icon icon icon
icon icon icon

మద్యనిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతారు జగన్‌?

మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్న మీరు...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మ్యానిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు.

Updated : 28 Apr 2024 07:25 IST

85 శాతం హామీల్ని విస్మరించి.. ఇంకో మ్యానిఫెస్టోతో మోసం
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్న మీరు...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మ్యానిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. ‘‘మ్యానిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నారు. వాటిలో ఏ ఒక్కదాని మీదన్నా మీకు గౌరవం ఉంటే...2019 వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యనిషేధం చేసి ఉండేవారు’’ అని ఎక్స్‌ వేదికగా శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రేషన్‌ దుకాణాల ద్వారా వంద శాతం సన్నబియ్యం పంపిణీ, వారంలో సీపీఎస్‌ రద్దు, బడుగుబలహీన వర్గాలకు 45 ఏళ్లకే పింఛన్‌, ప్రత్యేక హోదా సాధన...మీరిచ్చిన 730 హామీల్లో కొన్ని. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా అమలుచేయలేదు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్‌ నెరవేర్చలేదు’’ అని చంద్రబాబు విమర్శించారు. మళ్లీ ఇంకోసారి మోసపోవడానికి మీరు సిద్ధమా అని జగన్‌ అడుగుతున్నారని..మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం అని గట్టిగా చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు.


వైకాపా మ్యానిఫెస్టో తేలిపోయింది

-తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత ఎన్నికల్లో 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేకహోదా సాధిస్తానని గొప్పలు చెప్పిన సీఎం జగన్‌.. నేడు వైకాపా మ్యానిఫెస్టోలో హోదా మాటే తీయలేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, అధికార ప్రతినిధి జీవీరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి.. ఈసారి వాటి ప్రస్తావనే విస్మరించారని మండిపడ్డారు. ఎన్డీయే ‘సూపర్‌సిక్స్‌’ పథకాల ముందు వైకాపా మ్యానిఫెస్టో తేలిపోయిందని ఎద్దేవా చేశారు.99 శాతం హామీల్ని అమలు చేశామంటూ జగన్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేశ్‌ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరో మాయాజాలం

-రఘురామకృష్ణరాజు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: జగన్‌ సినిమా కథలు చెప్పి మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మరని.. పాత సీసాలో పాత సారానే నింపి కొత్త మ్యానిఫెస్టో పేరిట మరో మాయాజాలానికి సిద్ధమయ్యారని నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు విమర్శించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘ఇంటింటికీ పింఛను పంపిణీ చేయనంటూ సీఎస్‌ అనడం హాస్యాస్పదంగా ఉంది. శవ రాజకీయాలను నమ్ముకున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారు. మే 1న ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.


జగన్‌ మ్యానిఫెస్టోను నమ్మరు

-పురందేశ్వరి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మరని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో వైకాపా విడుదల చేసిన మ్యానిపెస్టోను ఏ మేరకు అమలు చేశారనే దానిపై ముందు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘పేదలకు గృహాల నిర్మాణం, రైతు భరోసా విషయంలో మోసం చేశారు. రైతులకు కోల్డ్‌స్టోరేజీలు, ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై మాట తప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం నీరుగార్చారు. పోలవరం పరిస్థితి అందరికీ తెలిసిందే. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం మరిచిపోగలమా?’ అని ప్రశ్నించారు. కూటమి మ్యానిఫెస్టోపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే తెదేపా, జనసేన కలిసి సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రవేశపెట్టాయని, ఇక కేంద్రప్రభుత్వం అమలు చేసే పథకాలను జతచేసి ముందుకెళతామని తెలిపారు.


జగన్‌ నిస్సహాయతకు అద్దం

-నీలాయపాలెం

ఈనాడు, అమరావతి: రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా, ఆదాయాన్ని పెంచేలా, పరిశ్రమలు తెచ్చేలా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలేవీ లేని వైకాపా మ్యానిఫెస్టో చూస్తే.. జగన్‌ నిస్సహాయ స్థితిలోకి వెళ్లారని స్పష్టంగా తెలుస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు. ‘హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు మూడు రాజధానుల ఆలోచనను తప్పుపట్టినా, మూర్ఖత్వంతో జగన్‌ మళ్లీ అదే పాటపాడారు’ అని మండిపడ్డారు.


అంతా బూటకం

-లంకా దినకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గతంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చకపోగా మళ్లీ ఈ ఎన్నికల్లో పాత పాటే పాడుతున్నారని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. వైకాపా విడుదల చేసిన 2024 మ్యానిఫెస్టో అంతా బూటకమని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు.


పాత పథకాలే

-సాదినేని యామినీశర్మ

వైకాపా విడుదల చేసిన 2024 మ్యానిఫెస్టోని ప్రజలు నమ్మే స్థితిలో లేరని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ పేర్కొన్నారు. పాత పథకాలనే కొనసాగిస్తూ ప్రజలని మరోసారి మోసం చేయడానికి సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img