logo

తొలి గిరిజన ఎంపీ చందులాల్‌

ఉమ్మడి వరంగల్‌ జిలా నుంచి తొలి గిరిజన ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టిన చరిత్ర దివంగత మాజీ మంత్రి అజ్మీరా చందులాల్‌కు దక్కింది. ములుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లిలో జన్మించారు.

Published : 17 Apr 2024 05:15 IST

మన ఎంపీలు..

ఉమ్మడి వరంగల్‌ జిలా నుంచి తొలి గిరిజన ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టిన చరిత్ర దివంగత మాజీ మంత్రి అజ్మీరా చందులాల్‌కు దక్కింది. ములుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లిలో జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్న ఆయన 1981లో జగ్గన్నపేట గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి అప్పుడే ఆవిర్భవించిన తెదేపాలో చేరి 1983లో ములుగు శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ చేసి ఓడారు. 1985లో జరిగిన ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా 6 నెలల పాటు పనిచేశారు. 1989లో మళ్లీ పోటీ చేసి ఓడారు. 1994లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఒక వైపు ఎమ్మెల్యే పదవిలో ఉంటూ 1996లో జరిగిన వరంగల్‌ పార్లమెంటు జనరల్‌ స్థానానికి తెదేపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2,92,887 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డిపై 17,440 ఓట్ల అధిక్యాన్ని పొందారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. 1998లో మరోసారి వరంగల్‌ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని డాక్టర్‌ కల్పనాదేవిపై 24,801 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత భారాస(అప్పటి తెరాస)లో చేరి 2014లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్‌ మంత్రి వర్గంలో గిరిజన, పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో పోటీ చేసి ఓడారు. ఆయన సర్పంచి నుంచి శాసనసభకు అటు నుంచి పార్లమెంటుకు ఎన్నికైన గిరిజన నేతగా చరిత్ర ఉంది. ఆయన నేతృత్వంలో ములుగులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. డిగ్రీ కళాశాల, ములుగులో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పర్యాటకాభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కృషి చేశారు.

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, ములుగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు