icon icon icon
icon icon icon

పొన్నవోలును ఏఏజీగా నియమించడం.. ‘క్విడ్‌ ప్రో కో’ కాక మరేమిటి?

‘ఎవరైనా తన తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్పించిన వ్యక్తిని పిలిచి ఏఏజీ (అదనపు అడ్వొకేట్‌ జనరల్‌)గా నియమిస్తారా? నేనైతే అలా చేయను.

Published : 29 Apr 2024 03:48 IST

సీబీఐ ఛార్జిషీట్‌లో ఆయన చేతనే వైఎస్సార్‌ పేరు చేర్పించారు
అక్రమాస్తుల కేసులో జగన్‌ బయటపడాలనే ప్రయత్నంలో ఇదో భాగం
అందుకు ప్రతిఫలమే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏఏజీగా నియామకం
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజం

ఈనాడు డిజిటల్‌-విశాఖపట్నం, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, టెక్కలి: ‘ఎవరైనా తన తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్పించిన వ్యక్తిని పిలిచి ఏఏజీ (అదనపు అడ్వొకేట్‌ జనరల్‌)గా నియమిస్తారా? నేనైతే అలా చేయను. కానీ జగన్‌ చేశారు. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. ఆయన పేరు లేకపోతే దాని నుంచి బయటపడటం అసాధ్యమని జగన్‌ భావించారు. దీంతో వైఎస్సార్‌ పేరు చేర్చేలా సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పొన్నవోలుతో పిటిషన్లు వేయించారు. వైఎస్సార్‌ అంటే గౌరవం అని పొన్నవోలు చెప్పడం అబద్ధం. అభిమాన నాయకుడైతే ఛార్జిషీట్‌లో ఆయన పేరు చేర్చాలని కోర్టుల చుట్టూ తిరుగుతారా? జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. మీ మధ్య ఏం సంబంధం లేకపోతే ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు. ఇది క్విడ్‌ ప్రో కో కాకపోతే మరేమిటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని సీఐటీయూ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో జగనే పెట్టించారని గతంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షురాలైన నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు’ అని షర్మిల మండిపడ్డారు. ఛార్జిషీట్‌లో పేర్లు చేర్చడంలో ఎవరి ప్రమేయం ఉండదని సీబీఐ మాజీ జేడీ, జైభారత్‌ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సీబీఐ అధికారిగా చేసిన పనులకు, పార్టీ అధ్యక్షుడిగా చేసే వ్యాఖ్యలకు తేడా ఉంటుందని సమాధానమిచ్చారు.

వైకాపా మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేయండి

‘2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ పేర్కొన్న హామీలు నెరవేర్చనప్పుడు.. కొత్త మ్యానిఫెస్టోను ఎలా నమ్మాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు. మద్యపాన నిషేధం చేయలేదు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వైకాపా కార్యకర్తలకు వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి వాటినే ప్రభుత్వ ఉద్యోగాలుగా మభ్యపెట్టారు. మూడు రాజధానులని ఊదరగొట్టి ఒక్క నగరాన్ని కూడా నిర్మించలేదు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. అన్ని విషయాల్లో విఫలమైన మీకు మళ్లీ ఎందుకు ఓటెయ్యాలి. మీ మ్యానిఫెస్టోను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయండి’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంగా బాధ్యత లేదా?

‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలని చూస్తున్నారు. గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను జగన్‌ రూ.600 కోట్లకు అదానీకి అమ్మేశారు. గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లో ఉంటే స్టీల్‌ప్లాంట్‌కు మేలు జరిగేది. ఉక్కు పరిశ్రమకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఐరన్‌ఓర్‌ గనులను కేటాయించాలని వైఎస్సార్‌ ప్రయత్నించారు. అయిదేళ్లు సీఎంగా ఉన్న జగన్‌ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఇటీవల జగన్‌ను కలిస్తే.. స్టీల్‌ప్లాంట్‌ నష్టాల్లో ఉందా అని ప్రశ్నించిన ఆయన గురించి ఏం చెప్పాలి. పరిశ్రమలను కాపాడాల్సిన బాధ్యత సీఎంగా తనపై లేదా?’ అని ప్రశ్నించారు.

రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి..

‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసుడినని చెప్పుకొనే జగన్‌లో ఆయన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నిత్యం ప్రజల్ని కలిసి సమస్యలు పరిష్కరించిన వైఎస్‌ ఎక్కడ.. ఐదేళ్లపాటు ప్రజలకు కనిపించని జగన్‌ ఎక్కడ. స్వప్రయోజనాల కోసం పనిచేశారే తప్ప ప్రజల కోసం ఏం చేయలేదు. ఆఖరికి రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి వెళ్తున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లతో మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోతున్నారు’ అని షర్మిల మండిపడ్డారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్‌

‘రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి ఫ్యాక్షనిజం నిర్మూలనకు కృషి చేస్తే.. జగన్‌ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. హత్యలు చేసిన వారిని కాపాడుతున్నారు. రాజారెడ్డిని హత్య చేసిన వారిలో ఒకరైన సతీష్‌రెడ్డి ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు’ అని విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యారెడ్డి, విశాఖ తూర్పు, ఉత్తరం, దక్షిణ, భీమిలి కాంగ్రెస్‌ అభ్యర్థులు శ్రీనివాసరావు, రామారావు, సంతోష్‌, హాసిని వర్మ, పశ్చిమ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి విమల, గాజువాక సీపీఐ అభ్యర్థి జగ్గునాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img