icon icon icon
icon icon icon

మే నెల పింఛన్లు ఇళ్ల వద్దే ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే సామాజిక పింఛన్లను మే నెలలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Published : 25 Apr 2024 06:34 IST

ఆ మేరకు చర్యలు తీసుకోవాలి
పంపిణీని ఎన్నికల సంఘం పర్యవేక్షించాలి
సీఈసీ రాజీవ్‌కుమార్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే సామాజిక పింఛన్లను మే నెలలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం వారితో కుమ్మక్కైన కొందరు అధికారులు ఏప్రిల్‌ నెల పింఛన్ల పంపిణీలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని, ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు 16 పేజీల లేఖ రాశారు. ‘లబ్ధిదారులకు ప్రభుత్వపరమైన ప్రయోజనాలను అందించేటప్పుడు వాలంటీర్లను దూరం పెట్టి, సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 30న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పంపిణీ చేయడమే మంచిదని, అది సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు చెప్పారు. అందుకోసం గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితోపాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేసి, మిగతావారికి సచివాలయాల వద్ద అందించాలని ఉత్తర్వులిచ్చింది. అందరికీ ఇళ్ల వద్దే అందించాలన్న నా విజ్ఞప్తిని సీఎస్‌, అధికారులు పెడచెవిన పెట్టారు. ఏప్రిల్‌ నెల పింఛన్ల పంపిణీకి అవసరమైన డబ్బును ఏప్రిల్‌ 3న విడుదల చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఆ మూడు రోజులూ మండుటెండల్లో సచివాలయాల చుట్టూ తిప్పారు. ఈ ప్రక్రియలో 33 మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయి. దీన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత మీడియా సంస్థలు, వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల సంఘం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలే కారణమని విషప్రచారం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, వారితో చేతులు కలిపిన అధికారులు మే నెల పింఛన్ల పంపిణీలోనూ ఇదే తరహా కుట్రకు తెరతీసేందుకు అవకాశాలున్నాయి. ఎండలు భరించలేని స్థాయికి చేరినందున లబ్ధిదారులను సచివాలయాలకు రప్పించి గంటల తరబడి ఎండల్లో నిలబెడితే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గ్రామస్థాయిలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున రెండు రోజుల్లో అందరికీ ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వొచ్చు. మే 1న పింఛన్లను లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దే ఇస్తామని ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. పింఛన్ల పంపిణీని పర్యవేక్షించి పేదల ప్రాణాలను కాపాడాలి’ అని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు.

రాజీనామా చేసిన వాలంటీర్లన ఏజెంట్లుగా అనుమతించొద్దు: కనకమేడల  

రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా అనుమతించవద్దని తెదేపా మాజీ ఎంపీ, ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘ఎన్నికల్లో నిష్పాక్షికతను, పారదర్శకతను కాపాడటానికి ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు పంపిణీ చేసినవారు ఓటింగ్‌కు వచ్చే పేదలను అధికార పార్టీకి అనుకూలంగా ఓటేయమని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల రాజీనామా చేసిన, ఉద్యోగాల నుంచి తొలగించిన వాలంటీర్లు ఎవర్నీ పోలింగ్‌ ఏజెంట్లుగా కానీ, కౌంటింగ్‌ ఏజెంట్లుగా కానీ అనుమతించకుండా రిటర్నింగ్‌ అధికారులకు తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలి’ అని లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img