icon icon icon
icon icon icon

రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం అమ్మకాలు

‘మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్లు ఏకంగా కంటెయినర్లలో డ్రగ్స్‌ తెస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తు ఏమవ్వాలి.

Published : 28 Apr 2024 06:06 IST

ఇది చాలదన్నట్లు  కంటెయినర్లలో డ్రగ్స్‌ తెస్తున్నారు
మన బిడ్డల భవిష్యత్తు ఏమవ్వాలి?
అనకాపల్లి, అల్లూరి జిల్లా సభల్లో  వైఎస్‌ షర్మిల మండిపాటు

ఈనాడు, అనకాపల్లి: ‘మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్లు ఏకంగా కంటెయినర్లలో డ్రగ్స్‌ తెస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తు ఏమవ్వాలి. వీళ్లను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఈసారి ఓటు వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకులోయల్లో శనివారం నిర్వహించిన న్యాయయాత్ర సభల్లో ఆమె మాట్లాడారు. ‘గిరిజనుల సంక్షేమానికి, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు. ఆ రోజుల్లో బాక్సైట్‌ మైనింగ్‌కు డిమాండ్‌ ఏర్పడటంతో.. చెయ్యాలా? వద్దా అని ఓ కమిటీ వేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిసి మైనింగ్‌ వీల్లేదంటూ కొట్టిపడేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాక్సైట్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఎన్నో ఆరోపణలు వచ్చినా ఇంతవరకూ ఒక్క విచారణ కమిటీ వేయలేదు. ఏడు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు అదానీకి కట్టబెట్టేశారు. వాటి వల్ల వంద గ్రామాల ప్రజలు నష్టపోతున్నారని తెలిసినా పట్టించుకోలేదు. వీళ్లా రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెట్టేది?’ అని షర్మిల మండిపడ్డారు.

తండాలను పంచాయతీలుగా మార్చలేదు

‘ఎస్టీలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పలేదా? 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామన్నారు.. ఇచ్చారా? 500 జనాభా ఉండే తండాలను పంచాయతీలుగా మారుస్తామన్నారు.. మార్చారా? అరకులో పర్యాటక అభివృద్ధికి రూ.600 కోట్లు విడుదల చేస్తామన్నారు.. కనీసం కోటైనా ఇచ్చారా? ఐదేళ్లుగా చెప్పినవన్నీ చేయకపోగా.. ఇప్పుడు ఓట్ల కోసం సిద్ధం అంటూ పర్యటిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదికి రూ.లక్ష సాయం

‘భాజపాతో చంద్రబాబు పొత్తుపెట్టుకుంటే.. జగన్‌ మోదీ తొత్తుగా మారిపోయి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టుపెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తాం’ అని షర్మిల హామీ ఇచ్చారు. పాయకరావుపేట కాంగ్రెస్‌ అభ్యర్థి బోని తాతారావు, పాడేరు అభ్యర్థి సతకా బుల్లిబాబు, అరకులోయ అభ్యర్థి గంగాధరస్వామి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేశ్‌, అరకు ఎంపీ సీపీఎం అభ్యర్థి అప్పలనర్స పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img