logo

ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’

తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్‌ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది.

Published : 24 Apr 2024 04:10 IST

సుజల స్రవంతికి నీళ్లొదిలారు
పల్లె గొంతు తడిపే పథకాలపైనా పగ
కూల్చేసి ఇతర భవనాల నిర్మాణం
పేదలకు శుద్ధ జలం దూరం చేసిన వైనం

తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్‌ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆక్వా రంగం గణనీయంగా విస్తరించడం.. భూగర్భ జలాలు కలుషితంగా మారడం వంటి కారణాలతో శుద్ధజలం  తాగాలంటే అదృష్టంగా భావించాల్సిన రోజులు దాపురించాయి. ఈ నేపథ్యంలో అక్కరకు రావాల్సిన ఈ పథకాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలనపడ్డాయి. పేదలకు శుద్ధజలాన్ని అందకుండా చేశాయి.

కలిదిండి, కైకలూరు, కొయ్యలగూడెం గ్రామీణం, ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద 51 చోట్ల శుద్ధజలం సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం వాటిల్లో ఇప్పుడు 33 పని చేస్తున్నట్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పనిచేసేవి వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఉద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల పథకాన్ని నిలిపివేస్తే.. మరమ్మమతులు చేయించకపోవడంతో మరికొన్ని మూలకు చేరాయి.

మరమ్మతులకు నోచుకోక..

కొయ్యలగూడెం మండలం రామానుజపురం పంచాయతీ కార్యాలయం వద్ద 2019లో రూ.2.20లక్షలతో పథకం ఏర్పాటు చేశారు. రెండేళ్ల తరవాత పరికరాలు చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరవాత ఆ పథకం నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. నేటికీ మరమ్మతులు చేయలేదు. ఆర్వో కంట్రోల్‌ ప్యానల్‌, ట్యాంకర్లు, సిలెండర్లు, తదితర సామగ్రి నిరుయోగంగా మారాయి.  

  • ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో నాలుగేళ్లుగా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పథకం మూలకు చేరింది. ఏళ్ల తరబడి కలుషితనీటి బారిన పడిన ఈ గ్రామ ప్రజలకు అప్పట్లో ఇది వరంగా మారింది. పట్టించుకొనే వారు లేకపోవడంతో నిరుపయోగంగా మారి మళ్లీ కలుషిత నీరే దిక్కయ్యిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

విగ్రహం ఏర్పాటుకు పథకం నిర్వీర్యం

నిడమర్రు మండలం కొవ్విడిలో శుద్ధజల పథకం వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి నిర్వహణకు నీళ్లొదిలారు.వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థానిక వైకాపా నాయకులు మంచినీటి పథకాన్ని గతేడాది జూన్‌లో పడగొట్టేశారు. ఇది వివాదాలకు దారి తీసింది.

మూలకు చేర్చి..

కైకలూరు మండలం ఆటపాకలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాన్ని వైకాపా అధికారంలోకి వచ్చాక మూలకు చేర్చింది. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయలేక కొత్త యంత్రాలు నిర్వీర్యం చేసి ఆ భవనాన్ని కూల్చివేశారు. అదే చోట అంగన్‌వాడీ భవన నిర్మాణం చేపట్టారు. ఓ వైపు ఆక్వా.. ఇంకోవైపు కొల్లేరుతో శుద్ధలానికి మొహంవాచిన గ్రామస్థులకు మళ్లీ కలుషిత నీరే దిక్కవుతోంది. నిత్యం డబ్బులు వెచ్చించి  దాహం తీర్చుకునే ఆర్థిక స్థోమత లేక అల్లాడుతున్నారు. 

నాడు రూ.5.... నేడు రూ.30

మా ఊరిలోని సుజలాం రక్షిత నీటి ప్లాంటు ద్వారా రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేవారు. మంచి నీటి ప్లాంటు స్థానంలో వైఎస్‌ఆర్‌ విగ్రహం పెట్టేందుకు వైకాపా నాయకులు 2011 జూన్‌లో దీనిని పడగొట్టారు. ఆక్వా చెరువులు ఉండటంతో పంచాయతీ బోరు నీరు తాగలేం.

సారికి లెనిన్‌ బాబు, క్రొవ్విడి

పంచాయతీ బోరు నీరే తాగుతున్నాం

ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో 2018లో ఎన్టీఆర్‌ సుజల పథకంలో భాగంగా నీటి ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.5లకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని నిర్వహణ గాలికొదిలేసింది. ఫిల్టర్‌బెడ్లు కూడా లేవు. పంచాయతీ బోరు నీటిని తాగుతున్నాం.

పత్సా వంశీకృష్ణ, గోపినాథపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని