icon icon icon
icon icon icon

కొడాలి నాని నామినేషన్‌ పత్రాల్లో లోపాలు

గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్‌ పత్రాల్లో లోపాలున్నా.. కనీసం పరిశీలించకుండా, అభ్యంతరాలు వినేందుకు కూడా ఆసక్తి చూపించకుండా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో), ఆర్డీవో పద్మావతి ఏకపక్షంగా వ్యవహరించి సంతకం పెట్టేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

Published : 27 Apr 2024 05:43 IST

అభ్యంతరాలు వినకుండా  సంతకం పెట్టేసిన ఆర్వో
ఎమ్మెల్యేపై స్వామి భక్తి ప్రదర్శించిన అధికారిణి
నానిని అనర్హుడిగా ప్రకటించాలని తెదేపా నిరసన

ఈనాడు, అమరావతి: గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్‌ పత్రాల్లో లోపాలున్నా.. కనీసం పరిశీలించకుండా, అభ్యంతరాలు వినేందుకు కూడా ఆసక్తి చూపించకుండా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో), ఆర్డీవో పద్మావతి ఏకపక్షంగా వ్యవహరించి సంతకం పెట్టేయడం తీవ్ర వివాదాస్పదమైంది. కొడాలి నాని నామినేషన్‌ పత్రాల్లో తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయని తెలిపేందుకు తెదేపా నేతలు రావి వెంకటేశ్వరరావు, తులసి తదితరులు శుక్రవారం ఉదయమే ఆర్వో కార్యాలయానికి వచ్చారు. నామినేషన్‌ పత్రాలు పరిశీలించేటప్పుడు.. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగి, ఏమీ లేవంటేనే ఆర్వో సంతకం పెట్టాలి. కొడాలి నాని నామినేషన్‌ పత్రాలను ఆర్వో చేతుల్లోకి తీసుకోగానే తెదేపా నాయకులు అభ్యంతరాలు చెప్పేందుకు నిలబడ్డారు. కానీ ఆర్వో పద్మావతి కనీసం తల కూడా ఎత్తకుండా సంతకం పెట్టేశారు. అఫిడవిట్‌లో అభ్యంతరాలున్నాయని రావి వెంకటేశ్వరరావు, తులసి చెబుతున్నా ఆమె పట్టించుకోలేదు. పైగా ప్రశ్నిస్తే బయటకు పంపేస్తా.. మీపై చర్యలు తీసుకుంటానని పెద్దగా అరుస్తూ బెదిరించారు.

అభ్యంతరాలివీ..

ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు పాత మున్సిపల్‌ కార్యాలయంలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి పదవి పోయినా దానిని అలాగే కొనసాగిస్తూ వైకాపా కార్యాలయంగా మార్చేసి వాడుకుంటున్నారు. ఐదేళ్లు ప్రభుత్వ భవనాన్ని నాని వాడుకున్నారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ధ్రువీకరించారు. అయితే నాని తన నామినేషన్‌ అఫిడవిట్‌లోని 17వ పేజీలో ప్రభుత్వానికి సంబంధించిన అకామిడేషన్‌ వాడుకున్నారా అన్న దగ్గర ‘ఎస్‌’ అని పెట్టకుండా ‘నో (లేదు)’ అని పెట్టారు. కార్యాలయం వినియోగించుకున్నందుకు సంబంధిత బిల్లులు, బకాయిలుంటే అవీ చూపించాలి. అవేవీ చూపించలేదు. నాని నామినేషన్‌ను తిరస్కరించడానికి ఇదొక్కటి చాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కొడాలి నానిపై అయిదు కేసులున్నాయని అఫిడవిట్‌లో ధ్రువీకరించారు. కానీ 4, 5 సీరియల్‌ నంబర్లలో ఉన్న కేసుల వివరాలు సరిగా చూపించలేదు. ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈసీకి ఫిర్యాదు, కోర్టులో రిట్‌ పిటిషన్‌

ఆర్వో వ్యవహరించిన తీరుపై వీడియో, ఆడియోలు ఉన్నాయని రావి వెంకటేశ్వరరావు, తులసి తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులోనూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని చెప్పారు. కొడాలి నానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదన్నారు. గుడివాడలో ఓడిపోతున్నానని తెలిసే.. నాని ఇలా అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


ఆర్వో తీరు అత్యంత దుర్మార్గం
- రావి వెంకటేశ్వరరావు, తెదేపా మాజీ ఎమ్మెల్యే

మా అభ్యంతరాలను ఆర్వో అసలు వినలేదు. పైగా మమ్మల్నే బయటకు పొమ్మని పెద్దగా అరుస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కనీసం తల ఎత్తకుండా సంతకం పెట్టేసిన ఆర్వో అభ్యంతరాలుంటే ముందే చెప్పాలని అడ్డగోలుగా వాదిస్తున్నారు. అధికారులు ఇలా వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించడం విచారకరం. ఒక ఆర్వో ఇంత దారుణంగా ఉండటం చూస్తే.. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img