icon icon icon
icon icon icon

సర్కారే ప్రాణాలు తీస్తోంది

రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

Published : 24 Apr 2024 06:58 IST

కల్తీ మద్యంతో 25 శాతం మరణాలు
భాజపాతో ప్రేమాయణం సాగిస్తున్న జగన్‌
బాపట్ల, తెనాలి సభలలో  పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

ఈనాడు, బాపట్ల, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ‘అసలు ప్రభుత్వం ఎందుకు మద్యం అమ్ముతోంది? కల్తీ మద్యంతో వ్యసనపరుల్లో 25 శాతం మంది చనిపోతున్నారు. అయినా జగన్‌ ప్రభుత్వం విక్రయాలను మానడం లేదు..’ అని పేర్కొన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ ర్యాలీలో, తర్వాత బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలో సభ, పొద్దుపోయాక తెనాలిలో సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘భూదోపిడీకి పాల్పడ్డ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. దాన్ని బట్టి జగన్‌ పాలనలో దొంగలకే లైసెన్సు ఇచ్చారని స్పష్టమవుతోంది..’ అని ఆమె పేర్కొన్నారు. తెదేపా, జనసేన భాజపా బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే.. వైకాపా అక్రమ పొత్తు పెట్టుకుని భాజపాతో ప్రేమాయణం సాగిస్తోందని విమర్శించారు. ‘బాపట్ల జిల్లాలో ఏటా నల్లమడ వాగు పొంగి లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. ఆధునికీకరణకు వైఎస్సార్‌ తలపోశారు. ఆయన వారసుడిగా జగన్‌ ఈ కాలువను పట్టించుకోలేదు..’ అని ధ్వజమెత్తారు. ‘కుంభకర్ణుడైనా ఆరు నెలలు పనిచేస్తాడు. ఈ ముఖ్యమంత్రి జగన్‌ ఈ అయిదేళ్లు ఏం చేసినట్లు?’ అని ప్రశ్నించారు. ‘ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా వర్తింపజేసేలా చేస్తా. అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయి. మనకేం ఉంది? చిప్ప, గుండు సున్నా తప్ప’ అని తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. అమరావతిని సింగపూర్‌ చేస్తానని చంద్రబాబు త్రీడీ సినిమా చూపిస్తే జగన్‌ మూడు రాజధానులు కడతానని ఒక్క చోటయినా తట్టెడు మట్టి వేశారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశంలో ఎలాంటి అభివృద్ధి చేయనందునే బహిరంగ సభల్లో ప్రస్తావించడం లేదని షర్మిల విమర్శించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img