logo

జగన్‌.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?

‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్‌ బాకాలూదారు.

Updated : 25 Apr 2024 05:54 IST

ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో అరకొర సౌకర్యాలు
సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది
కానరాని స్కానింగ్‌, భోజన సదుపాయాలు
అయిదేళ్లుగా పూర్తికాని ఆసుపత్రుల భవనాల నిర్మాణాలు

‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్‌ బాకాలూదారు. ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రులు బాగుపడకపోగా ప్రమాణాలు మరింత దిగజారిపోయాయి.

ఏలూరు జిల్లాలోని మూడు ప్రాంతీయ, అయిదు సామాజిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వైద్యుల సమయపాలన మొదలు..కొత్త భవనాల నిర్మాణ పురోగతి.. భోజన సదుపాయాలు.. ఇలా ప్రతి అంశంలోనూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి.

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, బృందం

కైకలూరు నిత్యం ప్రసవ వేదనే..

కైకలూరు సీహెచ్‌సీకి 150 మంది వరకు గర్భిణులు వస్తుంటారు. ఇక్కడ  యంత్రం లేక ఏలూరు, గుడివాడ, భీమవరం, విజయవాడలో ప్రైవేటు ల్యాబుల్లో స్కానింగ్‌ తీయించాలని రిఫర్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారి స్కానింగ్‌ తీయించాలంటే అన్ని ఖర్చులు కలిపి రూ.2 వేల నుంచి 3వేల వరకు ఖర్చవుతోందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో గుంతల రోడ్లలో 30 కిమీ వెళ్లి భీమవరంలో స్కానింగ్‌ తీయించుకోవాలంటే ప్రసవ వేదన అనుభవిస్తున్నామని కైకలూరుకు చెందిన రాజకుమారి అనే గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మరో ప్రసూతి వైద్యురాలి అవసరం ఉంది. చింతలపూడిలో సైతం గర్భిణులకు స్కానింగ్‌ అందుబాటులో లేదు. ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి వైద్యులు రిఫర్‌ చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెంలో ఉదయం 9.30 గంటలైనా ఖాళీగా ఉన్న వైద్యుల గది

జంగారెడ్డిగూడెం

సమయపాలనతో పని లేదు.. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 9కి ఓపీ ప్రారంభం కావాల్సి ఉండగా 9.30 వరకు వైద్యులు సిబ్బంది రాలేదు. 10 గంటల వరకు వస్తూనే ఉన్నారు. రాత్రి డ్యూటీ చేసిన వైద్యులు మరుసటి రోజు ఓపీలో ఉండటం లేదు. రోగులు గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. 10 గంటల వరకు ఎక్స్‌రే కేంద్రం తెరవలేదు. ఇలా ప్రతి ఆసుపత్రిలో సమయపాలన సమస్య ఉంది. వైద్యులు వస్తే సిబ్బంది రారు. సిబ్బంది ఉంటే ఓపీ విభాగం తెరవరు.

అన్నం కూడా పెట్టలేరా..

పోలవరం ఆసుపత్రిలో గుత్తేదారు రెండు పూటలా భోజనం పెడుతున్నా..ఉదయం అల్పాహారం సరఫరా చేయడం లేదు. రోగులు ప్రశ్నిస్తే బయట కొనుక్కోమని ఉచిత సలహా ఇస్తున్నారు. భీమడోలులో భోజనం పెట్టేందుకు అసలు గుత్తేదారు ఎంపికే జరగలేదు. దీంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు సొంత డబ్బులతో బయట కొనుగోలు చేస్తున్నారు. కైకలూరులో మూడేళ్లుగా రోగులకు ఆహారం అందటం లేదు. గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గర్భిణులు, సాధారణ ఇన్‌ పేషంట్లు ఆహారం కోసం అవస్థలు  పడుతున్నారు.

పోలవరం

పోలవరంలో రూ.5.16 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతోంది. దాంతో పాత భవనంలోని ఒకే గదిలో ముగ్గురు వైద్యులు సేవలు అందిస్తున్నారు. అదే గదిలోనే పలురకాల పరికరాలు, శీతల యంత్రాలు ఉండటంతో రోగులు, వైద్యులు, సిబ్బంది నిత్యం యాతన అనుభవిస్తున్నారు. రోగులందరినీ ఇలా ఒకే గదిలో ఉంచాల్సిన పరిస్థితి.
చింతలపూడి లో  ఆసుపత్రి అంబులెన్స్‌ పరిస్థితి ఇది. రిఫరల్‌ కేసులకు రూ.వేలు ఖర్చు పెట్టుకుని ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.

‘మంగళవారం ఎక్స్‌రే తీశారు. రిపోర్టు ఈ రోజు ఇస్తానంటే వచ్చా’అని అంకాలగూడెం గ్రామానికి చెందిన ముప్పిడి నాగరత్నం తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌రే గది 10 గంటల వరకు తెరవకపోవడంతో అక్కడే నిరీక్షించారు. ఈ ఆసుపత్రిలో ఎక్స్‌రే విభాగానికి రెగ్యులర్‌ సిబ్బంది లేరు. డిప్యుటేషన్లపై నెట్టుకొస్తున్నారు.

నూజివీడు

రంగులపైనే శ్రద్ధ.. నూజివీడు ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే ఎన్నికల నియమావళి వస్తుందని హడావుడిగా ప్రారంభించారు. ఆసుపత్రి పాత భవనంలోనే కొనసాగుతోంది. ప్రారంభోత్సవాలు చేయడానికి..భవనానికి వైకాపా రంగులు వేయడంలో చూపిస్తున్న శ్రద్ధ నిర్మాణం పూర్తి చేయడటంలో మాత్రం కానరావటం లేదన్న విమర్శలున్నాయి.

కళ్లు చూపించుకోవాలంటే డాక్టర్‌ లేరు.. కన్ను సరిగా కనిపిచడం లేదు. కళ్ల దురదలు ఎక్కువగా వస్తున్నాయి. ఆసుపత్రిలో చూపించుకుందామని వస్తే డాక్టర్‌ లేరు. పరీక్షించకుండానే కళ్లల్లో వేసుకునే చుక్కల మందు, బిళ్లలు ఇచ్చారు. ఏలూరు వెళ్లి చూపించుకుందామనుకుంటున్నా.

డీ.వెంకటేశ్వరరావు, పట్టాయిగూడెం

ప్రైవేటుగా చేయిస్తున్నా.. నా భార్య మేరీకి మధుమేహంతో కాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. బుట్టాయగూడెం ఆసుపత్రిలో రసాయనాలు లేక రక్తపరీక్షలు బయట చేయించాలన్నారు. దీంతో ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నా. పది రోజులకు సుమారు రూ.6 వేలకు పైగా ఖర్చైంది. ఇక్కడ కేవలం కట్టు కట్టిస్తున్నా.

ఉండ్రాజవరపు పెంటయ్య, బుట్టాయగూడెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు