logo

కమలం.. హస్తం.. కలకలం

కర్రలతో పరస్పరం దాడులు.. హోరెత్తిన నినాదాలు.. నేతల తోపులాటలు.. ఇరువర్గాలను శాంతించేందుకు పోలీసుల ఎడతెగని ప్రయత్నాలు.. వెరసి మధ్యాహ్నం 2.45 గంటలకు మొదలైన కాంగ్రెస్‌, భాజపా మధ్య ఉద్రిక్తత సాయంత్రం అయిదు గంటల వరకు

Updated : 02 Jul 2022 12:37 IST

న్యూస్‌టుడే - వరంగల్‌క్రైం

భాజపా నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

కర్రలతో పరస్పరం దాడులు.. హోరెత్తిన నినాదాలు.. నేతల తోపులాటలు.. ఇరువర్గాలను శాంతించేందుకు పోలీసుల ఎడతెగని ప్రయత్నాలు.. వెరసి మధ్యాహ్నం 2.45 గంటలకు మొదలైన కాంగ్రెస్‌, భాజపా మధ్య ఉద్రిక్తత సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగింది. హనుమకొండ-వరంగల్‌ ప్రధాన రహదారి కావడంతో ఏం జరుగుతుందో తెలియక పలువురు వాహనాదారులు ఆందోళన చెందారు. కాంగ్రెస్‌, భాజపా నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హంటర్‌రోడ్డులోని భాజపా కార్యాలయం కేంద్రంగా పరస్పరం దాడులకు పూనుకోవడం నగరంలో కలకలం సృష్టించింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి భాజపా కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు వచ్చారు. మేయర్‌ స్వర్ణతో పాటుగా మరికొందరు మహిళా నాయకులు భాజపా వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారించారు. ఈ విషయం తెలుసుకుని కమలం నాయకులు, కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వచ్చి ‘జై భారత్‌ మాతా అంటూ వారు.. ప్రతిగా కాంగ్రెస్‌ నాయకులు భాజపా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా నేతలు కాంగ్రెస్‌ కార్యకర్తల వద్దకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా ఎవరూ వినకపోవడంతో భాజపా కార్యకర్త ఒకరు కాంగ్రెస్‌ నేతలను తోసేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మొక్కల కర్రలు ఊడదీసి..

మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ వచ్చిన కారు అద్దాలను కొందరు భాజపా నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇరువర్గాలు రెచ్చిపోయి కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కొందరు కార్యకర్తలు జెండాలకు ఉన్న కర్రలతో పాటు పక్కనే నాటిన మొక్కలకు పెట్టిన కర్రలను తీసుకొచ్చి మరీ దాడులకు పాల్పడ్డారు.

ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకుంటున్న సీఐలు

అదనపు బలగాలను రప్పించి ఉంటే..

రెండు పార్టీల ఘర్షణ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు వైఫల్యం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదనపు బలగాలను ముందే రప్పించి ఉంటే దాడులు చేసుకునే వరకు వెళ్లేది కాదని వ్యాఖ్యానించారు. కేయూ, సుబేదారి ఇన్‌స్పెక్టర్లు దయాకర్‌, రాఘవేందర్‌ ఆధ్వర్యంలో కొంతమంది ఎస్సైలు, కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. ఊహించని దాడుల పర్వంతో పెద్ద సంఖ్యలో ఇరువర్గాలను నిలువరించడం సాధ్యం కాలేదు. పరిస్థితి విషమించడంతో అదనపు పోలీసు బలగాలు రప్పించాకే పరిస్థితి కుదుటపడింది.

‘ప్రధాని దృష్టికి తీసుకెళ్తా..’

తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి వచ్చిన భాజపా రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాశ్‌ మాథుర్‌ షెడ్యూల్‌లో భాగంగా లష్కర్‌ సింగారం దళిత బస్తీ కార్యక్రమానికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వడంతో న్యూశాయంపేటలోని దళితవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ‘కార్యాలయానికి వచ్చి దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్‌ పథకం ప్రకారమే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.. దీని వెనుక తెరాస కుట్ర ఉంది’ అని ఆరోపించారు. దాడి విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

గన్‌మెన్‌పై హత్యాయత్నం.. కేసు నమోదు

సుబేదారి, న్యూస్‌టుడే: సుబేదారి సీఐ గన్‌మెన్‌ అనిల్‌పై కాంగ్రెస్‌ కార్యకర్త పృథ్వీరాజ్‌ కర్రతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపారు. అనిల్‌ తలకు బలమైన గాయమైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి హత్యాయత్నం చేశాడని సుబేదారి ఎస్సై పున్నంచందర్‌ ఫిర్యాదు మేరకు పృథ్వీరాజ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు..

అమరవీరుల స్తూపం నుంచి హంటర్‌రోడ్డు మీదుగా ర్యాలీగా వెళ్తున్న క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు సుమారు 70 మంది కార్యకర్తలు ఆకస్మికంగా మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని కాంగ్రెస్‌ నేతలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చరవాణి ధ్వంసం చేశారన్నారు. రూ.5లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ రాఘవేందర్‌ తెలిపారు.

భాజపా కార్యాలయం వైపు దూసుకెళ్తున్న మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు

మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కారు వద్దకు వెళ్తున్న

భాజపా నేతలను వారిస్తున్న సీఐ దయాకర్‌


దాడిలో ధ్వంసమైన కారు


పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు