icon icon icon
icon icon icon

జగన్‌ ముఖ్యమంత్రా? మద్యం వ్యాపారా?

కూటమి కలయిక తమ కోసం కాదని.. రాష్ట్రం, ప్రజల కోసమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. అన్ని వర్గాల సంక్షేమం కోరి ఈ నెల 30న పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

Updated : 28 Apr 2024 07:00 IST

మద్యం అమ్మకాలతో రూ.41 వేల కోట్లు సంపాదించారు
అంతులేని వైకాపా దోపిడీకి ఓటుతో సమాధానం చెప్పండి
అందరికీ ఆమోదయోగ్యంగా 30న కూటమి మ్యానిఫెస్టో
ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్‌ కల్యాణ్‌
ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం

16 మద్యం తయారీ కంపెనీలు జగన్‌ బినామీలవే..
‘జగన్‌, వైకాపా నాయకులు మాట్లాడితే.. పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నారు. అవినీతి చేయకపోతే ఎంత మిగులుతుందో మీకు చెప్తాను. 2019లో మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి.. ముఖ్యమంత్రిలా కాకుండా సారా వ్యాపారిలా మారి రూ.41 వేల కోట్లను జగన్‌ సంపాదించారు. ఉత్పత్తి అవుతున్న లిక్కర్‌లో 74 శాతం, 16 కంపెనీలు జగన్‌ బినామీలవే. ఆదాన్‌ డిస్టిలరీ, స్పై ఆగ్రో మిథున్‌రెడ్డి కంపెనీలు. వైకాపా నాయకులు రాష్ట్రంలో ఎవర్నీ బతకనివ్వరు. యువత బలంగా నిలబడి అలాంటి వారిని ఎదుర్కోకపోతే మీకే నష్టం.’

జనసేనాని పవన్‌ కల్యాణ్‌

కూటమి కలయిక తమ కోసం కాదని.. రాష్ట్రం, ప్రజల కోసమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. అన్ని వర్గాల సంక్షేమం కోరి ఈ నెల 30న పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటల్లో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. కుల గణాంకాలు, ప్రతిభ గణాంకాలు తీసుకుంటామని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ‘వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? మీకు వివరంగా చెప్పా. అరుపులతో లాభం లేదు, ఓట్లు వేయండి చాలు. వైకాపా రౌడీయిజానికి, దాష్టీకానికి భయపడితే ఎక్కడికని పారిపోతారు? మీ గుండెల్లో ధైర్యమనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు ఇచ్చినా వృథాయే’ అని అన్నారు. ‘ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడానికి డబ్బుల్లేవు. కానీ పీడీఎస్‌ బియ్యం స్కాంలో రూ.20 వేల కోట్లు దోచేశారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడానికి, వాటిని తీయడానికి రూ.2,300 కోట్లు ఖర్చు చేశారు. రేషన్‌ డెలివరీ వాహనాల స్కాం రూ.830 కోట్లు, చెత్త సేకరణ స్కాం రూ.1,500 కోట్లు. చిన్నపిల్లలు తినే చిక్కీల్లోనూ రూ.61 కోట్లు దోచేశారు. బైజూస్‌ ట్యాబ్‌ల పేరుతో రూ.212 కోట్లు మింగేశారు’ అని మండిపడ్డారు.

చిరంజీవి భిక్షతో ఎదిగారు..  ఆయన కోసం నిలబడలేరా?

జగన్‌ అహంకారంతో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌.. అందర్నీ పిలిచి అవమానించారని, వారు బతిమాలుతుంటే వీడియోలు తీసి, విడుదల చేశారని మండిపడ్డారు. ‘ఆయన అలా అవమానిస్తుంటే.. చిరంజీవి భిక్షతో ఎదిగిన మీరేం చేస్తున్నారు? ఆయన వెనుక నిలబడాలనే ఇంగితం లేదా? సిగ్గుందా?’ అని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబుపై  దుమ్మెత్తిపోశారు. ‘డొక్కు స్కూటర్‌లో తిరిగే కన్నబాబు నేడు రూ.వెయ్యి కోట్ల ఆస్తిపరుడయ్యారు. కాకినాడ గ్రామీణంలోని వాకలపూడిలో రూ.20 కోట్ల విలువైన 4.86 ఎకరాల లేఔట్‌లో 20 మంది స్థలాలు కొనుక్కుంటే కడప జిల్లా వైకాపా నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. కన్నబాబు అండతో చుట్టూ గోడ కట్టించేశారు. స్థలాలు కొన్న బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాకినాడ గ్రామీణంలో అనుమతి లేఔట్‌కు ఇన్ని లక్షలని రేటు కట్టి వసూలు చేస్తున్నారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక డాక్టర్‌ కిరణ్‌ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడితో అగ్రిమెంట్‌ చేయించుకుంటే ఆస్తి పత్రాలు, ఆస్తి తీసుకుని వేధించారు’ అని పవన్‌ ధ్వజమెత్తారు. ఇంతమందిని దోపిడీ చేసిన కన్నబాబు లాంటి వారిని వ్యక్తిని, మత్స్యకారులకు ద్రోహం చేసినవారిని గెలిపిస్తామా అని ప్రజల్ని ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక ద్వారంపూడి, కన్నబాబులతో నరకం స్పెల్లింగ్‌ రాయిస్తా. అందుకే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. వీళ్ల సంగతి తేల్చడానికే వచ్చా’ అని హెచ్చరించారు.  

వైకాపాకు ఎందుకు ఓటేయాలని అడగండి

‘వైకాపా నాయకులు వస్తే మీకు ఎందుకు ఓటేయాలని అడగండి. జగన్‌ బీసీ ఉప ప్రణాళిక నిధులు మళ్లించారు. 27 దళిత పథకాలు తీసేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వనన్నారు. ఈబీసీ రిజర్వేషన్‌ తీసేశారు. బీసీలు, ఎస్సీలకు, ఎస్టీలు, కాపులకు అన్యాయం చేశారు. కల్లుగీత కార్మికులపై అక్రమంగా 9 వేల కేసులు పెట్టారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చారు. మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి, రోడ్డు మీదకు లాగేస్తారు’ అని ధ్వజమెత్తారు.


భవిత కోసం కూటమి రావాలి

‘యువతకు ఉపాధి, భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాపు రిజర్వేషన్‌ ఉద్యమాన్ని లేవదీసి,  యువతను రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. తుని ఘటనలో ఎంతోమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు. జనసేన, తెదేపా ఆలోచనా విధానం ఒకటే. నదుల అనుసంధానం చేసి రైతులు కన్నీరు పెట్టకుండా చేయడమే లక్ష్యం. ఉద్యోగులకు సీపీఎస్‌పై ఒక పరిష్కారం కనుక్కుంటాం. ఏ పథకాన్నీ రద్దు చేయం. అదనంగా ఇస్తాం. ఐదేళ్లలో రూ.200 కోట్లు సంపాదించి, రూ.73 కోట్లు ట్యాక్స్‌ కట్టాను. చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ అంత పెద్ద నటుణ్ని కాకపోయినా నాదైన బలం నాకుంది. ఇంత సంపాదించినా ఈ నేల కోసం కష్టపడే బలమైన సమూహం నాకు కావాలి’ అని పవన్‌ అన్నారు. కూటమి కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, కాకినాడ గ్రామీణం అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పలను గెలిపించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img