icon icon icon
icon icon icon

ఎన్నికలయ్యేలోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టేసుకోండి

ఎన్నికల వేళ ఓట్లను అక్రమంగా పొందడానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్త ఎత్తు వేశారు.

Published : 05 May 2024 06:41 IST

వైకాపా ఎంపీటీసీ, వార్డు సభ్యులకు ఓ ప్రజాప్రతినిధి అయాచిత వరం
వారి పరిధిలోని ఓట్లకు గాలం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ ఓట్లను అక్రమంగా పొందడానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్త ఎత్తు వేశారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంతమంది ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులకు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టేసుకోండని ఆయన చెప్పారు. తద్వారా ఆ సభ్యులు తమ పరిధిలోని ఓటర్లను ఏదో రకంగా ప్రభావితం చేసి వైకాపాకు ఓటు వేయిస్తారనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక కొత్తకోడూరు కాలనీలోని ఏటి పోరంబోకు కింద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇప్పటికే వైకాపాకు చెందిన 15 మంది వార్డు సభ్యులు, 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఆక్రమించేశారు. ఎన్నికలయ్యేలోపు ఇళ్లు కట్టేసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి చెప్పడంతో ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు నిర్మాణాలనూ మొదలు పెట్టారు. ఇవి అక్రమ కట్టడాలని తెలిసినా పంచాయతీ అధికారులు కుళాయి కనెక్షన్లు, విద్యుత్తు కనెక్షన్లకు ఎన్‌వోసీలు జారీ చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు కడుతున్న ఓ వార్డు సభ్యుడిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా పట్టాలు తహసీల్దారు కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని.. ఎన్నికలు ముగియగానే వాటిని తమకు ఇస్తారని చెప్పారు. ఈ లోపు ఇల్లు కట్టేసుకోమని తమ నాయకుడు చెప్పారంటూ వెల్లడించారు. ఈ విషయమై తహసీల్దారు శివరాముడును వివరణ కోరగా.. కొత్తకోడూరులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తన దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img