icon icon icon
icon icon icon

జగనన్న బ్రాండ్లు వద్దే వద్దు...‘గోవా’ నకిలీ మద్యం అంటగట్టొద్దు

‘జగనన్న బ్రాండ్ల మద్యం వద్దే వద్దు..గోవా బ్రాండ్ల పేరిట అంటగడుతున్న నకిలీ మద్యం అసలే వద్దు. ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా?

Updated : 05 May 2024 06:42 IST

ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా?
వైకాపా అభ్యర్థులను నిలదీస్తున్న కార్యకర్తలు, అద్దె కూలీలు
ప్రాచుర్యం పొందిన బ్రాండ్ల  మద్యం కావాలంటూ పట్టు
తలలు పట్టుకుంటున్న వైకాపా అభ్యర్థులు

ఈనాడు-అమరావతి: ‘జగనన్న బ్రాండ్ల మద్యం వద్దే వద్దు..గోవా బ్రాండ్ల పేరిట అంటగడుతున్న నకిలీ మద్యం అసలే వద్దు. ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా? మండుటెండల్లో రోజంతా వెంట తిప్పుకుంటూ కనీసం నాణ్యమైన మద్యమైనా ఇవ్వలేరా’ అంటూ వైకాపా ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లో పాల్గొంటున్న కార్యకర్తలు, అద్దెకూలీలు అభ్యర్థులను ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. 2019 కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో లభించిన, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో దొరుకుతున్న ప్రాచుర్యం పొందిన బ్రాండ్ల మద్యం కావాలంటూ పట్టుబడుతున్నారు. ఆ మద్యం ఇవ్వకపోతే ప్రచారానికి వచ్చేది లేదంటూ గట్టిగా చెప్పేస్తున్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి తరఫున మద్యం పంపిణీ చేస్తున్న వారికి ఇదే అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లాలోని ఓ నియోజకవర్గంలోనూ కొంతమంది ఇలాగే పట్టుబట్టారు. ‘గత అయిదేళ్లుగా జగనన్న బ్రాండ్లు తాగే మా ఆరోగ్యం గుల్లైపోయింది. ఎన్నికల వేళ కూడా మళ్లీ అదే మందా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో అభ్యర్థులు మున్ముందు మంచి బ్రాండ్లే ఇస్తామంటూ వారికి సర్ది చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రచారానికి వస్తున్న వారు ‘‘జగనన్న బ్రాండ్లు’’ వద్దంటూ తిరస్కరిస్తుండటంతో.. కొందరు వైకాపా నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ‘‘గోవా మద్యం’’ పేరిట అనేక నియోజకవర్గాల్లో నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ ప్యాకింగ్‌, ఆ సీసాలపై అతికించిన స్టిక్కర్లలో తేడాలు ఉండటం, ఆ మద్యం పెద్దగా బాగోలేకపోవటంతో వాటిని కూడా తీసుకోవటానికి ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు, అద్దెకూలీలు నిరాకరిస్తున్నారు. అవీ అసలైన బ్రాండ్లు కావని, తాగితే జగనన్న బ్రాండ్ల 3మాదిరిగానే తమ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని గుర్తించి వద్దే వద్దంటున్నారు. దీంతో వైకాపా నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

జగనన్న మద్యం కోసమైతే వెళ్లాల్సిన అవసరమే లేదు..

వైకాపా నాయకులు ఎన్నికల వేళైనా నాణ్యమైన మద్యం పంపిణీ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది వారి ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే వారికి అక్కడ కూడా జే బ్రాండ్లు లేదా గోవా బ్రాండ్ల పేరిట నకిలీ మద్యాన్నే ఇస్తుండటంతో ఒకటి, రెండు రోజులు ప్రచారానికి వచ్చి ఆగిపోతున్నారు. మరికొందరైతే ఆ మద్యం తమకువద్దని..వాటికి బదులుగా డబ్బు ఇస్తే బార్లకు వెళ్లి అక్కడ లభించే ప్రీమియం బ్రాండ్లు కొనుక్కుంటామని చెబుతున్నారు. ‘వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే నాకు మంచి బ్రాండ్ల మద్యం ఇస్తారనే ఉద్దేశంతో నాలుగైదు రోజుల పాటు వారి ర్యాలీలకు వెళ్లా. కానీ వారు కూడా జగనన్న బ్రాండ్లే పంపిణీ చేశారు. అది వద్దంటే మరుసటి రోజు నుంచి గోవా బ్రాండ్ల పేరుతో ఉన్న మద్యమిచ్చారు. అది అసలు బాగోలేదు. వాటి కోసమైతే ఈ ఎండలో పడి రోజంతా తిరగాల్సిన అవసరం లేదు. అందుకే వారు రమ్మని పిలుస్తున్నా వెళ్లట్లేదు’ అని విశాఖపట్నానికి చెందిన ఓ నడివయస్కుడు వివరించారు. ‘కూలీ కింద రోజుకు రూ. 300తో పాటు మంచి బ్రాండ్ల మద్యం ఇస్తామని చెబితే వైకాపా ప్రచారానికి నాలుగైదు రోజుల పాటు వెళ్లాను. కానీ వారు జగనన్న బ్రాండ్లే ఇచ్చారు. దీంతో వాటికి బదులు డబ్బులిస్తే నాకు నచ్చిన మద్యం కొనుక్కొని తాగుతానని అడిగా. అలా ఇచ్చేందుకు అంగీకరించలేదు. అందుకే వెళ్లడం మానేశా’ అని విజయవాడ నగరానికి చెందిన ఓ అడ్డా కూలీ చెప్పారు.


ఆ రెండింటినీ తిరస్కరిస్తుండటంతో..

వైకాపా అభ్యర్థులు ఎన్నికల కోసం కొని నెలల కిందటే పెద్ద ఎత్తున మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ సరకు మాత్రమే సరిపోదని, వేల మందికి రోజుల తరబడి పంపిణీ చేయాలంటే మరింత సరుకు కావాలని భావించి.. క్వార్టర్‌కు రూ. 20- రూ. 30 వెచ్చించి గోవాలో నకిలీ మద్యం తయారు చేయిస్తున్నారు. దాన్నే సీసాల్లో నింపి అచ్చం అసలైనదేనని నమ్మించేలా నకిలీ లేబుళ్లు, హాలోగ్రామ్‌లు అతికించి, సీళ్లు వేయిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తున్నారు. అయితే అటు జగనన్న బ్రాండ్ల మద్యం, ఇటు గోవా బ్రాండ్‌ పేరుతో తయారు చేసిన నకిలీ మద్యం రెండింటినీ కార్యకర్తలు, ప్రచారంలో పాల్గొంటున్న అద్దె కూలీలు తిరస్కరిస్తుండటంతో వైకాపా అభ్యర్థులకు కొత్త చిక్కొచ్చి పడింది. ఇది ఎక్కడ తమ ఓట్లపై ప్రభావం చూపిస్తోందోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో కొంతమందికైనా సరే ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు పంపిణీ చేసేందుకు వీలుగా.. తాజాగా తెలంగాణ, హరియాణా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తెప్పించుకుంటున్నారు. గోవా నుంచి కూడా ఒరిజినల్‌ బ్రాండ్ల మద్యం తెప్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img