logo

క్షణక్షణం ఉత్కంఠ!

సంచలనం సృష్టించిన  డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తుది తీర్పు నేపథ్యంలో మంగళవారం విశాఖ కోర్టులో ఉత్కంఠ నెలకొంది.

Published : 17 Apr 2024 04:24 IST

శిరోముండనం కేసు తీర్పు నేపథ్యంలో..

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే:  సంచలనం సృష్టించిన  డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తుది తీర్పు నేపథ్యంలో మంగళవారం విశాఖ కోర్టులో ఉత్కంఠ నెలకొంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే న్యాయస్థానానికి పలు ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. 10 గంటల సమయంలో మొత్తం 9 మంది నిందితులు న్యాయస్థానానికి చేరుకున్నారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలు, నిందితుల అనుచరులు రావడంతో కోర్టు వరండాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

న్యాయమూర్తి తీర్పునకు ముందు: మంగళవారం ఉదయం 10.30 గంటలకు పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్‌ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల (నిరోధక) న్యాయస్థానం విధులను ప్రారంభించగా, శిరోముండనం కేసు మధ్యాహ్నం 12.30 గంటలకు న్యాయమూర్తి లాలం శ్రీధర్‌ ముందుకు వచ్చింది. నిందితులందరూ వెంటనే కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి... నిందితులను పిలిచి నేరం రుజువైందని శిక్ష గురించి చెప్పుకోవాలని అనుమతించారు. ప్రధాన నిందితుడు, వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయ కక్షతో కేసులో ఇరికించారని, 28ఏళ్లుగా మానసిక క్షోభను అనుభవించానని, అయితే కోర్టు తీర్పును గౌరవిస్తానని విన్నవించుకున్నారు. మిగిలిన నిందితులూ అదే విధంగా న్యాయస్థానానికి తెలిపారు.

పైకోర్టులో అప్పీలుకు సిద్ధం: బాధితుల తరఫున కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సత్యనారాయణమూర్తి వాదనలు వినిపిస్తూ నిందితులపై పూర్తి స్థాయి విచారణ జరిగిందని, శిక్ష మినహాయింపునకు వారికి ఎటువంటి అర్హత లేదన్నారు. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వి.రామమూర్తి వాదనలు వినిపిస్తూ నిందితులు 28 ఏళ్లుగా విచారణకు హాజరవుతున్నారని తెలియజేశారు. అనంతరం న్యాయమూర్తి తీర్పు సారాంశాన్ని చదివి వినిపించారు. ప్రధాన నిందితుడు, వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సహా నిందితులందరికి ఒక్కొక్కరికి 18 నెలల చొప్పున సాధారణ జైలు శిక్షతోపాటు ప్రతి ఒక్కరు రూ.42 వేల చొప్పున జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. తీర్పు కాపీలను అందుకున్న నిందితులు పైకోర్టులో అప్పీలు చేసుకునే వరకు శిక్ష అమలు నిలిపివేయాలని కోరారు.

కోర్టు బయట హడావుడి: న్యాయస్థానం నుంచి బయటకొచ్చిన నిందితులందరూ ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులను అనుసరించారు. వారి అనుచరుల కూడా రావడంతో కోర్టు బయట హడావుడి నెలకొంది. అనంతరం తోట త్రిమూర్తులు విలేకరులతో మాట్లాడుతూ తాను నిర్దోషినని, పైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా తిరిగి వస్తానన్నారు. అనంతరం సుమారు 15 కార్లలో నిందితులు, అనుచరులు వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని