logo

ఆరోగ్య వేషం.. ఇది కాదా మోసం!!

లంకెలపాలెం యూపీహెచ్‌సీలో వారానికి నాలుగు రోజులు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని బోర్డు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం చర్మ వ్యాధులకు సంబంధించిన ఓపీ చూడాల్సి ఉండగా.. వైద్యురాలు సెలవులో ఉన్నారు.

Published : 17 Apr 2024 04:16 IST

నిపుణులైన వైద్యులొస్తారని ప్రభుత్వ ప్రచారం
సాధారణ చికిత్సకే యూపీహెచ్‌సీలు పరిమితం
పేద రోగులకు తప్పని ఇక్కట్లు
-ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

1.లంకెలపాలెం యూపీహెచ్‌సీలో వారానికి నాలుగు రోజులు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని బోర్డు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం చర్మ వ్యాధులకు సంబంధించిన ఓపీ చూడాల్సి ఉండగా.. వైద్యురాలు సెలవులో ఉన్నారు.

2. నరసింహనగర్‌-1 (అక్కయ్యపాలెం) యూపీహెచ్‌సీలో సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే వైద్య నిపుణులు వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వారిలో స్త్రీ వ్యాధులు, చిన్నపిల్లలు, ఎముకల వ్యాధుల నిపుణులున్నారు. ఈ కేంద్రం క్లస్టర్‌-2 పరిధిలో ఉన్నప్పుడు చర్మవ్యాధులు, జనరల్‌ మెడిసన్‌ నిపుణులూ వచ్చేవారు. మూడు నెలల క్రితం దీన్ని క్లస్టర్‌-6కు మార్చడంతో ముగ్గురు నిపుణులనే కేటాయించారు.

3. ఎన్‌జీజీవోస్‌ కాలనీ (అక్కయ్యపాలెం)లోని యూపీహెచ్‌సీ ఇరుకు భవనంలోనే నడుస్తోంది. ఇక్కడ సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో స్పెషలిస్టులు రావాలి. జనరల్‌ మెడిసన్‌, ఆర్థోపెడిక్‌, గైనకాలజిస్టులు మూడు నెలల క్రితం ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ కేంద్రానికి సంబంధిత నిపుణులను కేటాయించలేదు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులను సమీప కేంద్రాలకు, కేజీహెచ్‌కు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు.


వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (యూపీహెచ్‌సీ)ను ఏర్పాటు చేసింది. వాటిలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యమందిస్తున్నామని సీఎం జగన్‌, వైకాపా నాయకులు గొప్పలు చెప్పారు. ప్రతి రోజు ప్రత్యేక వైద్య నిపుణులు వస్తారని, కార్పొరేట్‌ తరహా వైద్యమందుతుందని ఊదరగొట్టారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. సాధారణ వ్యాధులకే చికిత్స చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో వైద్యాధికారి తప్ప నిపుణులెవరూ రావడం లేదు. మరికొన్ని కేంద్రాలకు గతంలో నిపుణులు వచ్చేవారు. సురక్ష శిబిరాలు ప్రారంభించిన తర్వాత వారంతా ఆయా శిబిరాలకే పరిమితమవుతున్నారు. ఏదైనా అవసరమై సాయంత్రం 5 గంటల తర్వాత కేంద్రాలకు వెళ్తే.. తలుపులన్నీ మూసి ఉంటాయి. కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్నం తర్వాత సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు. దీంతో రోగులను కేజీహెచ్‌ లేదా ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిందే. ఈ మాత్రానికి అంతగా ప్రచారం చేసుకోవడం దేనికని రోగులు ప్రశ్నిస్తున్నారు.


ప్రైవేటు ఆసుపత్రుల బాట: యూపీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వైద్య నిపుణులు వారంలో 16 కేంద్రాలకు వెళ్లి చికిత్స అందించాలి. ఆయా కేంద్రాల్లో వారు 2 నుంచి 3 గంటలే అందుబాటులో ఉంటున్నారు. వీరికి యూపీహెచ్‌సీలతోపాటు సురక్ష శిబిరాల్లోనూ బాధ్యతలు కేటాయించారు. దీంతో కొందరు వైద్యులు కేంద్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపట్లేదు. బాధ్యతలు పెరగడంతో పలువురు రాజీనామా చేశారు. వారి స్థానాల్లో ఇప్పటికీ సంబంధింత నిపుణులను నియమించలేదు. దీంతో కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం, దగ్గు, జ్వరం వంటి సాధారణ వ్యాధులకే చికిత్స చేస్తున్నారు. ఇతర సమస్యలతో వచ్చేవారిని సమీప కేంద్రాలకు రిఫర్‌ చేస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు.


ఇరుకు గదుల్లోనే: జిల్లా పరిధిలో మొత్తం 63 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. 36 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించారు. మిగిలిన వాటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (మ్యాక్‌) నిర్వహించిన భవనాల్లో ఏర్పాటుచేశారు. పాత భవనాలకు మెరుగులద్ది, ఇరుకు గదుల్లోనే నిర్వహిస్తున్నారు. సిబ్బంది కూర్చోవడానికి అనువైన వసతుల్లేవు. గదులు ఖాళీ లేకపోవడంతో పరికరాలు, ఔషధాలు నిల్వ చేసేందుకూ అవస్థలు ఎదురవుతున్నాయి. మరోవైపు కేంద్రాలకు నిపుణుల రాకపై స్థానికులకు అవగాహన లేదు. ఏ సమస్యకు ఎప్పుడు రావాలో, సంబంధిత వైద్యులు ఎప్పుడొస్తారో తెలియక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యుడు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. పలు చోట్ల వారికి నచ్చిన సమయంలో వచ్చి, వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని