icon icon icon
icon icon icon

అబద్ధాలు చెప్పను.. మోసం చేయను

‘జగన్‌ అబద్ధాలు ఆడడు, చేయలేకపోతే చేయనని చెబుతాడు తప్ప మోసం చేయడు. అబద్ధపు హామీలతో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవే 2019 మ్యానిఫెస్టోలో చెప్పి.

Published : 28 Apr 2024 05:18 IST

2019 మ్యానిఫెస్టోలోని హామీలను  99 శాతం అమలు చేశాం
వచ్చే ఐదేళ్లలో పింఛన్‌ రెండు విడతల్లో రూ.500 పెంపు
2024 ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్‌
మూడు రాజధానులు ఉంటాయని  పునరుద్ఘాటన

ఈనాడు, అమరావతి: ‘జగన్‌ అబద్ధాలు ఆడడు, చేయలేకపోతే చేయనని చెబుతాడు తప్ప మోసం చేయడు. అబద్ధపు హామీలతో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవే 2019 మ్యానిఫెస్టోలో చెప్పి.. వాటిలో 99 శాతం అమలు చేసి, ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాం’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ‘2019 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూ ఏటా ఏమేం అమలు చేశామనేదీ ప్రజల వద్దకు తీసుకువెళ్లాం. ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు’ అని పేర్కొన్నారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా పేదలను ప్రేమించడంలో, వారికి మంచి చేయడంలో జగన్‌ వేసినన్ని అడుగులు ఎవరూ వేయలేదు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిస్తే.. 2019 నుంచి ఇప్పటి వరకూ మేం 2.30 లక్షల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబుతో అబద్ధాల్లో పోటీపడలేను. ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంత చేయగలమో ఆ మేరకే చెబుతున్నా’ అంటూ శనివారం ఆయన వైకాపా మ్యానిఫెస్టోను ప్రకటించారు. కొత్త హామీలు, ఉన్న పథకాల్లోనూ పెద్దగా మార్పుచేర్పులేమీ లేకుండా సాదాసీదా మ్యానిఫెస్టో విడుదల చేశారు.

యువత-ఉపాధి

‘నైపుణ్యంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తాం. 26 జిల్లా కేంద్రాల్లోనూ ఒక్కోటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలు, తిరుపతిలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. వీటిలో శిక్షణ పొందేవారికి ఇంటర్న్‌షిప్‌ సమయంలో అబ్బాయిలకు రూ.2,500, అమ్మాయిలకు రూ.3 వేలు ఇస్తాం.

ప్రభుత్వ ఉద్యోగులకు..

జగనన్న విదేశీ విద్యకు ఎంపిక కాని ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు తీసుకున్న విద్యా రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని వారి కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్ఠంగా ఐదేళ్లపాటు చెల్లిస్తాం. రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్‌లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాలూ వర్తిస్తాయి.


వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తి చేస్తాం..

  • భోగాపురం విమానాశ్రయాన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేస్తాం.
  • ఐదేళ్లలో పోలవరం, 17 వైద్య కళాశాలలు, నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు, భూముల సర్వే, పేదలందరికీ ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం, ఆక్వా, ఉర్దూ, గిరిజన విశ్వవిద్యాలయాలు పూర్తి చేస్తాం.

విశాఖ నుంచి పాలన

వైకాపా తిరిగి అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన సాగుతుంది. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం.


చంద్రబాబు.. సంపద ఎక్కడ సృష్టించారు?

‘నేను సంపద సృష్టిస్తా, కాబట్టే పథకాలను ఇవ్వగలనని చంద్రబాబు సమర్థించుకుంటున్నారు. ఆధారాలతో చూపిస్తున్నా, ఆయన 14 సంవత్సరాల పాలనలో ఏ ఏడాదీ రెవెన్యూ మిగులు లేదు, రెవెన్యూ వ్యయంలోనే లోటు ఉంటే ఇక ఆయనెక్కడ సంపద సృష్టించారని అడుగుతున్నా. అదే చంద్రబాబుకు ముందు, తర్వాత ప్రభుత్వాల్లో రెవెన్యూ మిగులు ఉంది. ఆయనకు సమర్థమైన ఆర్థిక నియంత్రణ లేదు, సంపదను సృష్టించే శక్తీ లేదు. కానీ, జగన్‌ వద్ద అవినీతి, వివక్ష లేదు. కాబట్టే ఇన్ని పథకాలను చేయగలిగాడు’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.


సామాజిక న్యాయాన్ని చూపించాం

  • 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ.. మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం.
  • ప్రభుత్వ బడుల్లో పిల్లలకు ఆంగ్ల మాధ్యమ విద్య హక్కుగా అమల్లోకి తెచ్చాం. 2039లో పదో తరగతి పిల్లలు రాష్ట్ర బోర్డుతోపాటు ఐబీ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. విద్యలోనే కాదు వైద్య రంగంలో, మహిళా సాధికారతలో, సామాజిక న్యాయంలో కనీవినీ ఎరగని మార్పులు ఈ రోజు కనిపిస్తున్నాయి.
  • పింఛన్‌ రూ.3 వేలను రాబోయే ఐదేళ్లలో రెండు విడతలుగా మరో రూ.3,500కు పెంచుతాం. ఇందులో 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో మరో రూ.250 పెంచుతాం.
  • వైఎస్సార్‌ చేయూత రూ.75 వేలు ఉండేది. నాలుగు దఫాల్లో ఇచ్చాం. మరో నాలుగు దఫాల్లో ఇంకో రూ.75 వేలు ఇస్తాం.
  • రైతుభరోసా కింద గత ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.16 వేల చొప్పున రూ.80 వేలు అందజేస్తాం. పంట వేసే సమయంలో రూ.8 వేలు, కోత కోసేటప్పుడు రూ.4 వేలు, సంక్రాంతికి మరో రూ.4 వేలు ఇస్తాం. రైతులకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది.
  • ఆటో, ట్యాక్సీలతోపాటు సొంత టిప్పర్‌, లారీలు నడిపేవారికీ వాహనమిత్ర వర్తింపజేస్తాం. వీరికి రూ.10 లక్షల ప్రమాదబీమా కల్పిస్తాం.
  • వైఎస్సార్‌ కాపు నేస్తం గత ఐదేళ్లలో రూ.60 వేలు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో మరో రూ.60 వేలు ఇస్తాం.
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం గతంలో మూడు దఫాల్లో రూ.45 వేలు ఇచ్చాం. ఇప్పుడు నాలుగు దఫాల్లో మొత్తం రూ.60 వేలు ఇస్తాం.
  • జగనన్న అమ్మ ఒడి కింద గతంలో రూ.15 వేలు ఇచ్చేవాళ్లం. ఇందులో అమ్మలకు రూ.13 వేలు, పాఠశాల నిర్వహణకు రూ.2 వేలు కేటాయించేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తాన్ని అమ్మలకు రూ.15 వేలు పెంచి ఇస్తాం. పాఠశాలల నిర్వహణకు రూ.2 వేలు అదనంగా కేటాయిస్తాం.
  • వైఎస్సార్‌ ఆసరా కింద రూ.3 లక్షల వరకు రుణాలపై సున్నా వడ్డీ పథకాన్ని వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తాం.
  • వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా ఈ ఐదేళ్లు కూడా కొనసాగుతుంది.
  • పేదలందరికీ ఇళ్ల పట్టాలు. ఇప్పటికే 31 లక్షల పట్టాలు ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇందులో 9 లక్షలు పూర్తయ్యాయి. మిగిలినవి కట్టే కార్యక్రమం కొనసాగుతుంది.
  • పట్టణాల్లోని మధ్యతరగతి వారి కోసం ఎంఐజీ లేఅవుట్లను తీసుకువస్తాం. దీని కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తూ.. రూ.2 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌నూ పెడతాం.
  • మొత్తం జనాభాలో 50 శాతం దళితులు లేదా వారి జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img