logo

కొత్త కోర్సులు.. సరికొత్త అవకాశాలు

విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి ఏడాదైంది. ఈ ఏడాదిలో వారు తీసుకున్న చర్యలేమిటి.? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు.? కొత్త కోర్సులేం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తదితర అంశాలపై బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతులతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు....

Published : 26 May 2022 02:30 IST

ఈనాడు, హైదరాబాద్‌

విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి ఏడాదైంది. ఈ ఏడాదిలో వారు తీసుకున్న చర్యలేమిటి.? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు.? కొత్త కోర్సులేం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తదితర అంశాలపై బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతులతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు. 


విద్యార్థులకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌

- కె.సీతారామారావు, ఉపకులపతి, బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం

1. ఏడాదిలో యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొస్తున్నాం. న్యాక్‌ అక్రిడిటేషన్‌కు సంబంధించి ప్రక్రియ చేపట్టాం. అకడమిక్‌, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. ఈఎమ్మార్సీ, సీఎస్‌టీడీని ఆధునికీకరించాం. సెంటర్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ఏర్పాటు చేసి రెండు కోర్సులు తీసుకొచ్చాం. ఫీజు చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో చేశాం. రాష్ట్రవ్యాప్తంగా లెర్నర్‌ సపోర్టు సెంటర్లు(ఎస్‌ఎస్‌సీ) పెంచుతున్నాం. సెమిస్టర్‌ తరగతులు 70 శాతం ఆన్‌లైన్‌, 30 శాతం ఆఫ్‌లైన్‌లో బోధిస్తున్నాం.

2. ఆచార్యుల భర్తీ జరగకపోవడంతో బోధనపై ప్రభావం పడుతోంది. దీన్నెలా అధిగమిస్తున్నారు.?

రెగ్యులర్‌ ఆచార్యులు లేకపోయినా.. బోధనకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. పదవీ విరమణ చేసిన, ఒప్పంద ఆచార్యులను నియమించుకున్నాం.

3. ప్రభుత్వం నుంచి జీతాలకు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. నిధుల కొరతను  అధిగమించే ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు?

గతంతో పోల్చితే ఈసారి ప్రభుత్వం నిధులు పెంచింది. ఇంకా పెరగాల్సి ఉంది. జీతాలు, పింఛన్లకు పూర్తిస్థాయిలో నిధులివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలిన వివిధ గ్రాంట్ల రూపేణా సొంతంగా సమకూర్చుకుంటున్నాం.

4. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చింది.?

విభజనపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కాకుండా అప్పుడప్పుడు చర్చిస్తోంది. దీనివల్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.

5. కొత్త కోర్సులు ఏమైనా తీసుకువస్తున్నారా.?
2022-23 నుంచి కొత్త కోర్సులు రానున్నాయి. మేనజ్‌మెంట్‌ విభాగంలో డిప్లొమా, సైకాలజీలో కౌన్సెలింగ్‌, బీఏలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌, ఆంత్రోపాలజీ తీసుకొస్తున్నాం. పీజీ స్థాయిలోనూ ప్రవేశపెట్టనున్నాం.

6. రానున్న రెండేళ్లలో మీ ప్రణాళికలు.?

వచ్చే విద్యా సంవత్సరం నుంచే పీజీలో సెమిస్టర్‌ విధానంతోపాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నాం. ఈ ఏడాది ఆఖరుకల్లా న్యాక్‌కు అవసరమైన పత్రాలు సమర్పించి.. వచ్చే ఏడాదిలో మంచి గ్రేడ్‌తో గుర్తింపు సాధిస్తాం. సైన్స్‌ కోర్సుల కోసం ల్యాబ్‌లు పీజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ప్రత్యేకంగా కంప్యూటర్‌ ల్యాబ్‌, లాంగ్వేజీ తీసుకురానున్నాం. వర్సిటీ మొబైల్‌ యాప్‌ తీసుకొస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలు యాప్‌లో లభిస్తాయి. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు అవసరమైన సిలబస్‌ స్టడీ మెటీరియల్‌ తీసుకొస్తున్నాం. దీన్ని నామమాత్రపు ధరలకే అందిస్తాం.


ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి చదువుకునే వీలు
- టి.కిషన్‌రావు, ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

1. ఏడాదిలో యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?

ప్రతి కోర్సులో సీట్ల సంఖ్యను మూడింతలు పెంచి ఆసక్తి కలిగిన ప్రతి విద్యార్థి చదువుకునే అవకాశం కల్పించాం. పేద విద్యార్థుల ఫీజులకు ఇబ్బంది లేకుండా దాతల సహకారంతో చెల్లిస్తున్నాం. పదేళ్ల తర్వాత ఎంఏ హిస్టరీ, కల్చర్‌ అండ్‌ టూరిజం తిరిగి పునరుద్ధరించాం. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సు ప్రారంభించాం. ఎంఫిల్‌, పీహెచ్‌డీలో 160 సీట్లు భర్తీ చేశాం. ప్రాజెక్టు అసిస్టెంట్లు, ఇన్‌స్ట్రక్టర్లకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదా కల్పించి జీతాలు పెంచాం. 70 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. ఎలాంటి రాజకీయ జోక్యం, పైరవీలు లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కవులు, రచయితలను ఎంపిక చేసి అవార్డులు అందించాం.

2. ఆచార్యుల భర్తీ జరగకపోవడంతో బోధనపై ప్రభావం పడుతోంది. దీన్నెలా అధిగమిస్తున్నారు.?

2. రెగ్యులర్‌ ఆచార్యులు లేకపోవడంతో ఇబ్బంది ఉన్నా.. బోధనకు లోటు లేకుండా చూసుకుంటున్నాం. పదవీ విరమణ చేసిన  వారితోపాటు తాత్కాలిక అధ్యాపకులను నియమించుకున్నాం. దూరవిద్యపై కొంత ప్రభావం రెగ్యులర్‌ పీజీ కోర్సులు ఆగిపోయాయి. ఆ స్థానంలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహిస్తున్నాం.

3. ప్రభుత్వం నుంచి జీతాలకు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. నిధుల కొరతను  అధిగమించే ఎలాంటి వ్యూహాలు  అనుసరిస్తున్నారు?

ఏడాది కాలంలో నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. బాచుపల్లిలోని క్యాంపస్‌లో జరుగుతున్న భవన నిర్మాణాలు రూసా నిధులతో జరుగుతున్నాయి.

4. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చింది.?

విభజన విషయంలో ఏపీ ప్రభుత్వంలో అలసత్వం కనిపిస్తోంది. చర్చల దశలోనే ఉంది. అక్కడి పీఠాలలోని సిబ్బందికి జీతాలు సరిగా అందకపోవడంతో యూనివర్సిటీ నుంచే భరించాల్సి వస్తోంది.

5. కొత్త కోర్సులు ఏమైనా తీసుకువస్తున్నారా.?

బాచుపల్లికి మారిన తర్వాత కొత్త కోర్సులు తీసుకొచ్చే ఆలోచన ఉంది. లైబ్రరీ సైన్స్‌, డిజైన్‌ కోర్సులు ప్రారంభిస్తున్నాం.

6. రానున్న రెండేళ్లలో మీ ప్రణాళికలు.?

త్వరలోనే బాచుపల్లికి క్యాంపస్‌ను తరలించాలనుకుంటున్నాం. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ కేవలం పీజీ కోర్సులే నిర్వహిస్తాం. సర్టిఫికెట్‌, డిప్లొమాతోపాటు సాయంకాల కోర్సులు నాంపల్లి క్యాంపస్‌లో కొనసాగిస్తాం. ఈ ఏడాది జులైలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని