icon icon icon
icon icon icon

సీఎం జగన్‌ కుట్రలో సీఎస్‌ భాగస్వామి

రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి కారణంగా ఏప్రిల్‌ నెలలో 33 మంది పింఛన్‌దార్లు మృతి చెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.

Published : 28 Apr 2024 06:05 IST

33 మంది పింఛన్‌దార్ల మరణాలు ప్రభుత్వ హత్యలే
వచ్చే నెలలో ఇళ్ల వద్దే పంపిణీ చేయాలి
గవర్నర్‌కు ఎన్డీయే నేతల వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి కారణంగా ఏప్రిల్‌ నెలలో 33 మంది పింఛన్‌దార్లు మృతి చెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. పింఛనర్లను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసి, ఆ బురదను ప్రతిపక్షాలపై చల్లి రాజకీయ లబ్ధి పొందాలనే సీఎం జగన్‌ కుట్రలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి భాగస్వామి అయ్యారని ఆరోపించారు. మే నెలలో అయినా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు వారి ఇళ్ల వద్దే పింఛన్లు అందజేయాలని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ను శనివారం కోరారు. తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు, ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైకాపాకు లబ్ధి చేకూర్చాలని యత్నిస్తున్న జవహర్‌రెడ్డి వైఖరిని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగుల్ని పింఛన్ల పంపిణీలో భాగస్వాముల్ని చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేతలు విలేకరులతో మాట్లాడారు.

ఇదంతా వైకాపా కుట్ర

‘మండుటెండలో పింఛన్ల కోసం వృద్ధుల్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు రప్పించాలి. వారిలో కొందరు చనిపోవాలి. వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచడం వల్లే ఇదంతా జరిగిందని విషప్రచారం చేయాలి. ఇదే వైకాపా వాళ్ల కుట్ర. అందులో సీఎస్‌ జవహర్‌రెడ్డి భాగస్వామి. తనను కలిసిన ఎన్డీయే నేతలతో ఆయన వ్యవహరించిన తీరు ఈ కుట్రను ధ్రువపరుస్తోంది. ఉపాధ్యాయుల్ని సారా దుకాణాల వద్ద కాపలా ఉంచిన ఈ ప్రభుత్వం.. పింఛన్ల పంపిణీకి వారినెందుకు ఉపయోగించుకోదు’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఓ వెన్నెముక లేని మనిషని మండిపడ్డారు. ఈ సారైనా పింఛన్లు ఇళ్ల వద్దే ఇస్తారా? అని సీఎస్‌ను రెండు మూడుసార్లు అడిగినా.. ఆయన నవ్వారే కానీ సమాధానం చెప్పలేదని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img