేలు డిపాజిట్‌ చెల్లించాలి. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామపత్రాలు దాఖలు చేయాలి. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి కనీసం వంద మీటర్ల దూరంలో ర్యాలీలను నిలిపివేయాలి. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు.

ఎంపీ అభ్యర్థి జనరల్‌ అయితే రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.12,500 డిపాజిట్‌ చెల్లించాలి. ఈసీ గుర్తింపు పొందిన రాజకీయపార్టీల తరఫున పోటీ చేస్తుంటే ఒకరు, స్వతంత్ర అభ్యర్థులైతే పది మంది ఓటర్లు బలపర్చాలి.


ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చు..

  • ఈసారి ఆన్‌లైన్‌లో కూడా నామపత్రాలు దాఖలు చేయవచ్చు. వాటిని సువిధ యాప్‌ ద్వారా సమర్పించవచ్చు. తర్వాత ఆయా పత్రాల కాపీలను ఆర్‌ఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఆయా పార్టీలు జారీ చేసే ఎ,బి ఫారాలను అందజేయాలి. నామపత్రం దాఖలు చేసే సమయంలో కాని, ఉప సంహరణ గడువు ముగిసే లోపు కాని ఇవ్వొచ్చు.
  • విద్యార్హతలు, నేరచరిత్ర, ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్లు నామపత్రంతో పాటు జత చేయాలి. నేర చరిత్ర కలిగి, కోర్టు కేసులు ఎదుర్కొనే వారు ఆయా వివరాలు, కేసుల సంఖ్యను ప్రస్తావిస్తూ పత్రికల్లో మూడుసార్లు ప్రకటనలు ఇవ్వాలి.
  • ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95లక్షల వరకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. నామపత్రం దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. ఈనెల 18 నుంచి 25 వరకు నామపత్రాల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణలకు గడువు ఉంది.
  • విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఆర్‌ఓగా కలెక్టర్‌ మల్లికార్జున వ్యవహరించనున్నారు. కలెక్టరేట్‌లో ఎంపీ అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని