icon icon icon
icon icon icon

పిఠాపురంలో పట్టుబడిన వైకాపా మద్యం డంపు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా భారీ స్థాయిలో మద్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తోంది.

Published : 27 Apr 2024 05:47 IST

నాలుగు ప్రాంతాల్లో అక్రమ నిల్వలు
విలువ రూ.80 లక్షల పైమాటే..
వైకాపా పట్టణ అధ్యక్షుడి సోదరుడి ఇంట భారీగా సరకు..

పిఠాపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా భారీ స్థాయిలో మద్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తోంది. ఇందుకు తమ పార్టీకే చెందిన నాయకులు, కార్యకర్తల నివాసాలను ఎంచుకుంటోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం సుమారు రూ.80 లక్షల విలువైన మద్యాన్ని సెబ్‌, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. కళ్లు బైర్లు కమ్మే రీతిలో నిల్వ ఉన్న మద్యం బాక్సులను చూసి అధికారులూ నివ్వెరబోయారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తుండటంతో ఇప్పటికే అందరి దృష్టినీ ఈ ప్రాంతం ఆకర్షించింది. ఆయనను ఎలాగైనా ఓడించేందుకు మద్యాన్ని వైకాపా ఏ స్థాయిలో  ఇక్కడికి దింపుతోందో చెప్పేందుకు తాజా ఉదంతమే నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పిఠాపురం పట్టణం, మండలంలో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లు శుక్రవారం సాయంత్రం స్టేట్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులకు సమాచారం అందింది. దీంతో సెబ్‌, పిఠాపురం పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జగ్గయ్య చెరువుకు చెందిన వట్టూరి సతీష్‌ కుమార్‌ ఇంట్లో 250 బాక్సులు, సాలిపేటలోని అంబటి వీర వెంకట సత్యనారాయణ మూర్తి వద్ద 260, వైఎస్సార్‌ గార్డెన్స్‌ కాలనీలోని ఓ ఇంట్లో 290 బాక్సులు, కుమారపురంలోని వేమగిరి సువార్తమ్మ నివాసంలో 215 బాక్సులు(మొత్తం 1015 బాక్సులు) గుర్తించారు. ఒక్కో బాక్సులో 48 చొప్పున మొత్తంగా 48,720 మద్యం సీసాలు(ఒక్కొక్కటి 250 ఎం.ఎల్‌) ఉన్నట్లు గుర్తించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఈ మద్యాన్ని ప్రత్యేక వాహనాల్లో తొలుత పిఠాపురం గ్రామీణ పోలీసు స్టేషన్‌కు, అక్కడి నుంచి కాకినాడకు తరలించారు. ఈ విషయం సీఐ జి.శ్రీనివాస్‌, సెబ్‌ అధికారి మహమ్మద్‌ అలీ తదితరులు డీఎస్పీ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాలు తనిఖీ చేశాయన్నారు.. సతీష్‌కుమార్‌, సత్యనారాయణరెడ్డి, సువార్తమ్మ ఇళ్లలో గోవాకు చెందిన రెండు కంపెనీల మద్యం గుర్తించామన్నారు. మరో ఇంటికి తాళాలు వేసి ఉన్నాయని, ఆ యజమాని ఎవరనేది గుర్తిస్తున్నామన్నారు. ఈ మద్యం సీజ్‌ చేశామని.. వారికి ఏ విధంగా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం ఇళ్లలో ఇది ఉండకూడదని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున పూర్తిస్థాయిలో విచారిస్తున్నామన్నారు. కాగా ఇక్కడ రాయల్‌ బ్లూ, గోవా కిక్‌ అనే బ్రాండ్‌లు కనిపిస్తున్నాయి.

ఈ మద్యం వైౖకాపా నేతలదే

పట్టుబడిన మద్యం పిఠాపురానికి చెందిన వైకాపా నేతల అనుచరుల ఇళ్లలోనే దొరికింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అందజేసేందుకు వారు నిల్వచేశారు.. వైఎస్సార్‌ గార్డెన్స్‌లో మద్యం నిల్వ చేసిన ఇల్లు పట్టణ వైకాపా అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు వీరబాబుది అని స్థానికులు తెలిపారు. అధికారులు మాత్రం ఆ ఇల్లు ఎవరిదనేది ఇంకా గుర్తిస్తున్నామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పిఠాపురంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఓడించేందుకు..ఇక్కడి వైకాపా నాయకులకు స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎన్నికల ఖర్చు కింద ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో రూ.4 కోట్ల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన మద్యం వైకాపాకు చెందిన ఓ అగ్రనేత కంపెనీల్లో తయారైనట్లు తెలుస్తోంది. పంపిణీ చేసేందుకు తెచ్చిన ఈ మద్యం నాసిరకానికి చెందినదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img