logo

సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

Updated : 29 Nov 2022 07:09 IST

ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా దరఖాస్తులు స్వీకరించి సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ వాటిని తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను వివరంగా తెలుపుతూ ఫిర్యాదు దారునికి సమాచారం అందించాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 71 దరఖాస్తులు రాగా అందులో 44 భూ సంబంధిత, 27 ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలున్నాయి. సీపీవో ప్రకాష్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.అప్పయ్య, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ తుల రవి, డీపీవో వెంకయ్య, ఎస్సీ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, బీసీ సంక్షేమాధికారి లక్ష్మణ్‌, రోడ్లు భవనాల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో ప్రసూనారాణి, డీసీవో సర్దార్‌సింగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌ హైదర్‌ తదితరులు పాల్గొన్నారు.

* వెంకటాపూర్‌ మండలం బండ్లపాడ్‌ ఏరియాలో సాగు చేస్తున్న భూములకు రెవెన్యూ, అటవీశాఖల అధికారులు సర్వే చేసి పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామస్థులు అర్జీ ఇచ్చారు.
* ములుగు మండలం కన్నాయిగూడేనికి చెందిన దూడపాక మదనమ్మ పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఐటీడీఏ కార్యాలయంలో..

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీవో వసంతరావుకు అర్జీలను సమర్పించారు. వివిధ సెక్టార్ల అధికారులు ఏవో రఘు, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఎస్‌వో రాజ్‌కుమార్‌, పీహెచ్‌వో రమణ, ఏఏవో సంతోష్‌, ఈఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.

అర్జీలివీ..

* గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ గ్రామంలోని గిరిజనేతరులు నిర్వహిస్తున్న రేషన్‌ డీలర్‌షిప్‌ గిరిజనులకు కేటాయించాలని, ఇతరుల స్వాధీనంలో ఉండి, ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమిని గిరిజనులకే ఇప్పించాలని, పంచాయతీ పరిధిలో కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్న అంగన్‌వాడీ పోస్టును ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతూ సర్పంచి సింగం శ్రీలత అర్జీ ఇచ్చారు.
* ఇంటి స్థలాలు, సాగు భూములకు పట్టాలివ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఏటూరునాగారంలోని కోడి పుంజుల అంగడి ప్రదేశం, సాగు భూములను సర్వే చేయలేదని, లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వెంటనే సర్వే నిర్వహించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిప్పనపల్లి సుదర్శన్‌ విన్నవించారు.
* తాడ్వాయి మండలంలోని కొండపర్తి సమీప గొత్తికోయగూడెంలో విద్యుత్తు లైన్‌ వేయించాలని అదే గ్రామానికి చెందిన మాడవి వెంకయ్య, మాడవి ఉమేష్‌, కె.దేవా తదితరులు ఏపీవోకు అర్జీ ఇచ్చారు.
* తనకు రావాల్సిన వారసత్వ ఆస్తిని ఇప్పించాలని కోరుతూ మంగపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మద్దెల గౌతమ్‌ అర్జీని సమర్పించాడు.
* కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాలలో గదుల నుంచి నీరు కురుస్తోందని వాటికి మరమ్మతులు చేయించాలని ఏటూరునాగారం ఆ పాఠశాల ప్రత్యేకాధికారి పీవై లక్ష్మి కోరారు.

పని ఇప్పించండి...

* వైటీసీలలో లేదా ఏదైనా గిరిజన సంక్షేమ కార్యాలయాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో దివ్యాంగుడైన తనకు అటెండర్‌ ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతూ ములుగు మండలంలోని జాకారం గ్రామానికి చెందిన కూరాకుల సుధాకర్‌ అర్జీని సమర్పించాడు.
* వాగుదాటే క్రమంలో తన భర్త ప్రమాదవశాత్తు మృతి చెందాడని తనకు ఇద్దరు ఆడ పిల్లలున్నారని, ఏదైనా జీవనోపాధి కల్పించి తనను ఆదుకోవాలని కోరుతూ మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం గ్రామానికి చెందిన తాటి అన్నపూర్ణ అర్జీ ద్వారా వేడుకున్నారు.

సాయం చేసి ఆదుకోండి..

* తన ఇల్లు విద్యుదాఘాతానికి గురై కాలిపోయిందని, ఇంట్లో ఉన్న సామగ్రి, రూ.1.45 లక్షల డబ్బు, బంగారు, ఇతర ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయని తనకు కుటుంబ జీవనం కోసం ఏదైనా ఆర్థిక సాయం ఇప్పించాలని కోరుతూ ములుగు మండలం జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన పెనుక వెంకయ్య మొరపెట్టుకున్నారు.

పాసుపుస్తకం ఇప్పించాలి..

- తడ్క రామస్వామి; వెంకటాపూర్‌


మాది వెంకటాపూర్‌ మండల కేంద్రం. నాకు 832/ఎ/3 సర్వే నంబర్‌లో ఎకరం భూమి ఉంది. కానీ పట్టా పాసుపుస్తకం రాలేదు. చాలా రోజులుగా తిరుగుతున్నాను. నా దగ్గర అన్ని రకాల ఆధారాలున్నాయి. వాటిని పరిశీలించి సమస్య పరిష్కరించాలి.

ఫోర్జరీ చేసి పట్టా చేయించుకున్నారు
- నరెడ్ల రాజయ్య, వెంకటాపూర్‌

నా భూమిని ఇతరులు నా సంతకం ఫోర్జరీ చేసి పట్టా చేయించుకున్నారు. అతనిపై చర్యలు తీసుకుని నా పేరు మీద పట్టా చేయాలని పలు మార్లు కోరినప్పటికీ అధికారులు స్పందించడం లేదు.

పరిహారం తీసుకున్న వారే మళ్లీ అమ్ముకుంటున్నారు
- గోపాల్‌సింగ్‌, జవహర్‌నగర్‌, వెంకటాపూర్‌ మండలం

జవహర్‌నగర్‌ గ్రామానికి చెందిన గుడి కుంట చెరువు నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోయిన వారు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం తీసుకున్నారు. అయితే లబ్ధిదారుల పేర్లు రికార్డుల్లో నుంచి తొలగించకుండా అలాగే ఉంచడంతో మళ్లీ ఆ భూములను ఇతరులకు అమ్ముకుంటున్నారు. అధికారులు వారి పేర్లను రికార్డుల్లోంచి తొలగించి వాటిని ప్రభుత్వ భూములుగా  ప్రకటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని