icon icon icon
icon icon icon

ఆడపిల్లలమైనా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అధికారాన్ని, ఏపీ పోలీసులను అడ్డుపెట్టి అవినాష్‌రెడ్డిని కాపాడారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు.

Published : 22 Apr 2024 05:13 IST

అధికారాన్ని అడ్డం పెట్టి అవినాష్‌ను జగన్‌ కాపాడారు
నిందితులకు శిక్ష పడితే ప్రజాకోర్టుకు వచ్చేవాళ్లమే కాదు
న్యాయం కోసం నిలబడకపోతే మనుషులకు, మానులకు తేడా ఏముంది?
చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వడం అన్న బాధ్యత
కొసరు వాటా ఇచ్చి అప్పుగా చూపించే వాళ్లున్నారు
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఈనాడు, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అధికారాన్ని, ఏపీ పోలీసులను అడ్డుపెట్టి అవినాష్‌రెడ్డిని కాపాడారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు. న్యాయయాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు వచ్చిన ఆమె నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోనూ, అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీటులో చేర్చిందని... తాను గానీ, సునీత గానీ సీబీఐ చెప్పింది మాత్రమే చెబుతున్నామని మరోసారి గుర్తుచేశారు. ‘వివేకా హత్యకేసులో నేటివరకూ న్యాయం జరగలేదు. అందుకే నేను, సునీత నిలబడి కొట్లాడుతున్నాం. ప్రజాకోర్టులో న్యాయం పొందే అవకాశం ఉండటంతో అడుగుతున్నాం. ఇందులో తప్పేముంది? అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు వచ్చినప్పుడు సీబీఐ పని సాఫీగా జరిగి ఉంటే, అవినాష్‌రెడ్డిని జగన్‌ కాపాడకపోయి ఉంటే.. కేసుకు న్యాయం జరిగి ఉంటే.. హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్షలు పడి ఉంటే ఈ రోజు మేము రోడ్డు మీదకు వచ్చే అవసరమే ఉండేది కాదు. అయిదేళ్లు వేచి చూసినా న్యాయం జరగలేదు. అందుకే ప్రజాతీర్పు కోసం ప్రజాకోర్టులో కొంగుచాచి న్యాయం అడుగుతున్నాం. ఇది తప్పెలా అవుతుంది? ప్రజల్నే తీర్పు చెప్పాలంటున్నాం. హత్య కేసులో నిందితులు వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత కూడా అవినాష్‌రెడ్డిని కలిశారని గూగుల్‌ టేకౌట్‌ మ్యాప్‌ల ఆధారంగా తెలుస్తోందని సీబీఐ స్పష్టంగా చెప్పింది. ఆయా మ్యాప్‌లలో 50 మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల తేడా వస్తుందని అవినాష్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన ఇంట్లోనే సాక్ష్యాలు ఎందుకు చూపుతున్నాయి? వెయ్యి మీటర్ల తర్వాత ఎందుకు చూపలేదో ఆయన సమాధానం చెప్పాలి. దీంతోపాటు అవినాష్‌రెడ్డికి, హత్య కేసులో నిందితులకు మధ్య సంభాషణలు జరిగినట్లు ఫోన్‌కాల్‌ రికార్డులు కూడా ఉన్నాయి. వాటినీ కాదని బుకాయిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంటుంది? హత్యకు నగదు లావాదేవీలు జరిగాయని సీబీఐ చెప్పింది. అప్రూవర్‌, నిందితులు కూడా అడ్వాన్సులు తీసుకున్నట్లు ఒప్పుకొన్నట్లు సీబీఐ స్పష్టంగా తేల్చింది. అయినా అది కాదంటున్నారు. దేవుడు ప్రజలందరికీ ఇంగితజ్ఞానం ఇచ్చారు. సీబీఐ ఆయా సాక్ష్యాలు, ఆధారాలు చూపక ముందు ఇంటి వాళ్లే ఆ హత్య చేశారన్న విషయాన్ని మేమే నమ్మలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాం? పోనీ సీబీఐ ఇంకెవరినైనా నిందితులుగా చూపించిందా? సునీతను గానీ, ఆమె భర్త రాజశేఖర్‌ను గానీ చూపిందా? వారిపై ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సీబీఐ చూపించిన నిందితులపై తప్ప ఇతరులపై ఎలాంటి సాక్ష్యాలు లేవు. అన్నివేళ్లూ అవినాష్‌రెడ్డివైపే చూపిస్తున్నాయి. శాస్త్రీయంగా చెప్పిన అంశాలనే ప్రజలు నమ్ముతారు. సభ్యసమాజంలో బతుకుతూ... న్యాయం కోసం నిలబడకపోతే మనుషులకు, మానులకు తేడా ఏముంటుంది?’ అని షర్మిల ప్రశ్నించారు.

న్యాయం కోసం పోరాడుతున్నా

తన గుండెల్లో నిజాయతీ ఉందని, న్యాయం కోసమే పోరాటం చేస్తున్నామని.. ఆస్తుల కోసమో, రాజకీయం కోసమో, వారసత్వం కోసమో చేస్తున్న పోరాటం కాదని వైఎస్‌ షర్మిల అన్నారు. న్యాయం జరగలేదని సునీతమ్మ, సౌభాగ్యమ్మ కుమిలిపోతున్నారని గుర్తుచేశారు. ఒక పెద్దమనిషిని ఏడుసార్లు గొడ్డలితో నరికితే, ఎముకలు, మెదడు కూడా బయటకు వచ్చి ఘోరంగా మృత్యువాత పడితే కొందరు పెద్దవాళ్లు దాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అందుకే ఆడపిల్లలమైనా ప్రాణాలకు తెగించి మొండిగా పోరాడుతున్నట్లు చెప్పారు. ఒకరి స్క్రిప్టు చూసి చదవాల్సిన అవసరం లేదన్నారు.

న్యాయరాజధాని చేస్తామన్నారు.. ఒక్క ఇటుక వేశారా?

కర్నూలును న్యాయరాజధాని చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కనీసం ఒక్క ఇటుకైనా వేశారా అని షర్మిల ప్రశ్నించారు. కర్నూలును స్మార్ట్‌సిటీగా మారుస్తానని చెప్పి కనీసం ఒక మురుగు కాలువనైనా నిర్మించారా? అని నిలదీశారు. ఆయన     రూ.వంద ఇచ్చి... రూ.వెయ్యి లాగుతున్నారని   ఎద్దేవా చేశారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మట్టి చెంబులిచ్చి... వెండి చెంబులు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు.


జగన్‌పై పరోక్షంగా చురకలు

‘జగన్‌ నాకు అప్పిచ్చారు... అదే విషయాన్ని అఫిడవిట్‌లో చేర్చాను. ఏ అన్న అయినా చెల్లెలికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆడబిడ్డ హక్కు. ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. ఆ ధర్మాన్ని సహజంగా అందరూ పాటిస్తుంటారు. కొందరు చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమదిగా భావిస్తుంటారు. కొందరు గిఫ్టుగా ఇస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చేవాళ్లు కూడా లేకపోలేరు. చెల్లెలి వాటా ఇవ్వకపోగా, ఒక్క కొసరు భాగం ఇచ్చి... దాన్నీ అప్పు ఇచ్చినట్లుగా చూపించేవాళ్లు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. అది దేవుడికి తెలుసు. మా కుటుంబంలో అందరికీ తెలుసు’ అని షర్మిల పరోక్షంగా తన సోదరుడు జగన్‌పై చురకలు వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img