logo

పాఠశాలల అభివృద్ధికి నిధులు

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది.

Published : 19 Apr 2024 04:36 IST

గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు  తరగతి గదుల ముందు లేచిన బండరాళ్లు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. పాఠశాల యాజమాన్యాల కమిటీల స్థానంలో ఇప్పటికే కమిటీలను నియమించిన విద్యాశాఖ ఇప్పుడు నిధులు సైతం విడుదల చేసింది. బడులు పునఃప్రారరంభమయ్యే నాటికి మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించించడంతో క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పాఠశాలలను సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లా వ్యాప్తంగా 450 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉండగా 420 బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఎన్నుకున్నారు. ఇందులో 154 బడుల్లో మరమ్మతులు చేయాల్సి ఉందని గుర్తించి వీటిలో అభివృద్ధి, మరమ్మతు పనులకు రూ.5.83 కోట్లు అవసరమని ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు తేల్చారు. ఏటా ప్రధానోపాధ్యాయులు యూడైస్‌-ప్లస్‌లో బడికి సంబంధించిన సౌకర్యాలు, అవసరాలపై నమోదు చేసిన వివరాల ఆధారంగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.

అంచనాల తయారీలో నిమగ్నం

జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా ఇటీవలనే విద్యాశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, యూడైస్‌ ప్లస్‌ వివరాలిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్ని నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో సౌకర్యాలు, మరమ్మతుల అంచనాల తయారీలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్లు, తాగునీరు, మైనర్‌, మేజర్‌ మరమ్మతులు, గదుల్లో విద్యుత్తు దీపాలు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంచనాలు తయారు చేస్తున్నారు. జూన్‌ 10 నాటికి ఈ పనులను పూర్తి చేసి రెండో దశలో ‘మన ఊరు మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్‌ పనులు పూర్తి చేసేలా అదేశాలున్నాయి.


నాణ్యతగా పనులు చేపట్టేలా చర్యలు

- రాంకుమార్‌, డీఈవో. భూపాలపల్లి

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు నుంచి నిధులు వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల నియామకం పూర్తయింది. ప్రస్తుతం మండలాల వారీగా పనులు గుర్తించడం, నిధులు కేటాయింపు పూర్తి కావస్తోంది. నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు