logo

నాలాల్లో పూడికతీత పనులు చేపట్టండి

వరదనీరు పారే నాలాలు.. ఇలా ఉంటే ఎలా?, ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే అన్నారు.

Published : 16 Apr 2024 05:15 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వరదనీరు పారే నాలాలు.. ఇలా ఉంటే ఎలా?, ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఇటీవల ఈనాడులో ‘ఇంకా మేల్కోపోతే ఏమా‘నాలా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్‌ స్పందించారు. ఇంజినీరింగ్‌, ప్రజారోగ్య విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హంటర్‌రోడ్‌ బొందివాగు, న్యూశాయంపేట, సాకరాశికుంట, వరంగల్‌ రైల్వేగేటు మేదరివాడ, కీర్తిబార్‌, శివనగర్‌, మైసయ్యనగర్‌, కరీమాబాద్‌ జన్మభూమి జంక్షన్‌ రోడ్‌, కాశీకుంట నాలాలు చూశారు. పూడికతీత పనులు మొదలుపెట్టాలని ఇంజినీర్లను కమిషనర్‌ ఆదేశించారు. బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరమైందని, వరదనీరు సాఫీగా వెళ్లేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీర్‌ ప్రవీణ్‌చంద్ర, ఈఈ శ్రీనివాస్‌, ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్‌, డీఈలు రవికిరణ్‌, రంగారావు, ఏఈలు, శానిటరీ సూపర్‌వైజర్‌, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

హనుమకొండ పద్మాక్షిగుట్ట స్మార్ట్‌ రోడ్డు పనులు తిరిగి ప్రారంభించాలని కమిషనర్‌ ఇంజినీర్లను కోరారు. రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌రోడ్‌ నుంచి ఉర్సు బొడ్రాయి, కరీమాబాద్‌ వరకు స్మార్ట్‌రోడ్డు పనులు తనిఖీ చేశారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు.


మట్టి దందాపై అధికారుల ఆరా

నర్సంపేట, న్యూస్‌టుడే: ‘గుంతలు పూడుస్తూ.. గుంటల లెక్కన అమ్మకాలు’ శీర్షికతో సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంతో ప్రభుత్వ అధికారుల్లో కదలిక వచ్చింది. నిఘా వర్గాలు, రెవెన్యూ అధికారులు సోమవారం వివరాలు సేకరించారు. స్పెషల్‌ బ్రాంచి వరంగల్‌ తూర్పు డివిజన్‌ సీఐ రాఘవేందర్‌ సిబ్బందితో కలిసి సోమవారం మల్లంపల్లి మార్గంలో ప్రైవేటు కుంట, అసైన్డు భూముల్లోని చెరువు మట్టి పోసి పూడ్చిన గుంతలను పరిశీలించారు. ప్రైవేటు కుంట ఎవరిది, ఎంత విస్తీర్ణం,  అసైన్డ్‌ భూమిలో గతంలో జరిపిన తవ్వకాలతో ఏర్పడిన గుంతలను, ప్రస్తుతం దామెర చెరువు మట్టి పోసి చదును చేసిన వాటిని పరిశీలించారు. గతంలో తవ్వకాలు జరిపి మట్టిని విక్రయించిందెవరు? ప్రస్తుతం ఆ గుంతల్లో మట్టి పోయించి పూడ్చింది ఎవరు? ఆ గుంతలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి తదితర వివరాలను తెలుసుకున్నారు. రెవెన్యూశాఖ గిర్ధావరు ఎక్కడెక్కడ గుంతలు పూడ్చారు? మట్టి కుప్పలు పోసిన ఖాళీ స్థలాలెవరివి, మట్టి, మొరం కుప్పలు పోసుకున్న వారి వివరాలను సేకరించినట్లు తెలిసింది. స్పెషల్‌ బ్రాంచి అధికారులు సేకరించిన వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని