logo

భూ కబ్జా కేసులో.. మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అరెస్టు

భూ కబ్జాకు యత్నించిన భూపాలపల్లి పురపాలక సంఘం మాజీ వైస్‌ ఛైర్మన్‌, స్థానిక 12వ వార్డు భారాస కౌన్సిలర్‌ కొత్త హరిబాబును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 17 Apr 2024 05:27 IST

మాజీ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ కొత్త హరిబాబును విచారిస్తున్న సీఐ నరేష్‌కుమార్‌

భూపాలపల్లి, న్యూస్‌టుడే: భూ కబ్జాకు యత్నించిన భూపాలపల్లి పురపాలక సంఘం మాజీ వైస్‌ ఛైర్మన్‌, స్థానిక 12వ వార్డు భారాస కౌన్సిలర్‌ కొత్త హరిబాబును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నరేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త హరిబాబు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన నూనె అనిల్‌కుమార్‌కు సంబంధించిన జామాయిల్‌ తోటను ధ్వంసం చేసి, కాపలాదారులపై దాడులు చేయడమే కాకుండా జామాయిల్‌ తోటలో చెట్లను ధ్వంసం చేస్తూ అందులో నుంచే అక్రమంగా రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారమే బాధితుడి భూమిని కబ్జా చేయటానికి యత్నించినట్లు పేర్కొన్నారు. అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కొత్త హరిబాబును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసులో మరో వ్యక్తి దశరథం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు : జిల్లా వ్యాప్తంగా పేదలకు సంబంధించిన భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఒక ప్రకటనలో హెచ్చరించారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సామాన్యులకు, పేదలకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని వివరించారు. జిల్లా కేంద్రంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారి గురించి కూడా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని