logo

తెల్లకోటుపై కరోనా కాటు!

పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ఆ ప్రభావం సేవలపై కనిపిస్తోంది. ఓపీల నుంచి శస్త్రచికిత్సల వరకు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.

Published : 19 Jan 2022 04:18 IST

నగరంలో వైద్య సేవలపై ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌: పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ఆ ప్రభావం సేవలపై కనిపిస్తోంది. ఓపీల నుంచి శస్త్రచికిత్సల వరకు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. గాంధీలో అత్యవసర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ వంద మందికి పైనే వైరస్‌ బారిన పడ్డారు. ఉస్మానియాలో మంగళవారానికి ఆ సంఖ్య 170కి దాటింది. ఇందులో ఎంబీబీఎస్‌ విద్యార్థుల నుంచి హౌస్‌ సర్జన్లు, పీజీలు, నర్సులు కూడా ఉంటున్నారు.

* ఉస్మానియాలో 70 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 40 మంది పీజీలు, మరో 30 మంది నర్సులకు పాజిటివ్‌ వచ్చింది. గాంధీలో 40-50 మంది హౌస్‌సర్జన్లు, మరో 40 మంది పీజీలకు కొవిడ్‌ అని తేలడంతో హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. దీంతో సేవలకు ఆటంకం ఏర్పడుతోంది.

* గాంధీలోని చిన్న పిల్లల విభాగంలో ప్రస్తుతానికి 9 మందికి మహమ్మారి సోకింది. ఇందులో ఒక అసోసియేట్‌, ఇద్దరు అసిస్టెంట్లు, నలుగురు పీజీలు ఇతర సిబ్బంది ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఒక ప్రొఫెసర్‌, ఒక అసోసియేట్‌, ఇద్దరు అసిస్టెంట్లు, ఇద్దరు పీజీలతో విభాగాన్ని నడిపిస్తున్నారు.

* వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 8 మంది వైద్యులు, భారీ సంఖ్యలో సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో సేవలకు ఆటంకం తప్పడం లేదు. నాంపల్లి, కొండాపూర్‌ ఇతర ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పలువురు సిబ్బంది కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు.  

ప్రత్యేక ప్రణాళిక అవసరం..
డెల్టా వేరియంట్‌ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రణాళికయుతంగా వ్యవహరించాయి. వైద్యులు, సిబ్బందిని గ్రూపులుగా విడదీసి వారి సేవలను వినియోగించుకున్నారు. దీంతో చాలా తక్కువ మంది కరోనా బారిన పడ్డారు. డెల్టా కంటే ఒమిక్రాన్‌లో వ్యాప్తి 70 రెట్లు అధికంగా ఉండటం వల్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని