logo

మున్సిపల్‌ అజెండా ఆమోదం.. హైకోర్టు నిలిపివేత

‘తాండూరు మున్సిపాలిటీలో ఈనెల 22న జరిగిన సమావేశంలో అజెండాను ఏక పక్షంగా ఆమోదించారు. అయితే దీన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిలిపివేస్తూ

Published : 27 Jan 2022 01:06 IST

వివరాలు వెల్లడిస్తున్న అధ్యక్షురాలు స్వప్న

తాండూరు, న్యూస్‌టుడే: ‘తాండూరు మున్సిపాలిటీలో ఈనెల 22న జరిగిన సమావేశంలో అజెండాను ఏక పక్షంగా ఆమోదించారు. అయితే దీన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని’ మున్సిపల్‌ అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. తాండూరులో బుధవారం ఆమె ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్వగృహంలో తెరాస కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఛైర్‌పర్సన్‌గా ఉన్న తన సంతకం లేకుండానే ఇన్‌ఛార్జి మున్సిపల్‌ కమిషనర్‌ అజెండాను ఆమోదించారని తెలిపారు. ఈ విషయమై తాను హైకోర్టులో సోమవారం లంచ్‌ మోషన్‌లో న్యాయవాది ద్వారా పిటిషన్‌ వేశానని తెలిపారు. మంగళవారం జరిగిన వాదోపవాదాలను న్యాయస్థానం పరిశీలించింది. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం అధ్యక్షురాలి సంతకం లేకుండా ఆమోదించిన అజెండాను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.

మరో సమావేశం నిర్వహించి...: ఉత్తర్వుల ప్రకారం అజెండాలోని అంశాల ఆధారంగా చేపట్టే పనులు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదే అజెండాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరో సమావేశం నిర్వహించి ఆమోదిస్తామని ఆమె చెప్పారు. వాస్తవానికి మున్సిపల్‌ సమావేశానికి సంబంధించిన అజెండాను ఛైర్‌పర్సన్‌ రూపొందించాల్సి ఉండగా ఇన్‌ఛార్జి కమిషనర్‌ రూపొందించారని తెలిపారు. ఈనెల 27న మున్సిపల్‌ సమావేశం నిర్వహించేందుకు 10వ తేదీన తాను ఇన్‌ఛార్జి కమిషనర్‌కు లేఖను అందజేస్తే పట్టించుకోలేదన్నారు. కమిషనర్‌ నిర్ణయించిన 22వ తేదీనే తన సంతకంలేని అజెండాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. 18 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం జరగబోయే సమావేశంలో యథావిథిగా ఆమోదం తెలుపుతామని చెప్పారు. సమవేశంలో తెరాస కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శోభారాణి, కౌన్సిలర్లు రత్నమాల, రవిరాజ్‌, రామకృష్ణ, ప్రవీణ్‌కుమార్‌, వెంకన్నగౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు కవితో పాటు పట్టణ తెరాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని