logo

అయ్యో పాపం.. ఏమిటీ ఘోరం..

బొడ్డు కూడా ఊడని మగ శిశువు విగత జీవిగా మారాడు. తల్లి పొత్తిళ్లలో ఆదమరచి నిద్రపోవాల్సిన బిడ్డ చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు. తల్లి గర్భం నుంచి బయటి ప్రపంచానికి వచ్చి రోజైనా గడవక ముందే కన్ను మూశాడు.

Published : 16 Apr 2024 05:13 IST

ముక్కు పచ్చలారని శిశువు..
ఎవరి బిడ్డో తెలియదు
కనులు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడలేదు
కన్నతల్లి పేగు బంధం వీడి రోజైనా గడవలేదు..
కారణం ఏదైనా కర్కశంగా చెరువులో పడేశారు..
అయ్యో బిడ్డా..! ఎవరిదీ పాపం...!

బొడ్డు కూడా ఊడని మగ శిశువు విగత జీవిగా మారాడు. తల్లి పొత్తిళ్లలో ఆదమరచి నిద్రపోవాల్సిన బిడ్డ చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు. తల్లి గర్భం నుంచి బయటి ప్రపంచానికి వచ్చి రోజైనా గడవక ముందే కన్ను మూశాడు. ఇంతటి ఘోరానికి పాల్పడడానికి ఎవరికి మనసొచ్చిందని చూసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ చేతికి ఆసుపత్రిలో ప్రసవం అయినట్లు బ్యాడ్జి సైతం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవతోనా.. లేదా అవివాహిత తొందర పాటుతో పుట్టిన బిడ్డను ఇలా చెరువు పాలు చేశారా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌ ఊర చెరువులో సోమవారం మగ శిశువు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు ఎల్కతుర్తి ఎస్‌ఐ రాజ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘట స్థలాన్ని పరిశీలించి శిశువు మృతదేహాన్ని బయటకు తీశారు. బొడ్డు తాడుకు పిన్ను, చేతికి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించినట్లు బ్యాడ్జి ఉండడంతో.. గ్రామంలో ఇటీవల గర్భంతో ఉండి ప్రసవం అయిన వారి వివరాల గురించి ఆయాలను పోలీసులు విచారణ చేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి తెచ్చి ఎవరైనా ఇక్కడ పడేశారా.. అన్నకోణంలోనూ విచారణ చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు.

న్యూస్‌టుడే, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు