icon icon icon
icon icon icon

అలా ఫిర్యాదు... ఇలా ఆదేశాలు

సీఎం జగన్‌ మొదలుకుని కింది స్థాయి వైకాపా నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అసత్య ఆరోపణలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటంపై ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ).. ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తోంది.

Published : 05 May 2024 06:41 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తెదేపా దుష్ప్రచారం చేస్తోందంటూ వైకాపా ఫిర్యాదు
చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆఘమేఘాలపై సీఐడీకి ఈసీ ఆదేశం

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ మొదలుకుని కింది స్థాయి వైకాపా నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అసత్య ఆరోపణలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటంపై ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ).. ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తోంది. దుష్ప్రచారం ఎవరు చేసినా తప్పే..  కానీ ఎన్నికల సంఘం పక్షపాతంతో ఒకవైపే మొగ్గు చూపిస్తుండటంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజల ఆస్తులపై వారికున్న హక్కుల్ని హరించేసేలా ఉన్న అత్యంత ప్రమాదకర, వివాదాస్పద ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం గురించి వాస్తవాలను విపక్షాలు వివరిస్తుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సీఐడీ విభాగాధిపతిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ చర్యల వివరాల నివేదికను వెంటనే పంపించాలని కూడా నిర్దేశించింది. ‘‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై తెదేపా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోంది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ఈ చట్టంపై అసత్య, తప్పుడు, నిర్ధారణ కాని ఆరోపణలను ప్రచారంలో పెడుతోంది.’’ అంటూ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీకి ఆదేశాలిస్తూ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

పింఛన్లపై దుష్ప్రచారం ఈసీకి కనిపించట్లేదా?

ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేపట్టకుండా లబ్ధిదారులను నరకయాతనకు గురిచేస్తూ... ఆ బురదను విపక్షాలపై చల్లే కుట్రను సీఎస్‌ జవహర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. పింఛన్లు ఇంటి వద్దకు పంపిణీ కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, విపక్షాలేనంటూ జగన్‌ మొదలుకుని క్షేత్రస్థాయిలో వైకాపా నాయకుల వరకూ తప్పుడు, అసత్య, నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ మార్ఫింగ్‌ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిపై తెదేపా పలు మార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ ఒక వైపే చూడటమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img