logo

ఓరుగల్లు కోటలో సాహస క్రీడలు

ఓరుగల్లు కోటలో సాహసక్రీడలను శ్రీకారం చుట్టి పర్యాటకులకు మంచి అనుభూతి కలిగించాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ‘కుడా’ అడ్వెంచర్‌ క్లబ్‌ను ఏర్పాటు చేసింది.

Updated : 16 Apr 2024 05:35 IST

‘కుడా’ అడ్వెంచర్‌ క్లబ్‌ ఏర్పాటు
ఈనాడు, వరంగల్‌

రుగల్లు కోటలో సాహసక్రీడలను శ్రీకారం చుట్టి పర్యాటకులకు మంచి అనుభూతి కలిగించాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ‘కుడా’ అడ్వెంచర్‌ క్లబ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ భువనగిరి (ఆర్‌సీఎస్‌బీ)  వారితో ఇటీవల ఒప్పందం కుదుర్చుకొంది. ఈ వేసవిలో అయిదు రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు సాహస క్రీడలపై శిక్షణను అందించే శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరెస్టు పర్వతారోహకురాలు అన్విత పడమటి పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగిస్తారు. కోటలో ఉన్న ఏకశిల గుట్టపైకి రాక్‌క్లైంబింగ్‌తోపాటు, కయాకింగ్‌ (బోటు నడపడం), నేచర్‌ వాక్‌.. ఇలా పలు సాహసోపేతమైన పలు క్రీడలపై శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులను ఈ శిబిరానికి ఎంపిక చేస్తారు. ఎవరైనా ఆసక్తిగా ముందుకొచ్చినా నిర్ణీత రుసుం తీసుకుని వారికి శిక్షణ ఇస్తారు.


శాశ్వత ఏర్పాట్లకు శ్రీకారం

సాహస క్రీడలు వేసవి శిబిరం వరకే కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఓరుగల్లు కోటలో ఏర్పాటుచేసేందుకు కుడా శ్రీకారం చుట్టింది. ఏకశిలా గుట్ట వద్ద ఉన్న  గుండు చెరువు చుట్టూ సుందరీకరణ పనులు చేసేందుకు సుమారు రూ.2 కోట్లు కేటాయించారు. గతంలో ఇక్కడ అయిదారెకరాల్లో రెండు చోట్ల మియావాకీ చిట్టడవిని అభివృద్ధి చేశారు. ‘హృదయ్‌’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సైతం కోటలో ఫసాడ్‌ లైటింగ్‌ను ఏర్పాటుచేసింది. వీటితోపాటు పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన సాహస క్రీడలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులు రాత్రిళ్లు సైతం కోటలో బస చేసేందుకు నైట్ క్యాంపు, క్యాంప్‌ ఫైర్‌  లాంటివి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే గుండు చెరువు నీరు కలుషితం కాకుండా భూగర్భ డ్రైనేజీ నిర్మించి పరిసర నివాసాల్లోని మురికి నీరు బయటకెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో చెరువు నీరు స్వచ్ఛంగా మారాయి. కోటలో ఇప్పుడున్న ఆకర్షణలకు తోడు త్వరలో సాహస క్రీడల వల్ల మరింత మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని