icon icon icon
icon icon icon

డబ్బు పంపిణీకి వైకాపా నేతల కొత్త ఎత్తుగడ..!

అక్రమ మార్గాల్లోనైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉద్దేశంతో.. చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఇప్పుడు తాజాగా ఓ కొత్త అక్రమానికి తెరతీశారు.

Updated : 24 Apr 2024 06:34 IST

తుడా నుంచి రూ.10 కోట్లు విడుదల
ఎంపీడీవోలు అడిగారంటూ తుడా వీసీ బుకాయింపు
ఎన్నికల సంఘం ఆదేశాలతో  నివేదిక కోరిన కలెక్టర్‌

ఈనాడు, తిరుపతి: అక్రమ మార్గాల్లోనైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉద్దేశంతో.. చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఇప్పుడు తాజాగా ఓ కొత్త అక్రమానికి తెరతీశారు. తన నియోజకవర్గంలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించేందుకు రూ.10 కోట్లను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) నుంచి అయిదు రోజుల కిందట విడుదల చేయించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు(ఈసీఐ) ఫిర్యాదు అందడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. సరైన వివరాలు సమర్పించకపోవడంతో వ్యక్తిగతంగా హాజరు కావాలని తుడా వీసీ వెంకటనారాయణను కలెక్టర్‌ ఆదేశించారు. తుడా నుంచి రూ.10 కోట్లను ఎంపీడీవో ఖాతాలకు ఇటీవల బదిలీ చేశారు. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల నుంచి అనుమతితోనే బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని పాటించలేదు. తుడా పరిధిలో ప్రధాన పనులన్నీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులే చేస్తున్నారు. ప్రస్తుతం తుడా ఛైర్మన్‌గా ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి ఉన్నారు. నిధులను ఎంపీడీవోల ఖాతాల్లో జమ చేసి తద్వారా గుత్తేదారులకు ఇచ్చి.. ఆపై ఎన్నికల తాయిలాలుగా పంపిణీ చేసేందుకు చెవిరెడ్డి కుటుంబం చూస్తోందనే ఆరోపణలున్నాయి. దీనిపై చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ)  ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీఐ సూచించింది. ఈ ఫిర్యాదును జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌ను విచారించాల్సిందిగా ఆదేశించారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా తుడా వీసీని కలెక్టర్‌ కోరారు. తుడా వీసీ ఇచ్చిన నివేదిక పలు అనుమానాలకు తావిస్తోంది. పనులన్నీ ఎప్పుడో మంజూరై ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇందులో కొన్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయని, 50 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు. పనులకు నిధులు మంజూరు చేయాలంటూ ఎంపీడీవోలు కోరినట్లు వీసీ తన నివేదికలో పేర్కొన్నారు. సొమ్ము ఎంపీడీవోలకు మాత్రమే ఇచ్చామని, గుత్తేదారులకు కాదంటూ చెప్పారు. అయితే తుడా వీసీ ఇచ్చిన నివేదికలో పనులు చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులు, నిధులు విడుదల చేయాలంటూ ఎంపీడీవోలు అడిగిన లేఖ, ఉన్నతాధికారుల నుంచి తీసుకున్న అనుమతుల వివరాలను పొందుపరచలేదని కలెక్టర్‌ గుర్తించారు. దీంతో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యక్తిగతంగా హాజరై సమర్పించాల్సిందిగా కలెక్టర్‌ తుడా వీసీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img