icon icon icon
icon icon icon

వివేకా హత్య కేసులో జగన్‌ పాత్రను ఆయన ప్రవర్తనే ధ్రువీకరిస్తోంది

వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులను వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అందులో ఆయన పాత్ర ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

Published : 27 Apr 2024 05:48 IST

తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు, దిల్లీ: వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులను వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అందులో ఆయన పాత్ర ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. ఆయన పాత్ర గురించి చెప్పడానికి ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలకు మించి ఎలాంటి ఆధారాలూ అవసరంలేదన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ‘వివేకానందరెడ్డి హత్యకు పాల్పడిన కుట్రదారుల పేర్లను బయటకి రానివ్వకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ కేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డిలు నిందితులని సీబీఐ గూగుల్‌ టేకవుట్‌ ఆధారాలతో చాలా స్పష్టంగా చెప్పింది. అలాంటి వారిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుపడ్డారు. దీన్ని బట్టి ఎవరి పాత్రను కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి ఈ నిందితులను కాపాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ హత్యలో ముఖ్యమంత్రి, ఆయన భార్య పాత్ర ఉన్నట్లు అప్రూవర్‌ దస్తగిరి చెప్పారు. అంతకుముందు ఈ కేసులో ముఖ్యమంత్రి పాత్రను విచారించాల్సి ఉందని సీబీఐ కూడా చెప్పింది. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ హత్యకేసులో ముఖ్యమంత్రి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. కుట్రదారులను వెలికితీయాలని ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిలు గతంలో డిమాండ్‌ చేశారు. సీబీఐ లోతుగా దర్యాప్తు జరిపి అందులో నిజమైన నిందితుడు అవినాష్‌రెడ్డేనని తేల్చింది. ఈ కుట్రలో తన ప్రమేయం లేకపోతే తప్ప అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఎందుకు రక్షిస్తున్నారు? ఒకవైపు హత్యచేసిన వారిని రక్షిస్తూ మరోవైపు ఆ నేరాన్ని వివేకా కూతురు సునీతపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన అక్రమాస్తులపై సీబీఐ నమోదుచేసిన కేసులో తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నిందితుడిగా చేర్పించిన ఘనత సీఎందేనని సొంత చెల్లి షర్మిల బహిరంగంగా ప్రకటించారు. కోర్టుకెళ్లి ఆ పనిచేయించిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చి రుణం తీర్చుకున్నట్లుకూడా ఆమె ప్రకటించారు. ఒకవైపు చిన్నాన్న హత్యకేసులోని అసలైన నిందితులను కాపాడుతూ, మరోవైపు అక్రమాస్తుల కేసు నుంచి తాను బయటపడటానికి తండ్రినే నిందితుడిగా చేర్పించిన ఘనత జగన్‌ సొంతం’ అని కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img