icon icon icon
icon icon icon

వైకాపా అరాచకాలపై ఓటే పాశుపతాస్త్రం

ముఖ్యమంత్రి జగన్‌ ఓ అహంకారి.. విధ్వంసం, వినాశనం తప్ప ఆయనకు అభివృద్ధి చేతకాదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని..

Updated : 23 Apr 2024 07:07 IST

అహంకారం, విధ్వంసం, దోపిడీ.. జగన్‌ జీవితాశయాలు
అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏలుతోంది
ప్రజలు మేల్కొనకపోతే భారీ నష్టం
జగ్గంపేట, శృంగవరపుకోట ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు ధ్వజం
కూటమి సృష్టించే సునామీలో వైకాపా కొట్టుకుపోతుందని ధీమా
వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే వినాశనమే


‘గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మి న్యాయం కోసం దిల్లీ వెళ్లి నిరసనగా చేతివేలు కోసుకున్నారు. అభ్యుదయ మహిళా సంఘం నడిపే లక్ష్మి.. రాష్ట్రంలో చిన్నపిల్లలతో గంజాయి అమ్మిస్తున్నారని, దానికి బానిసలను చేస్తున్నారని, భూకబ్జాలు, దోపిడీపై ఎంతమందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ప్రధాని, రాష్ట్రపతికి ఈ అరాచకాల గురించి చెప్పడానికి ఢిల్లీ వెళ్లారు. సమాజం కోసం ఎంత బాధపడ్డారో, ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పడానికి ఆమె ఉదాహరణ. ఇలాంటి దుర్మార్గులు మళ్లీ అధికారంలోకి వస్తే మన గతేంటి? రాబోయే రోజుల్లో జగ్గంపేటలో మీ తల మీరే నరుక్కునే పరిస్థితి వస్తుంది.. లేదంటే మీ తల నరికే పరిస్థితి వస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకోండి.  

జగ్గంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు


ఈనాడు - కాకినాడ, విజయనగరం, న్యూస్‌టుడే- జగ్గంపేట, శృంగవరపుకోట: ముఖ్యమంత్రి జగన్‌ ఓ అహంకారి.. విధ్వంసం, వినాశనం తప్ప ఆయనకు అభివృద్ధి చేతకాదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని.. ఇప్పటికైనా ప్రజలంతా మేల్కొనకపోతే మరింత నష్టపోతామని హెచ్చరించారు. జగన్‌తోపాటు వైకాపా నాయకులందరికీ అహంకారం ఎక్కువైందని, దాన్ని తగ్గించే ఓటు అనే పాశుపతాస్త్రం ప్రజల దగ్గరే ఉందని అన్నారు. మార్పు స్పష్టంగా కనిపిస్తోందని.. అది తుపానుగా మారి, అందులో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా శృంగవరపుకోటల్లో సోమవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. ‘ఒక దొంగ, దోపిడీదారు ఇంటికొస్తే ఏం చేస్తారు? ఊరంతా ఏకమై దొంగను తరుముతారా లేదా? రాష్ట్రంలో బందిపోటు దొంగ పడ్డాడు. కాపాడుకోవడానికి వైకాపాను తరిమికొట్టడానికి మీరు సిద్ధమా’ అని ప్రజలను ప్రశ్నించారు. జగన్‌ హామీ ఇచ్చిన మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సీపీఎస్‌ రద్దు, జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీ ఏమయ్యాయని నిలదీశారు. ఉద్యోగాలు కావాలంటే కూటమి రావాలని.. గంజాయి కావాలంటే జగన్‌ రావాలని.. ఏం కావాలో మీరే తేల్చుకోవాలని యువతను కోరారు. జగన్‌ పెరుగు, మీగడ మింగేసి, ప్రజలకు మజ్జిగ నీళ్లు పోస్తున్నారని విమర్శించారు. ‘నేను బ్రహ్మాండమైన టిడ్కో ఇళ్లు కట్టా. అవన్నీ ఉచితంగా ఇస్తా. ప్రతి పేదవాడికి రెండు లేదా మూడు సెంట్లు ఉచితంగా ఇస్తా’ అని ప్రకటించారు. వచ్చే నెల పింఛనును సచివాలయ సిబ్బందిని ఇంటింటికీ పంపించి, పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

సినిమా వాళ్లను పిలిచి అవమానించారు

‘చిరంజీవికి సమాజంలో గౌరవం ఉంది. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. రాజమౌళి, ప్రభాస్‌ బాహుబలి సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. జగన్‌ అలాంటివారిని ఇంటికి పిలిపించి, అవమానించారు. సజ్జల లాంటి దళారి, సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని విమర్శించడం న్యాయమా? పవన్‌ కల్యాణ్‌ గోటికి కూడా సరితూగని జగన్‌ ఆయన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నన్నూ ఇబ్బందిపెట్టారు’ అని ధ్వజమెత్తారు. ‘అప్పట్లో కరెంటు బిల్లు రూ.200 ఉంటే.. ఇప్పుడు రూ.వెయ్యి అయ్యింది. (లేదు లేదు.. రూ.2 వేలైందని ఎస్‌.కోటలో సభికులు స్పందించారు) రూ.60 విలువైన మద్యాన్ని రూ.300కు అమ్ముతున్నారు. దీంతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. ‘ఉత్తరాంధ్ర అంటే నాకు నమ్మకం. సైన్యంలో చేరి, దేశ రక్షణకు ఉత్తరాంధ్ర యువత ముందుంటారు. అన్ని రకాల పరీక్షలకూ పోటీపడతారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతా. రెండో సంతకంతో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు వచ్చేలా చేస్తా’ అని పేర్కొన్నారు.


నేడు గజపతినగరం కోర్టులో చంద్రబాబు ప్రమాణం

గజపతినగరం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో నామినేషన్‌ వేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం ప్రమాణ పత్రాన్ని చంద్రబాబు మంగళవారం గజపతినగరం కోర్టులో చదవనున్నట్లు తెదేపా నాయకులు తెలిపారు.


డీఎస్సీపై మొదటి సంతకం ఈ పెన్నుతోనే..

జగ్గంపేట పర్యటనకు వచ్చిన చంద్రబాబును రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి కలిసి, పెన్ను బహూకరించారు. ‘ఓ ఆడబిడ్డ పెన్ను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక డీఎస్సీపై మొదటి సంతకం చేయమని కోరారు. కూటమి వచ్చాక మొదటి సంతకం డీఎస్సీపై ఇదే పెన్నుతో చేస్తా’ అంటూ చంద్రబాబు సభలో ఆ కలాన్ని అందరికీ చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img