logo

ganesh chaturthi: మండపం.. మంచి సంకల్పం

గణపతి నవరాత్రి ఉత్సవాలు.. కాలనీల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతున్నాయి.. విజయవంతంగా నిర్వహించడానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి..

Updated : 24 Sep 2023 10:48 IST

సమాజహిత  కార్యక్రమాలకు శ్రీకారం
ఆదివారం ప్రత్యేకం

గణపతి నవరాత్రి ఉత్సవాలు.. కాలనీల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతున్నాయి.. విజయవంతంగా నిర్వహించడానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి.. విగ్రహం కొనుగోలు మొదలు నిమజ్జనం వరకు కలిసికట్టుగా నడిపిస్తాయి.. నిత్య పూజలు, అన్నదానాలు చేయిస్తున్నాయి.. ఉదయం, సాయంత్రం మండపాల వద్ద కలుసుకునేలా చేస్తున్నాయి.. ఇదే స్ఫూర్తితో సమాజహితమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు నిర్వహకులు. గణేశ్‌ మండపాల వేదికగా తీర్మానాలు చేస్తున్నారు. మంచి సందేశాలిచ్చే విగ్రహాలను ప్రతిష్ఠించి.. ఆలోచింపజేస్తున్నారు.  

ఈనాడు, వరంగల్‌


తప్పకుండా ఓటేద్దాం

ఓటు వజ్రాయుధం. ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఉంటుంది. కానీ ఓరుగల్లు నగరంలో చూస్తే ఓటింగ్‌ శాతం 60 మించడం లేదు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదుచేసుకొని ఎన్నికల్లో కచ్చితంగా ఓటేసి తీరాలి. హనుమకొండ శ్రీనగర్‌ కాలనీ సౌత్‌ గణేశ్‌ ఉత్సవ సమితి 32 ఏళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తోంది. 12 సంవత్సరాల నుంచి పర్యావరణ హితమైన మట్టి విగ్రహాన్నే పూజించాలని తీర్మానం చేసి అదే కొనసాగిస్తున్నారు. ఈసారి నవరాత్రుల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలనీవారంతా తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొని, సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలని గణేశుడి ముందు ప్రతిజ్ఞ చేశారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మండపం వేదిక కావాలి. నగరం, పట్టణాల్లో సైతం ఇదే స్ఫూర్తితో ఓటు వేస్తామని సంకల్పం చేసుకొంటే సత్ఫలితాలు వస్తాయి.


సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానం..

ఇటీవల వరంగల్‌ నగరంలో వరుస దొంగతనాలు జరిగాయి. అనేక నేరాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాలనీ కమిటీలు సీసీ కెమెరాలు ‘నేను సైతం’ కింద పెట్టుకోవాలని పోలీసులు చెప్పారు. కానీ నగరాలు, గ్రామాల్లో ఎక్కడా సరిగా లేవు. వీటిని ఏర్పాటుచేసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే నిందితులను గుర్తించేందుకు వీలుంటుంది. హనుమకొండ సుబేదారి వెంకటేశ్వరకాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం నిర్వాహకులు ఈ సంవత్సరం కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కాలనీలో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని, మహిళలతో పొదుపు సంఘం ఏర్పాటు చేయాలని సంకల్పించారు.


పొదుపు మంత్రాన్ని పాటిస్తూ

జనగామ నెహ్రూపార్కు కూడలిలో ‘వాస్తు’ గణపతి ఉత్సవ కమిటీ 1989 నుంచి మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. పొదుపు చేయాలనే లక్ష్యంతో పరపతి సంఘం ఏర్పాటు చేశారు.. వినాయక ఆలయాన్ని సైతం నిర్మించారు. పర్యావరణ హితం కోసం 2 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిరూపించారు. ఇదే స్ఫూర్తితో స్థానికులు చైతన్యవంతులై పొదుపు అలవర్చుకోవాలి. 

జనగామ


చదువు కోసం

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాండ్లసంకీస ఎస్సీ కాలనీలోని యువత అక్షరాస్యతపై స్థానికులను చైతన్య పరచాలనే ఉద్దేశంతో ‘వీణ’తో ఉన్న విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించారు. రాత్రి పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఈ మిత్రులు ఇతర సమయాల్లో కూడా విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ మన దగ్గర అనేక మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్షరాస్యత కార్యక్రమాల కోసం సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది.

డోర్నకల్‌


రహదారి భద్రత వివరిస్తూ

ద్విచక్రవాహం నడిపేప్పుడు శిరస్త్రాణం, కారు తోలేప్పుడు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి.  హనుమకొండ సుధానగర్‌లో శ్రీనూతన గజానన్‌ మండలి వారు ఈ సారి రహదారి భద్రతను వివరించే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘నాలా ఒక తల పోతే మరో తల పొందలేరని, అందుకు హెల్మెట్ ధరించి తీరాలి’ అనే సందేహాన్ని ఈ గణపతి ఇస్తాడు. గణేశ్‌ మండపాల వద్ద యువతకు ఇదే విషయం విడమరిచి చెప్పాలి. స్థానిక యువతీ యువకులను పిలిచి ఇక నుంచి తాము తప్పకుండా శిరస్త్రారణం ధరిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.


పట్టణాలు, పల్లెల్లో మండపాల వద్ద ప్రజలందరూ రోజూ కలుసుకుంటారు. ఆప్యాయంగా పలకరించుకుంటారు. అలా కలిసినప్పుడు మన శ్రేయస్సుకు కొన్ని అంశాలు చర్చించాలి. వాటి అమలు కోసం తీర్మానాలు చేసుకుంటే వచ్చే ఏడాదంతా హాయిగా ఉండొచ్చు. మండపాల వద్ద అందరూ కలిసి సత్య ప్రమాణం చేస్తే దాన్ని తప్పకుండా పాటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు