icon icon icon
icon icon icon

అంతా ఆణిముత్యాలట.. అక్రమార్కుల మాటేంటి?

విజయనగరం నుంచి వైకాపా తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్‌తోపాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివారు, వెన్నలాంటి మనసున్న వారని సీఎం జగన్‌ కితాబిచ్చారు.

Published : 24 Apr 2024 05:50 IST

విజయనగరం జిల్లాలో  పోటీ చేసే  వైకాపా వాళ్లంతా
సౌమ్యులని జగన్‌ కితాబు

ఈనాడు, అమరావతి, విజయనగరం: విజయనగరం నుంచి వైకాపా తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్‌తోపాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివారు, వెన్నలాంటి మనసున్న వారని సీఎం జగన్‌ కితాబిచ్చారు. విజయనగరం జిల్లా చెల్లూరులో మంగళవారం నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సుయాత్రలో వారిని ప్రజలకు పరిచయం చేశారు. అయిదేళ్లుగా విజయనగరం జిల్లాలో భూకబ్జాలు, అక్రమ మైనింగ్‌, సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలకు పాల్పడిన నాయకులెవరో కూడా సీఎం జగన్‌ కనుక్కుని ఓటర్లకు వివరిస్తే బాగుండేదేమో? అని జిల్లావాసులు పేర్కొంటున్నారు.

సౌమ్యుడు-1: బొత్స సత్యనారాయణ

‘చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ నాకు తండ్రిలాంటి వారు. అన్నా అంటాను. మంచివాడు. సౌమ్యుడు’ అంటూ జగన్‌ ఆయన్ని ఆకాశానికెత్తేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించే చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం కొన్నేళ్లుగా శాసిస్తోంది. వారు చెప్పిందే వేదం.. చేసిందే నిర్ణయమన్నట్లు ఉంది. మరి మీరు మంచివారనే బొత్స సత్యనారాయణకు వాళ్ల సంగతి ఏమైనా తెలుసా? భూవివాదాలైనా, ఇతర ఆస్తుల గొడవలైనా ఈ కుటుంబమే సెటిల్‌మెంట్లు చేస్తుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులనుంచి ఉద్యోగుల వరకు వీరు చెప్పినట్లు చేయాల్సిందేనని అంటున్నారు. సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారని.. బొబ్బిలిలోని పారిశ్రామిక గ్రోత్‌సెంటర్‌లో ఒక నాయకుడి సోదరుడు తక్కువ ధరకే భూమి దక్కించుకున్నారనే విషయమైనా మంత్రి బొత్స దృష్టికి వచ్చిందో లేదో కాస్త ఆరా తీసి ఓటర్లకు వివరిస్తారా జగన్‌?


సౌమ్యుడు-2: బొత్స అప్పలనరసయ్య

‘గజపతినగరం నుంచి పోటీ చేస్తున్న అప్పలనరసయ్య మంచివాడు.. సౌమ్యుడు. వెన్నలాంటి మనసున్నవాడు’ అని జగన్‌ పరిచయం చేశారు. గజపతినగరంలో స్థిరాస్తి వ్యాపారం చేసే నాయకుడొకరు తాము వేసే లేఅవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లేయిస్తారట. పట్టణంలో బాహ్యవలయ రహదారి పేరుతో తమ భూముల విలువలూ పెంచుకున్నారట. తన నియోజకవర్గంలో జరిగే ఈ అక్రమాలు అప్పలనరసయ్యకు తెలిసే ఉంటాయి కదా? కాస్త కనుక్కుంటారా జగన్‌! కె.కొత్తవలస, ఎం.గుమడాం గ్రామాల్లో రైతుల మధ్య భూవివాదాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసి లాభాలు దండుకున్న ప్రముఖులెవరో తెలుసుకుని ఓటర్లకు చెబుతారా?


సౌమ్యుడు-3 కోలగట్ల వీరభద్రస్వామి

‘విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రస్వామి సౌమ్యుడు. ఆయన మనసు వెన్న’ అంటూ జగన్‌ కితాబిచ్చారు. వెన్నలాంటి మనసున్న వీరభద్రస్వామికి విజయనగరంలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకునే నాయకుల సంగతి ఏమైనా తెలుసో లేదో? పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కొని అదే భూమిని మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్ముకున్న నాయకులెవరో కాస్త కనుక్కోకూడదూ? ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ, రిజిస్ట్రేషన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా కప్పం కట్టాల్సిందేనట! వ్యాపారం ప్రారంభిస్తే అందులో వాటా ఇవ్వాల్సిందేనట. ఇవన్నీ చేసేదెవరో, నియోజకవర్గాన్ని గంజాయి మాఫియాకు కేంద్రబిందువుగా మార్చిందెవరో సౌమ్యుడైన వీరభద్రస్వామి మీకు ఏమైనా చెప్పారా? లేదా? కాస్త ఆరా తీయండి.


సౌమ్యుడు-4 బడ్డుకొండ అప్పలనాయుడు

‘నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్న అప్పలనాయుడు మంచివాడు. సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి’ అని జగన్‌ పరిచయం చేశారు. మైనింగ్‌ మాఫియాకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చి భోగాపురం మండలంలో మైనింగ్‌ తవ్వకాల ద్వారా గ్రామాలను ధ్వంసం చేసి నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి కొండపై తవ్వకాలకు ఏర్పాట్లుచేసిన ప్రముఖులెవరో మీకెంతో నమ్మకస్తులైన అప్పలనాయుడికి తెలుసో లేదో? భూఆక్రమణలు, ఇసుక దందాల ద్వారా రూ.కోట్లు ఆర్జించే నాయకులెవరో కనుక్కుంటారా?


సౌమ్యుడు-5 శంబంగి వెంకట చినఅప్పలనాయుడు

‘బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్న చినఅప్పలనాయుడు మంచివాడు. సౌమ్యుడు. వెన్నలాంటి మనసున్నవాడు’ అని జగన్‌ పొగడ్తలు కురిపించారు. వెన్నలాంటి మనసున్న చినఅప్పలనాయుడుకు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు బెదిరించి తక్కువ ధరకు లాక్కునే నాయకుల సంగతి ఏమైనా తెలిసి ఉంటుందంటారా? ఆ నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా టెండరు వేసేది ఒక్క సంస్థేనట. అధికారాన్ని ఉపయోగించి లేఅవుట్లలో సామాజిక అవసరాల స్థలాన్నీ అమ్మేసుకుంటారంట.. వాళ్లెవరో ఆయన్ను కనుక్కుని చెబుతారా?


సౌమ్యుడు-6: గొర్లె కిరణ్‌

‘ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తున్న కిరణన్న మంచివాడు. సౌమ్యుడు. కటువుగా అప్పుడప్పుడు కనిపిస్తాడు గానీ .. గుండె చాలా మెతక’ అని జగన్‌ కితాబిచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇసుక దోపిడీ, రియల్‌ఎస్టేట్‌ దందాలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. లేఅవుట్‌ వేయాలంటే కప్పం కట్టాల్సిందేనట. కొండల్ని కరిగించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో సౌమ్యుడైన కిరణ్‌ను కనుక్కుంటారా? ప్రశాంత ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాలకు వేదికగా మార్చిన నాయకుడెవరో మెతక గుండె కలిగిన మీ మంచివాడికి తెలుసేమో కనుక్కుని ఓటర్లకు వివరిస్తారా జగన్‌?


సౌమ్యుడు-7 బెల్లాన చంద్రశేఖర్‌

‘విజయనగరం లోక్‌సభ స్థానానికి పోటీ చేసే చంద్రశేఖరన్న. మంచివాడు, సౌమ్యుడు’ అని సీఎం జగన్‌ ప్రజలకు పరిచయం చేశారు. చీపురుపల్లి మండలం దేవరాపొదిలాంలో తనకు ప్రభుత్వం కేటాయించిన 4.75 ఎకరాల మెట్ట భూమి కబ్జాకు గురైందని మాజీ సైనికుడు ఎస్‌.శ్రీనివాసరావు రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాసిన సంగతి మంచివాడైన చంద్రశేఖర్‌కు తెలుసా? ఆయనకు చెప్పి శ్రీనివాసరావుకు న్యాయం చేయకూడదూ? పోలీసు కేసులు, ప్రైవేటు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసే నేతలెవరో.. మద్యం సిండికేట్‌, అక్రమ మైనింగ్‌ తవ్వకాలకు కారకులెవరో కాస్త కనుక్కుంటారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img