icon icon icon
icon icon icon

జగన్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు.. పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.

Published : 25 Apr 2024 06:50 IST

వైకాపాను భూస్థాపితం చేయడానికే మా శపథం
సింగవరం సభలో తెదేపా అధినేత చంద్రబాబు
మే 13న ఫ్యాన్‌ స్విచ్ఛాఫ్‌ చేయండి
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పిలుపు

ఈనాడు, విజయనగరం: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు.. పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, వైకాపాను భూస్థాపితం చేస్తానని ప్రతినబూనారు. జనం కూడా జగన్‌ను ఓడించి, ఎన్డీయే కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విజయనగరం, సింగవరంలలో బుధవారం జరిగిన బహిరంగ సభల్లో వారాహి వాహనం పైనుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం శిరస్సు తొలగించిన ముష్కరులను పట్టుకోలేని ఈ జగన్‌ను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘101 దేవాలయాలకు ధర్మకర్త అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుపై కూడా కేసులు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపైనే కేసులు పెడతారు. అధికారం కోసం 2019లో బాబాయ్‌ హత్య డ్రామాతో వచ్చారు. ఈసారి గులకరాయి నాటకమాడుతున్నారు. కానీ ప్రజలు ఆయన్ను నమ్మరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ ద్వారా కానిస్టేబుల్‌, గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటా. ఉద్యోగాలొచ్చే వరకు నిరుద్యోగభృతి అమలు చేస్తా. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తా’ అని పేర్కొన్నారు.

జగన్‌కు బాబు సవాల్‌

‘జగన్‌ ఉత్తరాంధ్రకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా తెచ్చారా? ఒక్కటైనా పూర్తి చేశారా? మా హయాంలో ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చా. ఆనాడే భూసేకరణ జరిపి, శంకుస్థాపన కూడా చేశాం. జగన్‌ వచ్చి దానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. కూటమి అధికారంలోకి వస్తే 2025 నాటికే ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేయిస్తా. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి. ఈ ప్రాంతం సస్యశ్యామలమవ్వాలన్నదే నా కల. దుర్మార్గుడైన జగన్‌ వచ్చి అవన్నీ నాశనం చేశారు. పైగా ఈ ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ 25కి 25 ఎంపీ సీట్లొస్తాయని చెప్పుకొంటున్నారు’ అని పేర్కొన్నారు. ‘వై నాట్‌ పులివెందుల’ అని జగన్‌కు సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మేలు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టిన నేత మన పవన్‌ కల్యాణ్‌ అని చంద్రబాబు అన్నారు. జగన్‌కు, పవన్‌కు పోలికే లేదన్నారు. వైకాపాను చిత్తు చేసే వరకు తామిద్దరం నిద్రపోమన్నారు. జగన్‌ సింగిల్‌గా వస్తున్నా అంటున్నారు.. కానీ అవినీతి డబ్బుతో, బందిపోట్ల అండతో వస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌ యూనివర్సిటీ నుంచి రూ.450 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్‌ నుంచి రూ.800 కోట్లు, పంచాయతీల నుంచి రూ.8 వేల కోట్లు, భవన నిర్మాణ కార్మికుల నుంచి రూ.450 కోట్లు దోచేశార[ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, డ్రగ్స్‌ కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అన్నింట్లోనూ వెనుకబడి ఉన్నా.. గంజాయిలో మాత్రం అగ్రస్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెరిగాయన్నారు. కరెంటు బిల్లు తగ్గాలంటే వాడకం తగ్గించడం కాదని.. మే 13న ‘ఫ్యాన్‌’ స్విచ్‌ ఆపేయండని జనసేనాని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఏపీలో ఎన్నో వనరులను పెట్టుకుని ప్రజలు ఇతర రాష్ట్ర్రాలకు, విదేశాలకు ఎందుకు వలస వెళ్లాలి? ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలి. కూటమిని గెలిపిస్తే ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. రాష్ట్ర ప్రగతికి సేవకుడిలా, ప్రజల భవితకు కూలీలా పనిచేస్తా. విజయనగరం ఎప్పుడు వచ్చినా.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు ద్వారా తెలుస్తోంది. మేం వచ్చాక అన్నిరకాలుగా ఆదుకుంటాం’ అని చెప్పారు.

మీ భవిష్యత్తు కోసమే పోరాడుతున్నాం

‘70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఆయనకు రాజకీయ పోరాటం మాత్రమే తెలుసు. నాకు డబ్బులు అవసరం లేదు. రూ.కోట్లలో ఆదాయపన్ను కట్టాను. నా అఫిడవిట్‌ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరినీ మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మాకేమీ కాదు. కానీ రాష్ట్రంలో యువత, రైతులు అన్ని వర్గాలవారు నష్టపోతారు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే మేం కలిసి పోరాడుతున్నాం. పొత్తు కోసం జనసేన నాయకులు ఎలా తగ్గారో తెదేపా, భాజపా నాయకులు కూడా అలాగే తగ్గారు’ అని పవన్‌ పేర్కొన్నారు.

మాట మార్చిన జగన్‌

‘విశాఖ విమానాశ్రయంలో ఈగలను తోలుకుంటుంటే.. భోగాపురం విమానాశ్రయం అవసరమా అని ప్రతిపక్ష నేతగా జగన్‌ ఎద్దేవా చేశారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ అధికారంలోకి వచ్చాక విమానాశ్రయ భూముల్ని లాక్కున్నారు. నాడు జీఎంఆర్‌కు వద్దని.. ఇప్పుడు మళ్లీ అదే సంస్థకు నిర్మాణ పని అప్పగించారు’ అని పవన్‌ ధ్వజమెత్తారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థులు లోకం మాధవి, అదితి గజపతిరాజులను గెలిపించాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కోరారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img