logo

‘ఆసియా’ బరిలో మానుకోట రాకెట్‌!

మానుకోట బిడ్డ సిక్కిరెడ్డి బ్మాడ్మింటన్‌లో ఓరుగల్లు పేరు ప్రఖ్యాతలను నిలబెడుతున్నారు. శనివారం చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ప్రారంభవుతున్న ఆసియా క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్నారు.

Published : 23 Sep 2023 04:24 IST

ఈనాడు, మహబూబాబాద్‌: మానుకోట బిడ్డ సిక్కిరెడ్డి బ్మాడ్మింటన్‌లో ఓరుగల్లు పేరు ప్రఖ్యాతలను నిలబెడుతున్నారు. శనివారం చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ప్రారంభవుతున్న ఆసియా క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్నారు. ఎడమ చేతి వాటంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ఆమె గోపిచంద్‌ అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. శనివారం ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా సంగ్రామంలో సత్తా చాటి దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని ఉమ్మడి జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.

నేపథ్యం ఇది

మహబూబాబాద్‌ జిల్లా నర్సిహుంలపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల ఏకైక కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడాకారుడైన తండ్రి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆమెకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌లో మెలకువలను నేర్పించారు. నాలుగో తరగతిలో రాకెట్‌ పట్టుకున్న సిక్కిరెడ్డి అనతికాలంలోనే ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగి 2007లో కెరీర్‌లో తొలి అంతర్జాతీయ స్థాయి జూనియర్‌ ప్రపంచకప్‌ పోటీలో పాల్గొన్నారు. తొలుత సింగిల్స్‌ విభాగం రాణించిన ఆమె ప్రస్తుతం డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పాల్గొంటున్నారు. సంచలన విజయాలను సాధిస్తుండడంతో ప్రభుత్వం 2018లో అర్డున అవార్డు ప్రదానం చేసింది.

మూడో ఆసియా ఆటలు

సిక్కిరెడ్డికి ఈ ఆసియా క్రీడలు మూడోవి. 2014లో సౌత్‌ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన పోటీలో మొదటిసారిగా పాల్గొని కాంస్య పతకం సాధించారు. 2018లో ఇండోనేషియాలోని జకార్తాలో రెండోసారి పాల్గొన్నారు. ప్రస్తుతం చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరిగే పోటీలో మూడోసారి పాల్గొంటున్నారు.
మోకాలి గాయాన్ని లెక్క చేయకుండా: ఆటలో ప్రత్యర్థులను ముచ్చెటమలు పట్టిస్తున్న సిక్కిరెడ్డి 2010లో మలేషియాలో జరిగిన పోటీలో కోర్టులో జారి పడింది. మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేశారు. త్వరగా కోలుకుని ఆత్మస్థైర్యంతో కోర్టులో అడుగుపెట్టారు. 2013లో మరోసారి కిందపడడంతో మళ్లీ శస్త్రచికిత్స చేయించారు. ఆ గాయం బాధించినా లెక్క చేయకుండా ఆటను కొనసాగిస్తున్నారు. పట్టుదలతో పతకాలను కూడా సాధిస్తున్నారు..
పతకం సాధించడమే లక్ష్యంగా: ఆసియా క్రీడలకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. చైనా, జపాన్‌, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ లాంటి దేశాల నుంచి అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారిని ఓడించి పతకం సాధించడమే లక్ష్యంగా వంద శాతం శ్రమిస్తానని సిక్కిరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని