icon icon icon
icon icon icon

చిన్న దెబ్బకు నానాయాగీ.. చిన్నాన్న హత్యపై మాట్లాడరేం?

‘సీఎం జగన్‌కు చిన్న గులకరాయి తగిలితేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేస్తున్నారు.. స్వయానా చిన్నాన్న వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటని ఎందుకు ప్రచారం చేశారు.

Updated : 21 Apr 2024 06:53 IST

సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌
కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

ఈనాడు, కడప, కర్నూలు-కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘సీఎం జగన్‌కు చిన్న గులకరాయి తగిలితేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేస్తున్నారు.. స్వయానా చిన్నాన్న వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటని ఎందుకు ప్రచారం చేశారు. దానికి సీఎం సమాధానం చెప్పాలి. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డికి తిరిగి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. సీబీఐ చెప్పిన విషయాలనే మేం మాట్లాడుతుంటే జగన్‌, అవినాష్‌రెడ్డిలకు ఉలుకెందుకు? వివేకాను చంపడమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాక్షి పత్రికలో కథనాలు రాయిస్తారా? నారాసుర రక్తచరిత్రంటూ రాశారే.. దానికేం సమాధానం చెబుతారు’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.  హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌కు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అనంతరం వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ అవినాష్‌రెడ్డి ఎంపీగా ఉన్నాడంటే అది తన తండ్రి పెట్టిన భిక్షేనన్నారు. అంతకుముందు షర్మిల నామినేషన్‌ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు. అనంతరం భర్త అనిల్‌కుమార్‌ వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మీడియా సెల్‌ కన్వీనర్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నాయి.

ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాల్లా చూస్తున్నారు

‘సీఎం జగన్‌ ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాల్లా చూస్తున్నారు. అందుకే కనీసం వారి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా కలవకుండా నాలుగున్నరేళ్లు నిద్రపోయి, ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చారు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మద్య నిషేధం చేయకుంటే ఓట్లు అడగనన్న జగన్‌.. ఇప్పుడు మేము సిద్ధం అంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత ఎన్నికల సమయంలో చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img